ఎన్నికల ఖర్చుల రికవరీ పిటిషన్‌ కొట్టివేత | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల ఖర్చుల రికవరీ పిటిషన్‌ కొట్టివేత

Sep 30 2026 12:22 AM | Updated on Sep 30 2026 12:22 AM

– రూ. లక్ష జరిమానా

సాక్షి, చైన్నె: విప్‌ ఉత్తర్వులను ధిక్కరించి ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేశారనే ఆరోపణలతో రాజీనామా చేసిన అన్నాడీఎంకే మాజీ ఎమ్మెల్యేల నుంచి ఎన్నికల ఖర్చులను రికవరీ చేయాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని మద్రాసు హైకోర్టు కొట్టివేసింది. ఈ పిటిషన్‌ కేవలం ప్రచార ప్రయోజనాల కోసమే దాఖలైనట్లు స్పష్టం చేస్తూ, పిటిషనర్‌కు రూ. 1 లక్ష జరిమానా విధించింది. విప్‌ ఉత్తర్వులను ఉల్లంఘించి ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేసిన అన్నాడీఎంకే మాజీ ఎమ్మెల్యేలు మధురాంతకం మరగదం కుమారవేల్‌, తారాపురం సత్యభామ, అంబాసముద్రం ఇసక్కి సుబ్బయ్య, పెరుందురై జయకుమార్‌, కరూర్‌ ఎం.ఆర్‌. విజయభాస్కర్‌ ,విరాళి మలై సి. విజయభాస్కర్‌ల నుండి ఎన్నికల ఖర్చును రికవరీ చేయాలని కోరుతూ చైన్నెకి చెందిన న్యాయవాది ఎస్‌. కాశీ రామలింగం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ ఆరుగురు ఎమ్మెల్యేలు తాముగా స్వచ్ఛందంగా పదవులకు రాజీనామా చేయలేదని, మంత్రి పదవి వల్ల కలిగే ప్రయోజనాలు, అదే నియోజకవర్గంలో మళ్లీ పోటీ చేసే అవకాశం కోసం, అలాగే అనర్హత వేటు నుంచి తప్పించుకోవడానికి మాత్రమే వారు రాజీనామా చేశారని పిటిషన్‌లో పేర్కొన్నారు.

కోర్టు విచారణ – హెచ్చరిక

న్యాయమూర్తులు ఎస్‌.ఎ. ధర్మాధికారి, అరుళ్మురుగన్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది. అంతకుముందే సెప్టెంబర్‌ 24న ఈ కేసుకు సంబంధించి ఉత్తర్వులు జారీ అయ్యాయని, ఒకవేళ వాదనలు కొనసాగించాలనుకుంటే రూ. 1 లక్ష జరిమానా చెల్లించాల్సి ఉంటుందని కోర్టు పిటిషనర్‌ను ముందుగానే హెచ్చరించింది. పిటిషనర్‌ తన వాదనలను వెనక్కి తీసుకోకుండా కొనసాగించడంతో, ఈ వ్యాజ్యం కేవలం ప్రచార ఆర్భాటం కోసం మాత్రమే దాఖలు చేయబడిందని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు పిటిషన్‌ను కొట్టివేస్తూ, రూ. 1 లక్ష జరిమానా విధించింది. ఈ జరిమానా మొత్తాన్ని త్వరగా వసూలు చేసి, నిర్ణీత వారాల్లోగా తమిళనాడు ప్రభుత్వ కమిషన్‌కు చెల్లించాలని రిజిస్ట్రీ విభాగాన్ని న్యాయమూర్తులు ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement