సాక్షి, చైన్నె: పెరంబలూరు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు దుర్మరణం చెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వివరాలు.. రామనాథపురం జిల్లా ముదుకులత్తూరుకు చెందిన కార్తీక్ తమ్ముడి వివాహం స్థానికంగా రెండు రోజుల క్రితం జరిగింది. ఈ పెళ్లికి హాజరయ్యేందుకు చైన్నె నుంచి కొందరు స్నేహితులు, కుటుంబ సభ్యులు కారులో రామనాథపురం వెళ్లారు. వివాహం ముగించుకుని తిరిగి చైన్నెకి బయలుదేరారు. గురువారం వేకువ జామున 2.30 గంటల సమయంలో పెరంబలూరు జిల్లా తురయమంగళం సమీపంలో ముందు వెళ్తున్న ఓమ్ని బస్సును వారి కారు వెనుక నుంచి అతి వేగంతో ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో కారులో ఉన్న ప్రభాకరన్, కాళీశ్వరన్ అక్కడికక్కడే ప్రాణా లు కోల్పోయారు. తీవ్రంగా గాయపడి పెరంబలూరు, తిరుచి ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేరిన కార్తీక్, సూర్య చికిత్స పొందుతూ మృతి చెందడంతో మృతుల సంఖ్య నాలుగుకు చేరింది. తీవ్ర గాయాలతో ఉన్న కన్నదాసన్, జాన్ కెన్నెడీ, శరణ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదం కారణంగా తిరుచ్చి –చైన్నె జాతీయ రహదారిపై కొంతసేపు ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న పెరంబలూరు పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, ఓమ్ని బస్సు డ్రైవర్ రాజశీలన్‌ను అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రమాదానికి గురైన కారు, మృతులు


