– హైకోర్టులో కేసు కొట్టివేత
సాక్షి, చైన్నె: మాజీ బీజేపీ నాయకుడు, వి ది లీడర్స్ నేత అన్నామలైపై సేలంకు చెందిన సామాజిక కార్యకర్త పీయూష్ మనుష్ దాఖలు చేసిన వ్యక్తిగత కేసును మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జి.కె. ఇలంధిరియన్ తీర్పు వెలువరించారు. 2023లో తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అన్నామలై ఒక పత్రికా సమావేశంలో మాట్లాడుతూ.. నాస్తికులు ఆస్తికులను అవమానిస్తే 1956లో ముత్తురామలింగ తేవర్ చెప్పినట్లు మీనాక్షి దేవికి రక్తంతో అభిషేకం జరుగుతుందనే రీతిలో వ్యాఖ్యా నించారు. ఇది హింసను ప్రేరేపించేలా ఉందంటూ పీయూష్ మనుష్ సేలం కోర్టులో వ్యక్తిగత కేసు దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి సేలం కోర్టులో కేసును రద్దు చేయాలని కోరుతూ అన్నామలై తరఫున హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. సనాతనంపై అప్పట్లో వచ్చిన విమర్శలకు ప్రతిస్పందనగానే ఆయన ఆ వ్యాఖ్యలు చేశారని, ఎలాంటి ప్రాథమిక విచారణ జరపకుండా కింది కోర్టు కేసు స్వీకరించడం సరికాదని వాదించారు. ఇరువర్గాల వాదనలను విన్న మద్రాస్ హైకోర్టు అన్నామలైపై పీయూష్ మనుష్ దాఖలు చేసిన వ్యక్తిగత కేసుకు సంబంధించి విచారణను రద్దు చేస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.


