సాక్షి, చైన్నె: తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటుచేసుకుంది. రాష్ట్రంలో డీఎంకే నేతృత్వంలోని లౌకిక ప్రగతిశీల కూటమి అధ్యాయం ముగిసిపోయిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి షణ్ముగం వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆయనో ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. సీఎం విజయ్ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వాన్ని అటు డీఎంకే అధ్యక్షుడు ఎం.కె. స్టాలిన్, ఇటు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి అనవసరంగా విమర్శించడం సరికాదని హితవు పలికారు. రాష్ట్రంలో విజయ్ నేతృత్వంలో సంకీర్ణ పాలన సాగుతున్న విషయం తెలిసిందే. ఈ కూటమికి సీపీఎం బయటి నుంచి మద్దతు ఇస్తూ వస్తున్నది. ఈ ప్రభుత్వ ఏర్పాటుకు ముందు కమ్యూనిస్ట్‌లు, మిత్ర పక్షాల నేతలంతా డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్‌ను కలిసి చర్చించారని, స్టాలిన్ అనుమతితోనే ఈ నిర్ణయం తీసుకున్నటు సమాచారాలు ఉన్నాయి. ఈ కొత్త ప్రభుత్వంలో కాంగ్రెస్, ఐయూఎంఎల్, వీసీకేలు భాగస్వామ్యమైనప్పటికీ, సీపీఎం, సీపీఐలు మాత్రం బయట నుంచి మద్దతు ఇస్తున్నాయి. ఈ పరిస్థితులలో ఆయా పార్టీలు డీఎంకే కూటమిని పూర్తిగా వీడినట్లు పేర్కొంటూ వస్తున్నారు. కొందరు నాయకులు తాము ఇంకా పాత కూటమిలోనే ఉన్నామని చెప్తున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో డీఎంకే కూటమి ఉనికి కోల్పోయిందని షణ్ముగం తాజాగా స్పష్టం చేయడం గమనార్హం. ఈ కూటమి అన్నది ప్రస్తుతం లేదని, ఇది ముగిసిన అధ్యయం అని ఆయన వ్యాఖ్యలు చేయడంచర్చకు దారితీశాయి.


