– పి. చిదంబరం డిమాండ్
సాక్షి, చైన్నె: ఓటర్ల జాబితా సవరణ , ఓట్ల అవకతవకలపై దేశవ్యాప్తంగా రాజకీయ దుమారం చెలరేగుతోంది. ఇందులో భాగంగానే ఓట్ల మోసానికి పాల్పడుతున్నారంటూ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌పై తక్షణమే కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరం డిమాండ్ చేశారు. శివగంగ జిల్లా కారైకుడి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ఎన్నికలకమిషన్‌కు వ్యతిరేకంగా భారీ నిరసన కార్యక్రమం జరిగింది.. ఈ నిరసనలో పాల్గొని మాట్లాడిన మాజీ కేంద్ర మంత్రి పి. చిదంబరం, ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని ఆరోపించారు. సుమారు 13.30 కోట్ల మంది ప్రజలను ఓటు హక్కు వినియోగించుకోకుండా అడ్డుకోవడం అతిపెద్ద ఓట్ల మోసం కాదా? ఇది పూర్తిగా ప్రజాస్వామ్య వ్యతిరేక చర్య అని ఆయన మండిపడ్డారు. ఈ అక్రమాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న రాహుల్ గాంధీకి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా అండగా ఉంటుందని స్పష్టం చేశారు. ఓట్ల రిగ్గింగ్‌కు బాధ్యులైన ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌పై క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని, ఓటర్ల జాబితా నుంచి అన్యాయంగా తొలగించిన 13.30 కోట్ల మంది పేర్లను వెంటనే మళ్లీ చేర్చాలని డిమాండ్ చేశారు.
విరుదునగర్‌లో కాంగ్రెస్ ఆందోళన
ఇదే డిమాండ్‌తో విరుదునగర్ జిల్లా కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన చేపట్టారు. తూర్పు జిల్లా అధ్యక్షుడు కృష్ణమూర్తి, పశ్చిమ జిల్లా అధ్యక్షుడు రాజమోహన్ సంయుక్తంగా ఈ ఆందోళనకు నాయకత్వం వహించారు. ఎస్‌ఐఆర్‌తో నిష్పక్షపాత ప్రజాస్వామ్య విధానాలను తుంగలో తొక్కి, ఓటర్ల జాబితా నుంచి పెద్దఎత్తున పేర్లను తొలగించడం , డేటాను తారుమారు చేయడంపై తక్షణమే ఉన్నత స్థాయి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. జాబితా నుంచి తొలగించబడిన ఓటర్ల పూర్తి వివరాలను కేంద్ర ప్రభుత్వం వెంటనే బయటపెట్టాలని కోరారు. కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తూ ఎన్నికల పారదర్శకతను దెబ్బతీస్తున్న ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను పదవి నుంచి తొలగించి, వెంటనే అరెస్టు చేయాలంటూ కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేశారు.


