ప్రముఖ యూట్యూబర్‌ మారీదాస్‌పై కన్నెర్ర | - | Sakshi
Sakshi News home page

ప్రముఖ యూట్యూబర్‌ మారీదాస్‌పై కన్నెర్ర

Jun 9 2026 5:36 AM | Updated on Jun 9 2026 5:36 AM

– మదురైలో అరెస్ట్‌ చేసిన చైన్నె పోలీసులు

సాక్షి, చైన్నె: ప్రముఖ యూట్యూబర్‌ మారీదాస్‌ను చైన్నె సైబర్‌ క్రైమ్‌ పోలీసులు సోమవారం ఉదయం మదురైలోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్నారు. ఈ అరెస్ట్‌ స్థానికంగా , సోషల్‌ మీడియా వేదికల్లో తీవ్ర వ్యతిరేకత, చర్చకు దారి తీసింది.

ప్రభుత్వంపై విమర్శల నేపథ్యంలో..

మదురైలోని తమిళనాడు తాగునీటి సరఫరా, మురుగునీటి పారుదల బోర్డు క్వార్టర్స్‌ సమీపంలో నివసిస్తున్న మారీదాస్‌, యూట్యూబ్‌ వేదికగా రాజకీయ విశ్లేషణలు చేస్తుంటారు. ఇటీవల తమిళనాడులో సీఎం విజయ్‌ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం, అలాగే రాష్ట్ర మంత్రులపై ఆయన నిరంతరం తీవ్ర విమర్శలు చేస్తూ పలు వీడియోలను విడుదల చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలపై చైన్నె నగర సైబర్‌ క్రైమ్‌ పోలీసులు మారీదాస్‌పై కేసు నమోదు చేశారు.

మదురైలో అరెస్ట్‌

ఈ కేసు దర్యాప్తులో భాగంగా మారీదాస్‌ను అరెస్ట్‌ చేసేందుకు చైన్నె సైబర్‌ క్రైమ్‌ ప్రత్యేక బృందం ఉదయం మదురై చేరుకుంది. స్థానిక మదురై కె.పుదూర్‌ పోలీసుల సహాయంతో మారీదాస్‌ నివాస గృహానికి చేరుకున్న చైన్నె పోలీసులు, అకస్మాత్తుగా ఇంట్లోకి ప్రవేశించి మారీదాస్‌ను అరెస్ట్‌ చేశారు. ప్రస్తుతం పోలీసులు మారీదాస్‌ను తదుపరి విచారణ నిమిత్తం మదురై నుండి చైన్నెకి తీసుకొస్తున్నారు.అ యితే, ఈ అరెస్టును సర్వత్రా తీవ్రంగా ఖండిస్తున్నారు. గతంలో యూ ట్యూబర్లకు, డిజిటల్‌ మీడియాలకు అనుకూలంగా వ్యాఖ్యలు చేసిన సీఎం విజయ్‌ సారూ..ఇదేనా మార్పు అంటూ సామాజిక మాధ్యమాలలో ప్రశ్నించే వాళ్లు పెరిగారు. వాక్‌ స్వాతంత్య్ర గురించి గతంలో వీరావేశంగా వ్యాఖ్యలు చేసిన తమరే ఓ యూ ట్యూబర్‌ గళాన్ని అరెస్టుతో నొక్కేయడం భావ్యమా అని ప్రశ్నిస్తున్నారు. ఇక, ఈ అరెస్టును నామ్‌ తమిళర్‌ కట్చి కన్వీనర్‌ సీమాన్‌, బీజేపీ మహిళా నేత తమిళసై సౌందరరాజన్‌ తదితరులు తీవ్రంగా ఖండించారు.

Advertisement
 
Advertisement
Advertisement