ఆరెంజ్‌ అలర్ట్‌ | - | Sakshi
Sakshi News home page

ఆరెంజ్‌ అలర్ట్‌

Oct 23 2026 1:57 AM | Updated on Oct 23 2026 1:57 AM

● 5 రోజుల పాటూ భారీ వర్షాలు ●నైల్లె, తూత్తుకుడి, తెన్కాసిలో కుండపోత ●చైన్నె, శివారుల్లో రాత్రులలో వాన జోరు ఙ ●తుపాన్‌ ఏర్పడిన పక్షంలో మురసుగా నామకరణం

బంగాళాఖాతంలోఅల్పపీడనం ఏర్పడనున్న నేపథ్యంలో తమిళనాడుకు వాతావరణ శాఖ ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. ఈశాన్య రుతుపవనాలు బలపడుతుండడంతో, రాబోయే ఐదు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని చైన్నె వాతావరణ కేంద్రం తెలిపింది.

కుట్రాలంలో నీటి ఉధృతి

కేరళ మార్గంలో విరిగిపడిన కొండచరియలు

సాక్షి, చైన్నె : ఈశాన్య రుతు పవనాల ప్రవేశంతో రాష్ట్రంలో పలు జిల్లాలో వర్షాలు కురుస్తూ వస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో ఉత్తర అండమాన్‌ సముద్రం వైపు నుంచి పశ్చిమ–వాయువ్య దిశగా కదులుతున్న వాతావరణ ప్రసరణ కారణంగా, ఆగ్నేయ, తూర్పు–మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది మరింత బలపడి తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ఈ తుపానుకు భారతదేశం సిఫార్సు చేసిన శ్రీమురసుశ్రీ అనే పేరును పెట్టనున్నారు. ఈ ఏడాది సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని, ముఖ్యంగా దక్షిణ జిల్లాల్లో వర్షాల ప్రభావం కొంచెం ఎక్కువగా ఉంటుందని వాతావరణ అధికారులు పేర్కొన్నారు.

విస్తారంగా వానలు

ఈశాన్య రుతు పవనాలు విస్తరించడంతో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. చైనె, శివారులలో బుధవారం రాత్రి నుంచి ఉదయం వరకు అనేక చోట్ల భారీ వర్షం పడింది.మరికొన్ని చోట్ల మోస్తారుగా వాన పడింది. అత్యధికంగా చైన్నెలోని ఎంజీఆర్‌ నగర్‌లో 15.6 సెంటీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది. గురువారం పలు చోట్ల చైన్నె, శివారులలో తెరపించి తెరపించి మోస్తరు వాన కురిసింది. వర్షాల కారణంగా రిజర్వాయర్లకు నీటిరాక పెరిగింది. పుళల్‌రిజర్వాయర్‌ నీటిమట్టం ఒక్క రోజులు మూడు అడుగుల పెరిగింది. ఇక, దక్షిణ తమిళనాడులోని కన్యాకుమారి, తిరునల్వేలి, తెన్కాసి, తూత్తుకుడిలలో అనేక చోట్ల భారీ వర్షాలు కురిశాయి. ఈ వర్షాలు ఇక్కడ కొనసాగుతున్నాయి. కన్యాకుమారిలో 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ జిల్లాలో పాపనాశం, మణిముత్తారు, సెర్వలార్‌ డ్యామ్‌లలోకి నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. కుట్రాలంలోని ప్రధాన జలపాతం, ఫైవ్‌ ఫాల్స్‌, పాత కూటాలం తదితర జలపాతాలు నీట మునగడంతో పర్యాటకుల ప్రవేశంపై నిషేధం విధించారు. ఈ జిల్లాలో అనేక మార్గాలలో రోడ్లు జలమయం కావడంతో కొన్ని గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వాగులు,వంకల తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగం ఆదేశించింది.

రైలు పట్టాలపై కొండచరియలు

కేరళ – కుమారి జిల్లా సరిహద్దులోని పరశాలై – నెయ్యరిన్‌కరై ప్రాంతాల మధ్య రైలు పట్టాలపై అకస్మాత్తుగా కొండచరియలు విరిగిపడ్డాయి. అదే మార్గంలో వస్తున్న బిలాస్‌పూర్‌ – నైల్లె ఎక్స్‌ప్రెస్‌ రైలు ఇంజిన్‌ బురదలో దిగబడి ఆగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. అయితే,ఎవ్వరికి ఎలాంటి గాయాలు కాలేదు. పట్టాలపై మట్టిని తొలగించే పనులు సుమారు 5 గంటల పాటు జరిగాయి. ఈ ఘటన కారణంగా మధురై, అనంతపురి, అమృత్‌ భారత్‌ ఎక్స్‌ప్రెస్‌లతో పాటు పలు రైళ్లు ఆలస్యంగా నడిచాయి. కొన్ని రైళ్లు రద్దు చేశారు.

