రాష్ట్రవ్యాప్తంగా
సీపీఎం నిరసనలు
అధికారులు కావాలో..మేమే కావాలో... తేల్చుకోండి
ప్రభుత్వానికి షణ్ముగం అల్టిమేట్టం
సాక్షి, చైన్నె : రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయికుమార్‌కు వ్యతిరేకంగా సీపీఎం పోరాట బాట పట్టింది. ఆయన్ని ఆ పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తూ శనివారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు దిగారు. అధికారులు కావాలో...తాము కావాలో..తేల్చుకోవాలంటూ టీవీకే సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతు విషయంగా సీపీఎం రాష్ట్ర కార్యదర్శి షణ్ముగం అల్టిమేటం ఇచ్చారు. వివరాలు.. వామపక్షాల అనుబంధ,,కరాప్పాన్ పూచ్చి వంటి విద్యార్థి సమూహాల తరఫున నిర్వహించే పోరాటాలలో విద్యార్థులు పాల్గొనకుండా నిరోధించేందుకు పాఠశాల విద్య, ఉన్నత విద్య, పోలీస్ శాఖ , జిల్లా యంత్రాంగం సమన్వయంతో ఉమ్మడి చర్యలు చేపట్టాలని కాలేజీ విద్య డైరెక్టర్ ఆదేశాలు జారీ చేయడాన్ని సీపీఎం తీవ్రంగా పరిగణించింది. ప్రతి పక్షాల విమర్శల నేపథ్యంలో ఈ ఉత్తర్వులను ప్రభుత్వం వెనక్కు తీసుకున్నప్పటికీ, దీనిని సీఎం విజయ్‌కు కూడా తెలియకుండా జారీ చేసిందెవరో అన్న చర్చ ఊపందుకుంది. ఈ పరిస్థితులలో ఈ ఉత్తర్వులకు బాధ్యత వహించే విధంగా సీఎస్ సాయికుమార్‌ను టార్గెట్ చేస్తూ శనివారం సీపీఎం నేతృత్వంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చోటు చేసుకున్నాయి.
సీఎస్‌పై చర్యలు తీసుకోవాలి
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎం. సాయికుమార్ ఒత్తిడి మేరకే విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసిందని, ఇది విద్యార్థుల ప్రజాస్వామ్య హక్కులను హరించడమేనని సీపీఎం రాష్ట్ర కార్యదర్శిషణ్ముగం ఆగ్రహం వ్యక్తం చేశారు. చైన్నె పనగల్‌మాళిగై వద్ద సీఎస్‌పై చర్యలుతీసుకోవాలని, ఆ పదవి నుంచి తప్పించాలని నినాదిస్తూ సీపీఎం నేతృత్వంలో జరిగిన నిరసనలో ఆయన ప్రసంగించారు. ఓ వైపు విద్యార్థుల పోరాటాలను అణచి వేసే విధంగా, మరో వైపు గుజిలియంపారై తహశీల్దార్ వివాదంపై శాసనసభలో రెవెన్యూ మంత్రి మాట్లాడేటప్పుడు చర్యలు తీసుకుంటున్నామని చెప్పినప్పటికీ, శిక్షణ పూర్తి కావడంతో డిజాస్టర్ మేనేజ్‌మెంట్ కమిషన్‌కు బదిలీ చేసినట్లు కలెక్టర్ నోట్ చెప్పడం ప్రభుత్వ వైఖరికి అద్దం పడుతోందన్నారు. లెఫ్ట్ పార్టీలను, వారి పోరాటాలను వరుసగా టార్గెట్ చేయడం యాధృచ్ఛికం కాదని, సీఎస్ ఎం. సాయికుమార్ , గుజిలియంపారై తహశీల్దార్‌పై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వానికి తాము కావాలో...? లేదా అధికారులు కావాలో.? అని పేర్కొంటూ సంకీర్ణ ప్రభుత్వానికిమద్దతు విషయంగా వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇక,సీపీఐ వీర పాండియన్ సైతం ఈ వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై సీఎం విజయ్ స్వయంగా వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాగా, ఈ ఉత్తర్వుల వ్యవహారం దుమారం రేపుతుండటంతో విద్యాకమిషన్ దృష్టి పెడుతూ వివరణకు ఆదేశించడం గమనార్హం.


