అభిమాన సంఘాల నుంచి.. రాజకీయాల వైపు! | - | Sakshi
Sakshi News home page

అభిమాన సంఘాల నుంచి.. రాజకీయాల వైపు!

Oct 26 2026 2:22 AM | Updated on Oct 26 2026 2:22 AM

● మహిళా విభాగంతో

నటుడు ధనుష్‌ సమావేశం

సాక్షి, చైన్నె: నటుడు ధనుష్‌ తన అభిమాన సంఘాలను సామాజిక, రాజకీయ దిశగా నడిపించేందుకు వేగంగా అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా చైన్నె షోలింగనల్లూర్‌లోని జెప్పియార్‌ కళాశాల ఆడిటోరియంలో 30 జిల్లాలకు చెందిన 3,500 మందికి పైగా మహిళా విభాగ నిర్వాహకులతో ఆయన ఒక భారీ సంప్రదింపుల సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. ఇటీవల నిర్వహించిన కీలక సమావేశంలో ‘ఆల్‌ ఇండియా ధనుష్‌ ఫ్యాన్‌ క్లబ్‌’ పేరును అధికారికంగా ధనుష్‌ ఛారిటబుల్‌ ఆర్గనైజేషన్‌గా మార్చారు. కొత్త జెండా లోగోను సంస్థ సామాజిక లక్ష్యాలను ప్రతిబింబించేలా ఎరుపు, తెలుపు రంగుల్లో నాట్యం చేస్తున్న నక్షత్రం, మధ్యలో ధనుష్‌ చిత్రం కలిగినట్టు ప్రవేశపెట్టారు.

రాజకీయ ప్రచారం

ధనుష్‌ ఏలుచ్చి కలగం అనే పేరుతో రాజకీయ పార్టీని నమోదు చేయడానికి ఢిల్లీ వెళ్లారని ప్రచారం జరిగినప్పటికీ, అది ఆయన సొంత పని అని ధనుష్‌ వర్గాలు స్పష్టం చేశాయి. అయితే, క్షేత్రస్థాయిలో సభ్యత్వ నమోదు, రాజకీయ సంప్రదింపులు ముమ్మరంగా సాగుతున్నాయి. జిల్లాల వారీగా పర్యటిస్తూ నిర్వాహకులకు ఉత్సాహాన్ని నింపుతున్న ధనుష్‌, తన కుమారుడు లింగా నుంచి నేర్చుకున్న పలు విషయాలను పంచుకున్నారు. నేను నా కుమారుడితో వీడియో గేమ్స్‌ ఆడేటప్పుడు వరుసగా గెలిచినా, ఓడిపోతున్న తన కొడుకు మాత్రం వదలకుండా కనీసం ఒక్కసారైనా గెలిచే వరకు ప్రయత్నిస్తూనే ఉండేవాడు. చివరికి విజయం సాధించేవాడు. మనం కూడా గెలిచేంత వరకు విశ్రమించకుండా పోరాడాలనే పట్టుదలను అనే విషయాన్ని కుమారుడి నుంచే నేర్చుకున్నాను అని వివరించారు.

భారీ ఏర్పాట్లు –

అభిమానుల కోలాహలం..

ఆదివారం సమావేశం జరిగిన కళాశాల ప్రాంగణమంతా భారీ బ్యానర్లు, ధనుష్‌ కటౌట్లతో నిండిపోయింది. ‘ధనుష్‌.. రేపటి తమిళనాడు హీరో, మహిళల ప్రేమకు రక్షకుడైన సోదరుడు అనే నినాదాలు ఆకట్టుకున్నాయి. ఉదయం నుంచి వర్షం పడుతున్నప్పటికీ మహిళలు తమ పిల్లలతో సహా భారీగా తరలివచ్చారు. గుర్తింపు కార్డులను సమగ్రంగా తనిఖీ చేసిన తర్వాతే ఆడిటోరియం లోపలికి అనుమతించారు. ఉదయం 11 గంటలకు ప్రారంభం కావాల్సిన ఈ సమావేశం సాంకేతిక, ఇతర కారణాల వల్ల సమయం మారుతూ చివరకు మధ్యాహ్నం ప్రారంభమైంది. రాష్ట్ర నిర్వాహకులు సుబ్రహ్మణ్య శివ, రాజా తదితరుల పర్యవేక్షణలో జరిగిన ఈ సమావేశంలో మహిళా విభాగం నమోదు, కోయంబత్తూరులోని ప్రధాన అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొత్త నిర్వాహకుల నియామకం,, సంక్షేమ కార్యక్రమాల విస్తరణపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ధనుష్‌ రాజకీయ అడుగులపై

మహిళల ఆకాంక్షలు

సమావేశానికి హాజరైన మహిళా ప్రతినిధులు మీడియాతో మాట్లాడుతూ తమ సంతోషాన్ని, మద్దతును వ్యక్తం చేశారు. ధనుష్‌ గారు కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించబోతున్నారనే వార్త మాకు ఎంతో సంతోషాన్ని ఇస్తోంది. ప్రస్తుతం తమిళనాడు రాజకీయాల్లో ఒక రకమైన లోటు ఉంది. ధనుష్‌ సొంత కష్టంతో అగ్రస్థానానికి వచ్చి ఎన్నో జాతీయ అవార్డులు సాధించారు. ఆయన కష్టపడే తత్వాన్ని నమ్మి ఓటు వేయవచ్చు అని వ్యాఖ్యానించడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement