క్షేత్రస్థాయి పదవులకు వయో పరిమితి | - | Sakshi
Sakshi News home page

క్షేత్రస్థాయి పదవులకు వయో పరిమితి

Aug 23 2026 1:40 AM | Updated on Aug 23 2026 1:40 AM

110కి చేరిన జిల్లాల సంఖ్య

పదవులకు వయోపరిమితి ఖరారు

కార్యవర్గ భేటీలో 9 కీలక

తీర్మానాలకు ఆమోదం

యువతకు అవకాశం: స్టాలిన్‌

సమావేశంలో

దురై మురుగన్‌, కనిమొళి తదితరులు

ప్రసంగిస్తున్న స్టాలిన్‌

సాక్షి, చైన్నె: అసెంబ్లీ ఎన్నికలలోఅధికారాన్ని కోల్పోయినానంతరం పార్టీలో ప్రక్షాళన దిశగా డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ కసరత్తు వేగవంతం చేశారు. ప్రత్యేక కమిటీని రంగంలోకి దించి రాష్ట్రవ్యాప్తంగా కేడర్‌, ముఖ్య నేతల అభిప్రాయాలను సేకరించారు.ఓటమికి గలకారణాలపై పోస్టుమార్టం చేస్తూ, రానున్న కాలంలో బలోపేతం దిశగా విప్లవాత్మక మార్పులతో కీలక అడుగులకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా చైన్నెలోని అన్నా అరివాలయం వేదికగా శనివారం డీఎంకే రాష్ట్ర కార్యవర్గం భేటీ అయింది. డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ అధ్యక్షతన జరిగిన ఈ భేటీకి ప్రధాన కార్యదర్శి దురై మురుగన్‌, కోశాధికారి టీఆర్‌బాలు, డిప్యూటీ ప్రధాన కార్యదర్శిలు కనిమొళి కరుణానిధి , కేఎన్‌ నెహ్రూ, ఎ. రాజ, ఐ పెరియస్వామి, తిరుచ్చి శివ, పొన్ముడి తదితరులు హాజరయ్యారు. ఈ సమావేశంలో తొమ్మిది తీర్మానాలు ఆమోదించారు. పార్టీ పరిపాలనా సౌలభ్యం కోసం ప్రస్తుతం ఉన్న 77 జిల్లాలను 110 జిల్లాలకు పెంచారు. ప్రతి రెండు శాసనసభ నియోజకవర్గాలకు ఒక పార్టీ జిల్లాగా పునర్వ్యవస్థీకరిస్తారు. జిల్లా కార్యదర్శుల గరిష్ట వయోపరిమితిని 70 ఏళ్లుగా నిర్ణయించారు. ఒకరు గరిష్టంగా 3 సార్లు మాత్రమే ఈ పదవిలో కొనసాగరని పేర్కొన్నారు. జిల్లాల సంఖ్య పెరగడంతో ఇకపై కార్పొరేషన్‌ సెక్రటరీ (మాహనగర కార్యదర్శి) పదవి అవసరం లేదని నిర్ణయించారు.

కార్పొరేషన్లలో బ్రాంచ్‌ వ్యవస్థ

కార్పొరేషన్ల బ్రాంచ్‌ వ్యవస్థ – యూనియన్లను పునర్‌ వ్యవస్థీకరిస్తూ తీర్మానించారు. చైన్నె, కోయంబత్తూర్‌, మధురై, తిరుచ్చి, సేలం వంటి ప్రధాన కార్పొరేషన్‌ ప్రాంతాలలో వార్డు పరిధిలో కొత్తగా బ్రాంచ్‌ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి పార్టీ యూనియన్‌ ఒకే అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఉండేలా చర్యలు తీసుకుంటారు. ఏ పంచాయతీని కూడా రెండుగా విభజించకూడదని స్పష్టం చేశారు. స్టాలిన్‌ కొత్త 110 జిల్లాల జాబితాను ప్రకటించిన వెంటనే, అన్ని జిల్లాల్లో కార్యవర్గ సమావేశాలు ఏర్పాటు చేసి.. 15 రోజుల్లోగా యూనియన్‌, టౌన్‌, వార్డు, బ్రాంచ్‌ స్థాయి కమిటీలను పునర్నిర్మించాలని ఆదేశించారు.

పార్టీ పునర్నిర్మాణానికే మార్పులు: స్టాలిన్‌

పార్టీ పునర్నిర్మాణానికే వ్యవస్థాగత మార్పులు చేస్తున్నామని డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌ ప్రకటించారు.కొత్త ముఖాలకు, యువతకు ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు. డీఎంకే ఇటీవల ఎదుర్కొన్న ఎన్నికల ఓటమికి అనేక కారణాలు చెబుతున్నారని, నియోజకవర్గాల వారీగా లోతుగా అన్వేషించడం, వ్యక్తులను మార్చడం కంటే పూర్తిస్థాయి ఆత్మపరిశీలన చేసుకోవడమే సరైనదని భావించాననని వివరించారు. అందుకే పార్టీ వ్యవస్థాగత నిర్మాణంలో కీలక మార్పులు చేపట్టాలని నిర్ణయించానని స్పష్టం చేశారు. చైన్నెలోని అన్నా అరివాలయంలో నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో ఎం.కె. స్టాలిన్‌ ఆవేశంగా, ఉద్వేగంగా, యువతకు ప్రోత్సాహాన్ని అందించే ప్రసంగం చేశారు.

డీఎంకే పునర్నిర్మాణంలో భాగంగా పార్టీ అధినేత ఎం.కె. స్టాలిన్‌ అధ్యక్షతన జరిగిన కార్యవర్గ సమావేశంలో చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. దాదాపు 45 ఏళ్ల తర్వాత పార్టీ నిర్మాణంలో అత్యంత విప్లవాత్మక మార్పులు చేపడుతూ 9 కీలక తీర్మానాలను ఆమోదించారు.

సీనియర్లలో కలకలం

ఈ కొత్త నిబంధనల ప్రకారం వయోపరిమితి, పదవీకాల పరిమితుల వలన ఇ.వి. వేలు, కే.కే.ఎస్‌.ఎస్‌.ఆర్‌. రామచంద్రన్‌, అనితా రాధాకృష్ణన్‌, ఎస్‌. రఘుపతి వంటి పలువురు సీనియర్‌ నాయకులు తమ జిల్లా కార్యదర్శి పదవులను కోల్పోయే అవకాశం ఏర్పడింది. పదవులు కోల్పోయే సీనియర్లకు రాష్ట్రస్థాయిలో ప్రత్యామ్నాయ బాధ్యతలు అప్పగించే అంశంపై ఈ సమావేశంలో ఎలాంటి తీర్మానం చేయకపోవడం గమనార్హం.

మార్పులు – రాబోయే ప్రణాళికలు

ఇకపై పార్టీలోని ప్రతి పదవికి తగిన వయోపరిమితి , పదవీకాలాన్ని నిర్దేశించనున్నామని, అత్యధిక సంఖ్యలో కొత్త ముఖాలకు, యువతకు, మహిళలకు అవకాశాలు కల్పిస్తామన్నారు. త్వరలోనే నిష్పాక్షికమైన రీతిలో కొత్త సభ్యత్వ నమోదు ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు.

బ్రాంచ్‌ సెక్రటరీ పదవులకు యువతకు పెద్దపీట వేస్తూ గరిష్ట వయోపరిమితి 45 ఏళ్లుగా నిర్ణయించారు. వీరు గరిష్టంగా 2 సార్లు మాత్రమే బాధ్యతలు చేపట్టవచ్చు. వార్డు, సర్కిల్‌ సెక్రటరీ కార్యదర్శి పదవులకు గరిష్ట వయోపరిమితి 50 ఏళ్లుగా నిర్ణయిస్తూ, వీరు కూడా గరిష్టంగా 2 సార్లు మాత్రమే కొనసాగవచ్చు. (చైన్నెలో సగటున 10,000 ఓటర్లు, ఇతర కార్పొరేషన్లలో 5,000 ఓటర్లకు ఒక వార్డు కమిటీ ఉంటుంది). టౌన్‌, యూనియన్‌, కార్పొరేషన్‌ డివిజన్‌ సెక్రటరీలు పదవులకెఉ గరిష్ట వయోపరిమితి 60 ఏళ్లుగా నిర్ణయిస్తూ, వీరు కూడా గరిష్టంగా 2 సార్లు మాత్రమే పదవిలో ఉండగలరని స్పష్టం చేశారు.

విప్లవాత్మక మార్పులకు శ్రీకారం

ఇది శాశ్వత ఓటమి కాదు

‘‘మనం చూడని గెలుపు లేదు, చూడని ఓటమి లేదు. ఈ ఓటమిని తాత్కాలికమైనదిగానే భావించాలి. పార్టీ భవిష్యత్తును పక్కాగా ప్రణాళిక చేసుకోవడానికి లభించిన అవకాశంగా దీనిని స్వీకరిద్దాం. పార్టీ ప్రారంభమై 75 ఏళ్లు పూర్తయినా నిలదొక్కుకోవడానికి బలమైన వ్యవస్థాగత నిర్మాణమే కారణం’’ అని వివరించారు. ఓటమిపై విశ్లేషించేందుకు 38 మందితో కూడిన పరిశీలన కమిటీని ఏర్పాటు చేశామని, ప్రతి నియోజకవర్గం నుంచి అభిప్రాయాలు సేకరించి నివేదిక తయారు చేశారని గుర్తుచేశారు. దీంతో పాటు వెబ్‌సైట్‌ ద్వారా కూడా ప్రజలు, నాయకుల నుంచి వేలాది సూచనలు స్వీకరించానని వివరించారు. ఈ అభిప్రాయాల ఆధారంగా పార్టీని బలోపేతం చేసేందుకు తంగం తెన్నరసు నేతృత్వంలో పునర్నిర్మాణ కమిటీ రూపొందించిన తాత్కాలిక నివేదిక ఆధారంగా ఈ మార్పులు చేపడుతున్నామని ప్రకటించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement