దిండుగల్‌ జిల్లాలో మహిళా శక్తి | - | Sakshi
Sakshi News home page

దిండుగల్‌ జిల్లాలో మహిళా శక్తి

Jun 9 2026 5:48 AM | Updated on Jun 9 2026 5:48 AM

● కలెక్టర్‌ నుండి జిల్లా జడ్జి వరకు కీలక పదవుల్లో అతివల ప్రతిభ

సాక్షి, చైన్నె: దిండుగల్‌ జిల్లా పరిపాలనలో మహిళా అధికారులు సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నారు. కలెక్టర్‌ మొదలుకొని వివిధ ప్రభుత్వ శాఖల అగ్ర శ్రేణి పోస్టుల వరకు మహిళలే అత్యధిక సంఖ్యలో నియమితులవడంతో, జిల్లా యంత్రాంగం మొత్తం మహిళల ఆధిపత్యం, నాయకత్వంలో ముందుకు సాగుతోంది. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినానంతరం దిండుగల్‌ జిల్లాలో కీలక పదువులలో ఉన్న వారి బదిలీలు జరిగాయి. ఆమేరకు ఇటీవలే దిండుగల్‌ జిల్లా కొత్త కలెక్టర్‌గా దుర్గామూర్తి బాధ్యతలు స్వీకరించారు, అలాగే రెవెన్యూ , గ్రామీణాభివృద్ధి శాఖలను జిల్లా కలెక్టర్‌ తర్వాత అత్యంత కీలకమైన రెవెన్యూ విభాగాన్ని డిస్ట్రిక్ట్‌ రెవెన్యూ ఆఫీసర్‌ జయభారతి పర్యవేక్షిస్తున్నారు. జిల్లాలోని భూపరిపాలన, రెవెన్యూ వ్యవహారాలన్నీ ఈమె నియంత్రణలోనే ఉన్నాయి. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల అభివృద్ధి పనులను, సంక్షేమ పథకాల అమలును డిస్ట్రిక్ట్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌ గంగాధరణి పర్యవేక్షిస్తున్నారు. జిల్లా కలెక్టరేట్‌ అంతర్గత పరిపాలన, సమన్వయ బాధ్యతలను కలెక్టర్‌ వ్యక్తిగత సహాయకురాలు జయంతి చూసుకుంటున్నారు.

కొడైకెనాల్‌ ఆర్డీఓగా

కీర్తన బాధ్యతలు నిర్వహిస్తున్నారు

న్యాయవ్యవస్థలో అత్యున్నత పదవి అయిన జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ముత్తు శారద విధులు నిర్వర్తిస్తున్నారు. జిల్లా పాఠశాల విద్యాశాఖను చీఫ్‌ ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్‌ ఉష లీడ్‌ చేస్తున్నారు. జిల్లా సామాజిక సంక్షేమ అధికారిగా కరోలిన్‌ సెల్వరాణి, జిల్లా సమగ్ర బాలల అభివృద్ధి పథకం) అధికారిగా పూంగొడి సేవలందిస్తున్నారు. ఇక, ఉద్యానవన శాఖ డిప్యూటీ డైరెక్టర్‌గా గాయత్రి, జిల్లా పంచాయతీ సెక్రటరీగా రాజేశ్వరి పనిచేస్తున్నారు. కలెక్టర్‌ దుర్గామూర్తి బాధ్యతలు స్వీకరించిన తరుణంలో.. మహిళల సంక్షేమం, రక్షణ, జీవనోపాధి మరియు బాలల హక్కుల పరిరక్షణకు తాము ప్రథమ ప్రాధాన్యత ఇస్తామని ప్రకటించారు. ప్రస్తుతం జిల్లాలోని అన్ని అగ్ర శ్రేణి పోస్టుల్లో ప్రతిభావంతులైన మహిళా అధికారులే ఉండటం వలన , ప్రభుత్వ సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో ఉన్న చివరి లబ్ధిదారునికి కూడా పారదర్శకంగా అందుతాయని, జిల్లా అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలుస్తుందని దిండుగల్‌ జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement