కొరుక్కుపేట: వేద విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ప్రతీ నెలా నిర్వహించే ‘తరతరాల తెలుగు కవిత‘ ధారావాహిక సాహిత్య కార్యక్రమంలో 178వ కార్యక్రమంగా ’తెలుగుపద్య వైభవం’ అనే అంశంపై ఆదివారం ఆస్కాలో ఉపన్యాస కార్యక్రమం జరిగింది. విజయవాడకు చెందిన హరి శంకర శర్మ వక్తగా పాల్గొన్నారు . ముందుగా వేదవిజ్ఞాన వేదిక అధ్యక్షులు జె. కె. రెడ్డి , కార్యదర్శి మధులు వక్త హరి శంకర శర్మని వేదికపైకి సగౌరవంగా ఆహ్వానించి సంస్థ తరపున దుశ్శాలువ, నూతన వస్త్రాలు, జ్ఞాపికలు బహూకరించి ఘనంగా సత్కరించారు. అనంతరం జె. కె. రెడ్డి ప్రవచనకర్తను సభకు పరిచయం చేసి, తమదైన శైలిలో ఒకటిరెండు తెలుగుపద్యాలను అద్భుతంగా ఆలపించి శంకర శర్మ ఉపన్యాసం ప్రారంభింపజేశారు. తెలుగు పద్య వైభవం అనే అంశంపై అద్భుతంగా ఉపన్యసించిన శంకరశర్మ ఆదికవి నన్నయ్య నుండి నేటి ఆధునిక కవుల వరకు గల కావ్యాలలోని ప్రముఖ పద్యములను రాగయుక్తంగా ఆలపించి తెలుగు పద్యాల మాధుర్యం ఎలా వుంటుందో ఆహుతులకు వివరించారు. నన్నయ, తిక్కన, శ్రీనాథుడు, పోతన వంటి మహా కవుల కావ్య మధురిమలైన ప్రముఖ పద్యాలను, దాశరథి, గుర్రం జాషువా వంటి గొప్ప కవుల కావ్యాలలోని పద్యరత్నాలను, ముడియారం వేంకట శేషశర్మ, వేదుల సత్యనారాయణశాస్త్రి, కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రిల పద్యాలు స్వాతంత్య్ర కాంక్షను, దేశభక్తిని, దైవ భక్తిని ప్రేరేపింప జేసి మానవాళికి చక్కని మార్గ దర్శకత్వం ఎలా కలిగించాయో మధురంగా పాడి వివరించి, శ్రోతలను పరవశింప జేశారు. పోతన భాగవతంలోని బాలరసాల సాల నవపల్లవ కోమల కావ్యకన్యకన్, కాటుక కంటినీరు చనుకట్టుపయింబడ, లావొక్కింతయులేదు, అల వైకుంఠ పురంబులో నగరిలో, సిరికింజెప్పడు శంఖ చక్రయుగంబు చేదోయి సంధింపడు.. వంటి అనేక గొప్ప పద్యాలు, శతక, రంగస్థల పద్యాలు మధురంగా ఆలపించి తెలుగు పద్య వైభవాన్ని సాక్షాత్కరింపచేసి ప్రేక్షకులను ఉర్‌ూరతలూగించారు. తెలుగు భాషా మాధుర్యాన్ని ఆస్వాదించే ఉన్నత మనస్కులైన సదస్యులు ఆసాంతం ఆసక్తితో విని ఆనంద పారవశ్యంలో మునిగి తేలారు. సభానిర్వాహకులు వక్త హరి శంకర శర్మ గాన మాధుర్యాన్ని, వివిధ అంశాల విశ్లేషణాత్మక వివరణను, భాషాపటిమను ఘనంగా కొనియాడారు.ఈ కార్యక్రమంలో తెలుగు సాహితీ ప్రియులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


