సాక్షి, చైన్నె : చైన్నె మహానగర కార్పొరేషన్ లో చట్ట నిబంధనలను తుంగలో తొక్కుతూ మేయర్ ఆర్. ప్రియ, డిప్యూటీ మేయర్ మహేష్ కుమార్‌లతో పాటు ఏకంగా 157 మంది కార్పొరేటర్లు తమ ఆస్తుల వివరాలను సమర్పించలేదనే సంచలన విషయం సమాచార హక్కు చట్టం ద్వారా సోమవారం వెలుగుచూసింది. ప్రస్తుత పాలకవర్గం పదవీకాలం మరో 8 నెలల్లో ముగియనున్న తరుణంలో, ప్రజాప్రతినిధుల తీరు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
చట్టం ఏం చెబుతోంది?
తమిళనాడు ప్రభుత్వం 1998లో తమిళనాడు పట్టణ స్థానిక సంస్థల చట్టాన్ని తీసుకువచ్చింది. దీనికి 2022లో కీలక సవరణలు చేస్తూ 34ఏ అనే కొత్త నిబంధనను చేర్చారు. దీని ప్రకారం.. పట్టణ స్థానిక సంస్థల్లోని మేయర్లు, డిప్యూటీ మేయర్లు, కౌన్సిలర్లు తాము పదవీ బాధ్యతలు స్వీకరించిన 90 రోజులలోపు తమ స్వంత ఆస్తులతో పాటు తమ భార్య, భర్త, పిల్లల ఆస్తుల వివరాలను కార్పొరేషన్‌లో సమర్పించాలి. అనంతరం 2023లో తెచ్చిన నిబంధనలలోని రూల్ 183 ప్రకారం.. ఈ ఆస్తి వివరాల పత్రాలను కార్పొరేషన్ కమిషనర్‌కు అందజేయాలి. కమిషనర్ వాటిని అత్యంత భద్రంగా దాచాల్సి ఉంటుంది.
సమాచార విచారణలో షాకింగ్ నిజాలు
ఆమ్ ఆద్మీ పార్టీ కి చెందిన న్యాయవాది శంకర్.. చైన్నె కార్పొరేటర్ల ఆస్తి వివరాల సమర్పణపై సమాచార హక్కు చట్టం కింద వివరాలు కోరారు. దీనికి కార్పొరేషన్ యంత్రాంగం ఇచ్చిన సమాధానం అందరినీ షాక్‌కు గురిచేసింది. చైన్నె కార్పొరేషన్‌లోని మొత్తం 200 వార్డు లలో కార్పొరేటర్లు ఉన్నారు. ఇందులో మేయర్ ప్రియ, డిప్యూటీ మేయర్ మహేశ్‌కుమార్‌తో పాటుగా 157 మంది తమ ఆస్తుల వివరాలను సమర్పించక పోవడం గమనార్హం. కేవల 43 మంది మాత్రమే తమ వివరాలను సమర్పించి ఉన్నారు. మిగిలిన వారిలో నలుగురు ఇప్పటికే మరణించగా, ఇద్దరు అనర్హతకు గురయ్యారు. చట్టాన్ని గౌరవించకుండా, నిబంధనలను ఉల్లంఘించిన ప్రజాప్రతినిధుల జాబితాను కూడా కార్పొరేషన్ అధికారికంగా విడుదల చేయడం గమనార్హం.
కార్పొరేషన్ భవనం
చర్యలకు చట్టంలో చోటు లేదు
ఈ ఉల్లంఘనపై సదరు కార్పొరేటర్లపై ఎలాంటి చర్యలు తీసుకుంటారని అధికారులను ప్రశ్నించగా, వారు చేతులెత్తేశారు. నిబంధనల ప్రకారం ప్రజాప్రతినిధులు 90 రోజుల్లోగా ఆస్తి వివరాలు సమర్పించాలని మాత్రమే పేర్కొన్నారు. ఒకవేళ ఆ గడువులోగా వివరాలు ఇవ్వకపోతే వారిపై ఎలాంటి చట్టపరమైన లేదా క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలో సవరించిన చట్టంలో ఎక్కడా స్పష్టంగా పొందుపరచలేదన్నారు. చర్యలకు చట్టంలో ఆస్కారం లేనందున ఏమీ చేయలేకపోతున్నామన్నారు. అదే సమయంలో తాజా పరిస్థితుల నేపథ్యంలో అందరికీ నోటీసులు పంపించామని, 30 రోజులలోపు వివరాలను సమర్పించాలని ఆదేశించినట్టు పేర్కొన్నారు.


