విద్యుత్‌ కోతలపై వివాదం | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ కోతలపై వివాదం

Jun 9 2026 5:48 AM | Updated on Jun 9 2026 5:48 AM

– టీవీకే ఎమ్మెల్యే పల్లవికి డీఎంకే లీగల్‌ నోటీసు

సాక్షి, చైన్నె: తమిళనాడులో నెలకొన్న విద్యుత్‌ కోతల సమస్యకు డీఎంకే నాయకులే కారణమంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తిరు వి.కా నగర్‌ నియోజకవర్గ టీవీకే ఎమ్మెల్యే పల్లవికి డీఎంకే తరపున నష్టపరిహారం , అవమానకర వ్యాఖ్యల నోటీసు పంపినట్లు ఆ పార్టీ అధికార ప్రతినిధి శరవణన్‌ అన్నాదురై వెల్లడించారు. సోమవారం మీడియాతో మాట్లాడిన శరవణన్‌ అన్నాదురై, రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీవీకే ప్రభుత్వంపై, సీఎం విజయ్‌ పరిపాలనపై తీవ్ర విమర్శలు గుప్పించారు.టీవీకే ప్రభుత్వానికి పరిపాలన చేతకావడం లేదన్నారు. ప్రస్తుతం తమిళనాడులో నెలకొన్న విద్యుత్‌ సంక్షోభాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియక టీవీకే ప్రభుత్వం, ఆ పార్టీ మంత్రులు పూర్తిగా అయోమయంలో పడిపోయారన్నారు. విద్యుత్‌ కోతలను అదుపు చేయడంలో ఘోరంగా విఫలమయ్యారని ధ్వజమెత్తారు. వేసవి కాలంలో ఎదురొయ్యే ఈ పరిస్థితిని గత ఐదేళ్లుగా తమ ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొన్నామని, అయితే, ఇప్పుడు వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే డీఎంకేపై నిందలు వేస్తున్నారన్నారు. టీవీకే మంత్రులు ఒక్కొక్కరు ఒక్కో రకమైన పరస్పర విరుద్ధ ప్రకటనలు చేస్తూ కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు.తిరు వి.క నగర్‌ ఎమ్మెల్యే పల్లవి అత్యంత బాధ్యతారహితంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలోని పవర్‌ కట్స్‌కు డీఎంకే వారే కారణమంటూ బురదజల్లారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే ఆమెకు లీగల్‌ నోటీసు పంపామని, తాను చేసిన అబద్ధపు ఆరోపణలకు గాను ఎమ్మెల్యే పల్లవి బహిరంగంగా డీఎంకే పార్టీకి క్షమాపణలు చెప్పాలని శరవణన్‌ అన్నాదురై డిమాండ్‌ చేశారు.

సముద్రంలో గల్లంతైన జాలర్ల రక్షింపు

తిరువొత్తియూరు: కడలూరు జిల్లా పరంగిపేట్టై పుదుపేట షణ్ముగ నగర్‌కు చెందిన రవి అలియాస్‌ రమేష్‌ (28), అదే ప్రాంతానికి చెందిన మనోహర్‌ (27), పుదుచ్చేరి రాష్ట్రం కనకచెట్టికుళం తెర్కు వీధికి చెందిన నాగవేల్‌ (40) అనే ముగ్గురు జాలర్లు ఈనెల 2వ తేదీ ఓ ఫైబర్‌ బోటులో సముద్రంలో వేటకు వెళ్లారు. మరుసటి రోజు (3వ తేదీ) వారు తిరిగి రావాల్సి ఉండగా, ఎంతకీ తిరిగి రాలేదు. దీంతో ఆందోళన చెందిన తోటి మత్స్యకారులు గాలించినా వారి ఆచూకీ లభించలేదు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు, మత్స్యకారులు పరంగిపేట్టై సమీపంలోని అన్నన్‌ కోవిల్‌ ప్రాంతంలో రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. దీంతో మత్స్యశాఖ అధికారులు జాలర్ల కోసం వెతుకులాట ప్రారంభించారు. ఈ పరిస్థితుల్లో అన్నన్‌ కోవిల్‌ గ్రామానికి వెళ్లిన చిదంబరం నియోజకవర్గ ఎమ్మెల్యే తమిళన్‌.. అన్సారీ మాయమైన మత్స్యకారుల కుటుంబ సభ్యులను కలిసి, పడవ యజమానితో సహా మత్స్యకారులతో జరిగిన సంఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ పరిస్థితిలో, సోనంకుప్పంకు చెందిన నలుగురు మత్స్యకారులు సోమ వారం చేపల వేట కోసం సముద్రంలోకి వెళ్లారు. అక్కడ నడి సంద్రంలో ఆగిపోయిన బోట్‌లో గల్లంతైన జాలర్లు స్పృహ తప్పి పడి ఉన్నట్లు గుర్తించి వారిని తమ పడవలోకి ఎక్కించుకున్నారు. దీని గురించి తమ వద్ద ఉన్న వైర్‌లెస్‌ పరికరం ద్వారా మత్స్యశాఖ అధికారులకు సమాచారం అందించారు. దాని ప్రకారం, మత్స్యశాఖ అధికారులు తీరంలో 108 అంబులెనన్స్‌తో సిద్ధంగా ఉన్నారు. పడవ తీరానికి రాగానే, వారిని పడవ నుండి దించి 108 అంబులెన్స్‌ ద్వారా కడలూర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

కొకై న్‌ స్మగ్లింగ్‌లో

నిందితుడికి 10 ఏళ్లు జైలు

సాక్షి, చైన్నె : తూత్తుకుడిలో రూ. 2,000 కోట్ల విలువైన కొకై న్‌ డ్రగ్స్‌ అక్రమ రవాణా చేసిన కేసులో నిందితుడికి కోర్టు 10 ఏళ్ల జైలు శిక్ష విధించించింది. వివరాలు.. 2021 ఏప్రిల్‌లో విదేశాల నుండి కార్గో షిప్‌ ద్వారా తూత్తుకుడి ఓడరేవుకు ఒక ప్రత్యేక కంటైనర్‌ వచ్చింది. ఇందులో మాదకద్రవ్యాలు ఉన్నట్లు అంతర్జాతీయ నిఘా సంస్థల నుండి భారత రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ అధికారులకు రహస్య సమాచారం అందింది.దీని ఆధారంగా రంగంలోకి దిగిన అధికారులు, సదరు కంటైనర్‌ రికార్డులను పరిశీలించి తూత్తుకుడిలోని ఒక డిపార్ట్‌మెంట్‌ స్టోర్‌ గోడౌన్‌లో తనిఖీలు చేపట్టారు. అక్కడ దిగుమతి చేసుకున్న టేకు కలప దుంగల మధ్య అత్యంత చాకచక్యంగా దాచి ఉంచిన 303 కిలోల నాణ్యమైన కొకై న్‌ని స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ సుమారు రూ. 2,000 కోట్లు ఉంటుందని అధికారులు నిర్ధారించారు. ఈ కంటైనర్‌ చైన్నెకి చెందిన ఓ లాజిస్టిక్స్‌ కంపెనీ ఐపీ అడ్రస్‌, ఆఫీస్‌ సిబ్బంది అయిన సతీష్‌ కుమార్‌ అనే ఉద్యోగి మొబైల్‌ నంబర్‌ ఉన్నట్లు తేలింది.అధికారులు సతీష్‌ కుమార్‌ను విచారించగా, తన బ్రాంచ్‌ మేనేజర్‌ అయిన లియో రోసారియో జోసెఫ్‌ (49) ఆదేశాల మేరకే తాను ఆ కార్గో పెట్టె రాకను పర్యవేక్షించానని అంగీకరించారు. తుది విచారణ అనంతరం మధురై కోర్టు సోమవారం తీర్పు వెలువరించింది. నిందితుడు లియోకి 10 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చింది. ఈ అంతర్జాతీయ డ్రగ్స్‌ స్మగ్లింగ్‌ కేసులో చైన్నె మన్నడి ప్రాంతానికి చెందిన రషీద్‌ అనే వ్యక్తి ప్రధాన సూత్రధారి అని విచారణలో తేలింది. నేటీకి పరారీలో ఉన్న రషీద్‌ కోసం పోలీసులు, ప్రత్యేక నిఘా సంస్థలు చురుగ్గా గాలిస్తున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement