తిరువళ్లూరు: పూండి సత్యమూర్తి రిజర్వాయర్‌ను చైన్నె ప్రజలకు తాగునీటిని అందించే ప్రధాన రిజర్వాయర్‌గా పరిరక్షిస్తూనే, పర్యాటక కేంద్రంగా మార్చడానికి కృషి చేస్తామని జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి కుమార్ వ్యాఖ్యానించారు. తిరువళ్లూరు జిల్లాలో ఈశాన్య రుతుపవనాల ప్రభావం కారణంగా వర్షాలు పడితే వాటిని ఎదుర్కొవడానికి అధికారులు చేస్తున్న ఏర్పాట్లను మంత్రి కుమార్ జిల్లా అధికారులతో కలిసి పరిశీలించారు. పూండి సత్యమూర్తి సాగర్ రిజర్వాయర్‌లోని నీటి నిల్వలు, నీటి ఆధారిత కాలువలు, ఆవడి కార్పొరేషన్‌లో నీటి కొరతపై అధికారుల సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వర్షాలు ఎక్కువగా పడినా ప్రజలకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. ప్రాణనష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు మంత్రి తెలిపారు. జిల్లాలో జరుగుతున్న వేర్వేరు అబివృద్ది పనులను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించినట్టు తెలిపారు. పూండిలో ప్రస్తుతం వున్న నీటితో చైన్నె ప్రజలకు తాగునీటి ఇబ్బంది రాకుండా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ కవిత, ఎమ్మేల్యేలు డాక్టర్ అరుణ్‌కుమార్(తిరువళ్లూరు) కుట్టి ప్రకాశం( పూందమల్లి) రమేష్‌కుమార్(ఆవడి)తో పాటూ పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.