భారీ నుంచి అతిభారీ వర్షాలు

కన్యాకుమారి, నీలగిరి, కోయంబత్తూరు, నామక్కల్‌, కరూర్‌, తిరుచ్చి, తేని జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెన్కాసి, దిండుగల్‌, పుదుకోట్టై, తంజావూరు, మైలాడుతురై, తూత్తుకూడి, తిరునెల్వేలి, అరియలూర్‌, మదురై, విరుదునగర్‌, తిరువారూర్‌, నాగపట్టణం, శివగంగ, రామనాథపురం, కడలూరు, విల్లుపురం, తిరుప్పూరు, పెరంబలూరు, పుదుచ్చేరి కారైకల్‌ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. అల్పపీడనం నేపథ్యంలో రాగల ఐదు రోజులు వర్షాలు పై జిల్లాలో కురుస్తాయని వాతావరణ కేంద్రం ప్రకటించడంతో ఆయా జిల్లాల అఽఽధికార యంత్రాంగాలు అప్రమత్తమయ్యాయి. ముందు జాగ్రత్తలను విస్తృతంచేస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం బలపడి తుఫానుగా మారిన పక్షంలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ వైపు కదిలే అవకాశం ఉన్నప్పటికీ, తమిళనాడుపై దీని ప్రభావం ఎంత ఉంటుందనేది అల్పపీడనం ఏర్పడిన తర్వాతే స్పష్టమవుతుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ తుపాన్‌కు మురసు అని నామకరణం చేయసే అవకాశాలు ఉన్నట్టు పేర్కొన్నారు. చైన్నెతో పాటు కాంచీపురం, తిరువళ్లూరు, చెంగల్పట్టు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాగా, వర్షాలనేపథ్యంలో గొడుగులు,రైన్‌ కోట్‌ల వ్యాపారం ఊపందుకుంటున్నది. రోడ్లపై దుకాణాలు వెలియడంతో తక్కువ ధరకు గొడుగులు, రైన్‌ కోట్‌లు లభిస్తుండటంతో కొనేందుకు వాహన దారులు ఆసక్తి చూపుతున్నారు.

స్టేట్‌ ఎమర్జన్సీసెంటర్‌లో సీఎం విజయ్‌

ఈశాన్య రుతుపవనాలు తీవ్రతరమవుతున్న నేపథ్యంలో సీఎం ఎస్‌. జోసెఫ్‌ విజయ్‌ గురువారం చైన్నె ఎళిలగంలోని ాష్ట్ర అత్యవసర నిర్వహణ కేంద్రంను సందర్శించి పరిశీలించారు. రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న ముందస్తు జాగ్రత్తలు, జిల్లా స్థాయి సన్నద్ధత , విపత్తు సహాయక చర్యల సమన్వయాన్ని ఆయన నేరుగా సమీక్షించారు. వాతావరణ శాఖ అతి భారీ వర్షాల హెచ్చరికలు జారీ చేసిన : నీలగిరి, కోయంబత్తూర్‌, దిండిగల్‌, తేని, మదురై, విరుదునగర్‌, తెన్‌కాశీ, కన్యాకుమారి, తిరునెల్వేలి, తూత్తుకూడి, శివగంగ, పుదుక్కోట్టై, తిరువారూర్‌, తంజావూరు, నాగపట్టణం , మైలాడుతురై తదితర 16 జిల్లాల కలెక్టర్లతో సీఎం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. వర్షాలు, వరదల కారణంగా ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా అత్యంత కఠినమైన ముందస్తు చర్యలు తీసుకోవాలని, లోతట్టు ప్రాంత ప్రజలకు తగిన రక్షణ కల్పించాలని ఈసందర్బంగా సీఎం ఆదేశించారు. విపత్తుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు రియల్‌ టైమ్‌లో పర్యవేక్షించేందుకు ఏర్పాటు చేసిన ఆధునిక డాష్‌బోర్డ్‌ను ముఖ్యమంత్రి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సెంగోట్టయన్‌, సీఎస్‌ సాయికుమార్‌, రెవిన్యూ అదనపు సీఎస్‌ డాక్టర్‌ బి. చంద్ర మోహన్‌, రెవిన్యూ కార్యదర్శి డాక్టర్‌ కె. ఎస్‌. పళనిస్వామి, విపత్తు నిర్వహణ శాఖ కార్యదర్శి ఎ. శివజ్ఞానం తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement