– మంత్రి షాజహాన్
సాక్షి, చైన్నె : తమిళనాడులో కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన నూతన వక్ఫ్ సవరణ చట్టాన్ని ఇప్పటివరకు అమలు చేయలేదని, భవిష్యత్తులో కూడా అమలు చేయబోమని రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి షాజహాన్ స్పష్టం చేశారు. ఈ అంశంపై తదుపరి చర్యల కోసం చట్టపరమైన నిపుణులతో సంప్రదింపులు జరిపి తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన వెల్లడించారు. తమిళనాడు నుంచి సౌదీ అరేబియాలో మక్కా ,మదీనా నగరాలకు బక్రీద్ పండుగ సందర్భఃగా హజ్ యాత్రకు వెళ్లిన బృందాలు తిరుగు పయనం అయ్యాయి. ఈ యాత్రను ముగించుకుని రాష్ట్రానికి తిరిగి వచ్చిన యాత్రికులకు చైన్నె అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రభుత్వం తరపున సోమవారం ఉదయం ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మంత్రి షాజహాన్ మీడియాతో మాట్లాడారు.
వక్ఫ్ సవరణ చట్టంపై అసెంబ్లీలో తీర్మానం
మంత్రి షాజహాన్ మాట్లాడుతూ.. ప్రస్తుతం భారతదేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఈ కొత్త వక్ఫ్ చట్టం అమలు కాలేదని గుర్తుచేశారు. తమిళనాడు ప్రభుత్వం ఈ చట్టాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తోందని తెలిపారు.‘తమిళనాడులో వక్ఫ్ సవరణ చట్టాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ అమలు చేయనివ్వమని, ఈ సవరణ చట్టంలో ఉన్న పలు వివాదాస్పద నిబంధనలను (షరతులను) తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. దీనికి వ్యతిరేకంగా తమిళనాడు శాసనసభలో ప్రత్యేక తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టి ఆమోదిస్తామన్నారు. అలాగే, కేంద్ర ప్రభుత్వ ‘ఉమిద్’ పోర్టల్‌లో వక్ఫ్ ఆస్తుల వివరాలను నమోదు చేయడంలో అనేక సాంకేతిక సవాళ్లు ఎదురవుతున్నాయని మంత్రి పేర్కొన్నారు. అధికారులు తమ శాయశక్తులా వివరాలను అప్‌లోడ్ చేశారని, ఇంకా నమోదుకాని ఆస్తుల వివరాలను కూడా త్వరలోనే క్రమబద్ధంగా నమోదు చేయడానికి తగిన ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన వివరించారు.


