సీఎం విజయ్‌ వ్యాఖ్య | - | Sakshi
Sakshi News home page

సీఎం విజయ్‌ వ్యాఖ్య

Jun 9 2026 5:48 AM | Updated on Jun 9 2026 5:48 AM

● నార్వే చెస్‌ విజేత ప్రజ్ఞానందకు నగదు ప్రోత్సాహం ● రూ.50 లక్షలు అందజేసిన సీఎం

● నార్వే చెస్‌ విజేత ప్రజ్ఞానందకు నగదు ప్రోత్సాహం ● రూ.50 లక్షలు అందజేసిన సీఎం

సాక్షి, చైన్నె: తమిళనాడు క్రీడా శాఖ తరపున గ్రాండ్‌ మాస్టర్‌ ఆర్‌. ప్రజ్ఞానందను రాష్ట్ర ప్రభుత్వం సన్మానించింది. ఈ సందర్భంగా గ్రాండ్‌మాస్టర్‌ ప్రజ్ఞానంద నార్వే చెస్‌ టోర్నీలో తాను గెలుచుకున్న చారిత్రాత్మక విజేత ట్రోఫీని సీఎం విజయ్‌కు చూపించి, ఆయన అభినందనలు, ఆశీస్సులు అందుకున్నారు. క్రీడల అభివృద్ధికి తమిళనాడు ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నట్టు, క్రీడా రంగంలో తమిళనాడును దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు కట్టుబడి ఉన్నామని ఈసందర్భంగా సీఎం విజయ్‌ వ్యాఖ్యలు చేశారు. అంతర్జాతీయ, జాతీయ స్థాయి పోటీల్లో రాష్ట్ర అథ్లెట్లు పాల్గొని పతకాలు సాధించేలా వారికి అత్యాధునిక శిక్షణ అందించడం, విజేతలకు భారీ నగదు బహుమతులు ప్రకటించడం , క్రీడా మౌలిక వసతులను బలోపేతం చేయడం వంటి అనేక విప్లవాత్మక చర్యలను ప్రభుత్వం చేపడుతోందని వివరించారు. ఇందులో భాగంగానే, గ్రాండ్‌మాస్టర్‌ ప్రజ్ఞానందకు తమిళనాడు క్రీడాభివృద్ధి సంస్థ ప్రతిష్టాత్మక ‘ఎలైట్‌’ స్కాలర్‌షిప్‌ పథకం కింద ఏటా రూ.30 లక్షల ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్లు వివరించారు.

నార్వే చెస్‌ 2026 టోర్నమెంట్‌లో సరికొత్త చరిత్ర సృష్టించి ప్రతిష్టాత్మక టైటిల్‌ను గెలుచుకున్న తొలి భారతీయ గ్రాండ్‌మాస్టర్‌గా రికార్డు నెలకొల్పిన ఆర్‌. ప్రజ్ఞానందను తమిళనాడు ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. చైన్నెలోని సచివాలయంలో సోమవారం జరిగిన కార్యక్రమంలో సీఎం సి. జోసెఫ్‌ విజయ్‌ చేతుల మీదుగా ప్రజ్ఞానందకు రూ.50 లక్షల భారీ ప్రోత్సాహక నగదు బహుమతి చెక్కును అందజేశారు.

చైన్నెలో ‘హోమ్‌ ఆఫ్‌ చెస్‌’ అకాడమీ

క్రీడలను కేవలం ఒక ఆటగా కాకుండా, సామాజిక మార్పునకు ఒక శక్తివంతమైన సాధనంగా సీఎం సి. జోసెఫ్‌ విజయ్‌ నాయకత్వంలోని ప్రభుత్వం భావిస్తున్నట్టు ఈసందర్భంగా ప్రకటించారు. యువతలో దాగి ఉన్న నైపుణ్యాలను సరైన దిశలో మళ్లించి, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడమే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశంగా వివిరించారు. ఈ లక్ష్య సాధన కోసం చైన్నెలోని జవహర్‌లాల్‌ నెహ్రూ స్టేడియంలో ‘హోమ్‌ ఆఫ్‌ చెస్‌‘ పేరిట ఒక ప్రత్యేకమైన చెస్‌ అకాడమీని తమిళనాడు ప్రభుత్వం ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. ఈ అకాడమీ ద్వారా యువ క్రీడాకారులకు క్రమబద్ధమైన శిక్షణ శిబిరాలు నిర్వహించడం, అంతర్జాతీయ స్థాయి అనుభవాన్ని కల్పించడం, మోడరన్‌ సాఫ్ట్‌వేర్‌ టూల్స్‌తో అడ్వాన్స్‌డ్‌ ట్రైనింగ్‌ ఇవ్వడం జరుగుతున్నట్టు వివరించారు.అలాగే, ఆటగాళ్ల మానసిక దృఢత్వం, వ్యూహాత్మక ప్రణాళికలు , మేధో వికాసానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. తక్కువ వయసులోనే క్రీడాకారులు ఇంటర్నేషనల్‌ మాస్టర్‌ , గ్రాండ్‌మాస్టర్‌ వంటి అత్యున్నత హోదాలను సాధించేలా ప్రోత్సహించడమే ఈ అకాడమీ ప్రధాన లక్ష్యంగా ప్రకటించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తమిళనాడు ప్రజాపనులు, క్రీడాభివృద్ధి శాఖ మంత్రి ఆధవ్‌ అర్జున, క్రీడాభివృద్ధి సంస్థ సభ్య కార్యదర్శి జె. మేఘనాథ రెడ్డి, గ్రాండ్‌మాస్టర్‌ ప్రజ్ఞానంద తల్లిదండ్రులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement