డీవీఏసీ డైరెక్టర్‌ అరుణ్‌పై ఫిర్యాదు | - | Sakshi
Sakshi News home page

డీవీఏసీ డైరెక్టర్‌ అరుణ్‌పై ఫిర్యాదు

Jun 9 2026 5:48 AM | Updated on Jun 9 2026 5:48 AM

– సవుక్కు శంకర్‌ సంచలన వ్యాఖ్యలు

సాక్షి, చైన్నె: అవినీతి నిరోధక శాఖ (డీవీఏసీ) డైరెక్టర్‌ అరుణ్‌ ఐపీఎస్‌ తనను హతమార్చేందుకు ముంబైకి చెందిన కిరాయి ముఠాను రంగంలోకి దించారంటూ ప్రముఖ యూట్యూబర్‌, సామాజిక విశ్లేషకుడు సవుక్కు శంకర్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఆయన చైన్నె పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో సోమవారం రాతపూర్వక ఫిర్యాదును అందజేశారు.అనంతరం మీడియాతో మాట్లాడిన సవుక్కు శంకర్‌, తమిళనాడు ప్రభుత్వ యంత్రాంగం , పోలీసు అధికారుల తీరుపై పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.

రంగలోకి ముంబై నుంచి కిరాయి ముఠా

ప్రస్తుతం డీవీఏసీ డైరెక్టర్‌గా ఉన్న అరుణ్‌ ఐపీఎస్‌ తనను అంతమొందించేందుకు ముంబై నుండి కిరాయి ముఠాను రంగంలోకి దించినట్టు ఆరోపించారు.ఢిల్లీలోని ఇంటెలిజెన్స్‌ వర్గాల ద్వారా తనకు ఈ సమాచారం అందిందన్నారు. అందుకే వెను వెంటనే చైన్నె కమిషనర్‌ను కలిసి ఫిర్యాదు చేశానన్నారు. గత ఏడాది సెప్టెంబర్‌ కూడా అరుణ్‌, సెల్వనాథరత్నం వరుణ్‌కుమార్‌ ఐపీఎస్‌ల సాయంతో దక్షిణ తమిళనాడుకు చెందిన ఒక ముఠాను తనను చంపడానికి పురమాయించారని ఆరోపించారు. అప్పట్లో తాత్కాలిక డీజీపీ వెంకట్రామన్‌న్‌ను కలిసి ఫిర్యాదు చేసి, మీడియాకు వివరించడంతో ఆ ప్లాన్‌ విరమించుకున్నారన్నారు. ఇప్పుడు రెండోసారి తనను టార్గెట్‌ చేశారని ఆందోళన వ్యక్తంచేశారు. ఇళ్లపై మలమూత్రాల దాడి.. పోలీసుల ఆలస్యంగా, దేశంలో ఎవరికీ జరగని అరాచకాలు తనపై జరిగాయని శంకర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. తన ఇంటి బెడ్‌రూమ్‌, కిచెన్‌ భాగాల్లో మలమూత్రాలు, డ్రైనేజీ వ్యర్థాలను తెచ్చి పోశారని, ఆ సమయంలో పెట్రోలింగ్‌ వాహనానికి ఫోన్‌ చేస్తే, కీల్పాకం నుండి రావడానికి 45 నిమిషాల సమయం పట్టిందన్నారు. దానికి ట్రాఫిక్‌ జామ్‌ అన్న నెపం నెట్టారని ఆయన మండిపడ్డారు. అరుణ్‌ గనుక శాంతిభద్రతల విభాగంలో ఉండి ఉంటే.. తనపై 15 కేసులు పెట్టి గుండా యాక్ట్‌ కింద జైల్లో పెట్టించేవారని, ఇప్పుడు డీవీఏసీలో ఉండటం వలన ఎవరూ ఏమీ చేయలేరనే ధీమాతో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

కిందిస్థాయి సిబ్బంది వసూళ్ల పర్వం

సీఎం దృష్టికి ఒక షాకింగ్‌ విషయాన్ని తీసుకెళ్తున్నానని చెప్తూ.. చైన్నె పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌కు చెందిన మిని స్టీరియల్‌ స్టాఫ్‌ అయ్యప్పన్‌, యాంటీ వైస్‌ స్క్వాడ్‌కు చెందిన హెడ్‌ కానిస్టేబుల్‌ చంద్రశేఖర్‌ ప్రస్తుతం డీవీఏసీలో అరుణ్‌ వద్ద డెప్యుటేషన్‌పై పని చేస్తున్నారని, వీరిద్దరూ కలిసి స్టార్‌ హోటల్‌ బార్ల నుండి భారీగా మామూళ్ల వసూళ్లకు పాలడుతున్నారని ఆరోపించారు. సీఎం ఈ నియమకాలను పునఃసమీక్షించాలని కోరారు. తమిళనాడు విద్యుత్‌ బోర్డు ప్రధాన కార్యాలయంలో జరిగిన హార్డ్‌ డిస్క్‌ల మాయం గురించి స్పందిస్తూ, పేరుకే శివశంకర్‌ గతంలో మంత్రిగా ఉంట, తెర వెనుక నుంచి మాజీ మంత్రి సెంథిల్‌ బాలాజీ వ్యవహారాలు సాగించారని, ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం ఎందుకు తేలికగా తీసుకుంటుందో అర్థం కావడం లేదు.ఐఏఎస్‌ అధికారి రాధాకృష్ణన్‌ గతంలో విద్యుత్‌ బోర్డు ఛైర్మన్‌గా ఉన్నారని, ఇప్పుడూ ఆయనే కొనసాగుతున్నారని గుర్తు చేస్తూ, ఆయనను మార్చకుండా అవినీతిని ఎలా బయటపెడతారు? మొదటి అనుమానం ఆయనపైనే రావాలి అని వ్యాఖ్యలు చేశారు. డీఎంకే కు అనుకూలమైన, అవినీతికి సహకరించిన అధికారులనే ఈ ప్రభుత్వం కూడా కీలక పోస్టుల్లో ఎందుకు నియమించుకుందో.? అంటూ ఈ ప్రభుత్వంలో పై స్థాయిలో తిమింగలాలే అఽధికంగా ఉన్నాయని ఆరోపించారు.

Advertisement
 
Advertisement
Advertisement