సాక్షి, చైన్నె: విద్యార్థుల చదువుకు పేదరికం ఏమాత్రం అడ్డంకి కాకూడదనే ఉద్దేశంతో ప్రజా విరాళాలు, పూర్వ విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల సహాయాన్ని సమకూర్చుకుని పాఠశాలకు అవసరమైన ఆధునిక సౌకర్యాలను కల్పించినట్లు జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారానికి ఎంపికై న ఉపాధ్యాయుడు ఎం. తంగరాజ్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఏటా సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇచ్చే ఈ అవార్డుకు తమిళనాడు నుంచి ఇద్దరు ఉపాధ్యాయులు ఎంపికయ్యారు. ఇందులో తెన్కాశి జిల్లా పుళియంపట్టి యూనియన్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు ఎం. తంగరాజ్, మధురై పీఎం శ్రీ ఐ కేంద్రీయ విద్యాలయ ఉపాధ్యాయురాలు అముద ఉన్నారు.
తంగరాజ్ విద్యా సేవలు
పాఠశాలలో డిజిటల్ విద్యను ప్రోత్సహించడానికి స్మార్ట్ టీవీలు, ప్రొజెక్టర్లు, ఆండ్రాయిడ్ టీవీలు, ఇంటరాక్టివ్ బోర్డులు వంటి సౌకర్యాలను తంగరాజ్ కల్పించారు. పుస్తకాలను బట్టీ పట్టించడం కంటే ఆటలు, కథలు, ఆర్ట్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్, ప్రాజెక్టులు, ఫ్లాష్ కార్డ్‌లు మరియు ఆడియో–విజువల్ పరికరాల ద్వారా విద్యార్థులకు సులభంగా అర్థమయ్యేలా పాఠాలు బోధిస్తూ వచ్చారు. చదువుతో పాటు యోగా, చెస్, క్యారమ్, శిలంబం, కబడ్డీ, ఖో–ఖో, డానన్స్ వంటి క్రీడా, సాంస్క్కతిక అంశాలలో విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు.
బాధ్యత పెరిగింది
తనకు అవార్డు దక్కిన సందర్భంగా తంగరాజ్ ఆనందం వ్యక్తం చేశారు. పేదరికం కారణంగా ఏవిద్యార్ధికి చదువు దూరం కాకూడదన్నారు. ఈ పురస్కారం తనపై బాధ్యతను మరింత పెంచిందన్నారు. ఇప్పటి వరకు విద్యార్థుల చదువుకు పేదరికం ఏమాత్రం అడ్డంకి కాకూడదనే ఉద్దేశంతో ప్రజా విరాళాలు, పూర్వ విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల సహాయాన్ని సమకూర్చుకుని పాఠశాలకు అవసరమైన ఆధునిక సౌకర్యాలను కల్పించినట్లు వివరించారు.
విజయ్ శుభాకాంక్షలు
జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికై న తమిళనాడు ఉపాధ్యాయులు తంగరాజ్, అముదలకు సీఎం విజయ్ ప్రత్యేక అభినందనలు తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే పవిత్రమైన బాధ్యతను నిర్వర్తిస్తూ, వినూత్న బోధనా పద్ధతులతో రాష్ట్ర విద్యా రంగానికి , ఉపాధ్యాయ లోకానికి వీరు గర్వకారణంగా నిలిచారని కొనియాడారు. ఈ పురస్కారం మరెంతో మంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపడానికి స్ఫూర్తినిస్తుందని ఆయన ఆకాంక్షించారు.


