● మారనున్న సచివాలయం, అసెంబ్లీ నిర్మాణ స్థలం ●అధికారులకు సీఎం విజయ్‌ ఆదేశాలు ●సచివాలయంలో చర్చ | - | Sakshi
Sakshi News home page

● మారనున్న సచివాలయం, అసెంబ్లీ నిర్మాణ స్థలం ●అధికారులకు సీఎం విజయ్‌ ఆదేశాలు ●సచివాలయంలో చర్చ

Sep 25 2026 1:47 AM | Updated on Sep 25 2026 1:47 AM

● మారనున్న సచివాలయం, అసెంబ్లీ నిర్మాణ స్థలం ●అధికారులకు సీఎం విజయ్‌ ఆదేశాలు ●సచివాలయంలో చర్చ

సాక్షి, చైన్నె: రాష్ట్రంలో చరిత్ర సృష్టించి కొత్తగా బాధ్యతలు చేపట్టిన టీవీకే ప్రభుత్వం సచివాలయం విషయంలో కీలక మార్పుల దిశగా ఆది నుంచి అడుగులు వేస్తూ వస్తోంది. దశాబ్దాల తరబడి సెయింట్‌ జార్జ్‌ కోటలో ఉన్న సీఎం కార్యాలయాన్ని తాజాగా పక్కనే ఉన్న నామక్కల్‌ కవింజ్ఞర్‌ మాళిగైకు తరలించే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ వ్యవహారం విమర్శలకు దారి తీసిన నేపథ్యంలో ఏకంగా కొత్త సచివాలయం నిర్మాణం అంశాన్ని తెరపైకి తెచ్చారు. సచివాలయం కోసం మెరీనా తీరంలోని పట్టినంబాక్కంలో స్థలం పరిశీలిస్తున్నట్టు సమాచారాలు వెలువడ్డాయి. ఇందుకు అనుగుణంగా ఇక్కడి 25.55 ఎకరాల స్థలంలో రూ. 1,200 కోట్ల వ్యయంతో కొత్త సచివాలయం, అసెంబ్లీ నిర్మాణం చేపట్టనున్నట్టు సెప్టెంబర్‌ 8న ఉత్తర్వులు జారీ అయ్యాయి.

తీవ్ర వ్యతిరేకత

.పట్టినంబాక్కం, ఆ పరిసరాలు నిత్యం రద్దీతో ఉంటాయి. పట్టినంబాక్కం సముద్ర తీరంలోని ఆ ప్రాంతాలను పడవలను నిలుపుకోవడానికి, వలలు ఆరబెట్టుకోవడానికి మత్స్యకారులు దశాబ్దాల పాటుగా ఉపయోగిస్తూ వస్తున్నారు. ఇక్కడ నిర్మాణం జరిగితే తమ జీవనోపాధి దెబ్బతింటుందని మత్స్య కారులలో ఆందోళన నెలకొంది. ఈ నిర్మాణానికి వ్యతిరేకంగా మత్స్య కారులు పోరుబాట పట్టారు. పట్టినంబాక్కం పరిధిలోని పదికి పైగా ఉన్న మత్స్యకార గ్రామాల ప్రజలు ఏకం కావడంతో వివాదం ముదిరినట్లయ్యింది. అదే సమయంలో టీవీకేకు బయటి నుంచి మద్దతు ఇస్తున్న సీపీఎం, సీపీఐలు సైతం ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించగా, డీఎంకే నేతృత్వంలో ఏకంగా కోర్టులో పిటిషన్‌ దాఖలైంది. అదే సమయంలో ఈ నిర్మాణ కోసం ఎంపిక చేసిన స్థలం సునామీ ప్రభావిత ప్రాంతం కావడం, పర్యావరణ సమస్యలు తలెత్తుతాయని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు.

దాటవేతతో చర్చ

మత్స్యకారులలో నిరసన జ్వాల రగలడం, ప్రతి పక్షాలు దుమ్మెత్తి పోయడంతో ఈ ప్రాజెక్టుపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని, కేవలం ప్రాథమిక ఉత్తర్వులు మాత్రమే ఇచ్చామని మంత్రి అధవ్‌ అర్జున వివరణ ఇస్తూ దాట వేత ధోరణి అనుసరించాల్సి వచ్చింది. అయితే, వ్యతిరేకత రోజు రోజుకూ పెరగడంతో ఈ ప్రాజెక్టును రద్దు చేసి, వేరే ప్రదేశానికి మార్చాల్సిన పరిస్థితి తాజాగా టీవీకే ప్రభుత్వానికి ఏర్పడింది. తమకు మద్దతు ఇస్తున్న సీపీఎం, సీపీఐలు సైతం ఈ వ్యవహారంలో తీవ్ర వ్యాఖ్యలు, ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన నేపథ్యంలో సీఎం విజయ్‌ పట్టినంబాక్కం స్థలం వ్యవహారంలో దృష్టి పెట్టినట్టు సమాచారం. ఇక్కడ చేపట్టదలచిన ప్రాజెక్టు ప్రణాళిక రద్దుకు ఆయన ఆదేశాలు జారీ చేసినట్టు సచివాలయంలో చర్చ జరుగుతున్నది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నారు.

పల్లవన్‌ హౌస్‌ వైపు దృష్టి

సచివాలయం నిర్మాణ పనులు పట్టినంబాక్కంలో ఆగినట్టే అన్న సంకేతాల నేపథ్యంలో ప్రత్యామ్నాయ స్థలంపై ప్రభుత్వం దృష్టి పెట్టినట్టు సమాచారాలు వెలువడ్డాయి. ఓమందూరార్‌ ఎస్టేట్‌కు కూత వేటు దూరంలో ఉన్న పల్లవన్‌ హౌస్‌ను పరిశీలిస్తున్నట్టు తెలిసింది. దివంగత డీఎంకే నేత కరుణానిధి సీఎంగా ఉన్న కాలంలో ఓమందూరార్‌ ఎస్టేట్‌లో నిర్మించిన బ్రహ్మాండ అసెంబ్లీ, సచివాలయాన్ని అన్నాడీఎంకే హయంలో మల్టి సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రిగా మారిన నేపథ్యంలో ఇక్కడికి కూత వేటు దూరంలో చైన్నె మెట్రో ట్రాన్స్‌ పోర్టు కార్పొరేషన్‌ (ఎంటీసీ), రవాణా శాఖ పరిధిలోని పల్లవన్‌ హౌస్‌ను ఎంపిక చేసేందుకు కసరత్తు జరుగుతున్నట్టు చర్చ సాగుతోంది. పల్లవన్‌ హౌస్‌ రవాణా కార్యాలయంలోనూ, పక్కనే బస్‌ డిపోతో పాటూ ఒకప్పటి పాత జైలుకు సంబంధించిన స్థలం సైతం కూత వేటు దూరంలో ఉండటంతో ఇక్కడ నిర్మాణాలకు అన్ని రకాల అనుకూల పరిస్థితులు ఉంటాయని భావిస్తున్నారు. ఇక్కడ ఓ వైపు ఓమందూరార్‌ ఎస్టేట్‌, అన్నా సాలై, మరో వైపు సెంట్రల్‌ రైల్వే స్టేషన్‌, రాజీవ్‌ గాంధీ ఆస్పత్రి, పూందమల్లి హైరోడ్డులు ఉండటంతో అన్నింటికి మధ్య భాగంగా కేంద్ర బిందువుగా సచివాలయం, అసెంబ్లీ భవనం నిలుస్తుందని భావిస్తున్నారు. కాగా, మంత్రి నిర్మల్‌కుమార్‌ స్పందిస్తూ, కొత్త సచివాలయం, అసెంబ్లీ భవనం నిర్మాణం చైన్నె నగరంలోనే ఉంటుందని స్పష్టం చేయడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement