క్లుప్తంగా | - | Sakshi
Sakshi News home page

క్లుప్తంగా

Jun 9 2026 5:36 AM | Updated on Jun 9 2026 5:36 AM

తామరపాక్కంలో గంగ జాతర వేడుకలు వేడకగా అగ్నిగుండ మహోత్సవం వినోదమే లక్ష్యంగా ఇంటరాక్టివ్‌ వాయిస్‌ ఫీచర్‌ పోలీస్‌ స్టేషన్‌ ముందు విద్యార్థుల ఘర్షణ ● పోలీస్‌ వాహనం అద్దాలు ధ్వంసం పెళ్లిపేరుతో మోసం ● యువకుడు అరెస్ట్‌

తిరువళ్లూరు: తామరపాక్కంలో ప్రసిద్ధి చెందిన గంగమ్మ జాతర ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి అమ్మవారి ఊరేగింపు, అగ్నిగుండ ప్రవేశం కార్యక్రమం వైభవంగా జరిగింది. తిరువళ్లూరు జిల్లా తామరపాక్కంలో ప్రసిద్ధి చెందిన గంగమ్మ జాతర ఉత్సవాలను 13 రోజుల పాటు ఘనంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగానే ఉత్సవాలు భక్తుల కాపుధారణతో ప్రారంభమైంది. ఉత్సవాల్లో భాగంగా రోజూ అమ్మవారికి ప్రత్యేక అభిషేకం, పూజలు నిర్వహించారు. చివరి రోజైన ఆదివారం అమ్మవారి ఊరేగింపుతో అగ్నిగుండ మహోత్సవం చేపట్టారు.

తిరుత్తణి: తిరుత్తణి సమీపంలోని అగూరు గ్రామంలో మే 29న ద్రౌపదీదేవి ఆలయ అగ్నిగుండ వేడుకలు ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి రోజూ పగటి సమయాల్లో మహాభారత ప్రవచనాలు, రాత్రి వేళల్లో వీధి నాటకం ప్రదర్శించారు. వేడుకలు సందర్భంగా భక్తులు కంకణాలు ధరించారు. ఆదివారం అగ్నిగుండ వేడుకలు సందర్భంగా భక్తులు పసుపు దుస్తులు ధరించి ఊరేగంపుగా సాయంత్రం ఆలయం వద్దకు చేరుకున్నారు. అగ్నిగుండానికి ప్రత్యేక పూజలు చేపట్టి ద్రౌపదీదేవి అగ్నిగుండం ముందు కొలువుదీరగా బాణసంచా వేడుకలు నడుమ భక్తులు గోవింద నామస్మరణతో వెయ్యిమంది కంకణాలు ధరించిన భక్తులు అగ్నిగుండ ప్రవేశం చేసి తమ మొక్కులు చెల్లించారు.

సాక్షి, చైన్నె: బాలల వినోద రంగంలో సరికొత్త విప్లవానికి మార్గంగా ప్రముఖ కిడ్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఛానల్‌ సోనీ వైఏవై ఒక వినూత్నమైన ప్రకటన చేసింది. ఈవిషయంగా సోమవారం స్థానికంగా ఆసంస్థ బిజినెస్‌ హెడ్‌ అంబేష్‌ తివారి వివరిస్తూ బుల్లితెరపై తన అల్లరితో, నవ్వులు పూయించే డైలాగులతో దశాబ్దాలుగా పిల్లలను, పెద్దలను అలరిస్తున్న ప్రముఖ కార్టూన్‌ క్యారెక్టర్‌లను అమెజాన్‌ వాయిస్‌ అసిస్టెంట్‌ అలెక్సా ద్వారా ఇకపై అభిమానులు షిన్‌ చాన్‌తో నేరుగా మాట్లాడే ఇంటరాక్టివ్‌ వాయిస్‌ అనుభవాన్ని అందుబాటులోకి తెచ్చినట్టు తెలిపారు. ఈ సరికొత్త ఫీచర్‌ను ఉపయోగించడం చాలా సులభం. అలెక్సా సపోర్ట్‌ చేసే డివైజ్‌ లేదా స్మార్ట్‌ఫోన్‌ యాప్‌లో అడిగితే చాలు, షిన్‌ చాన్‌ తన ట్రేడ్‌మార్క్‌ వాయిస్‌తో, ఊహించని ఫన్నీ సమాధానాలతో మాట్లాడేందుకు వీలుంటుందని తెలిపారు. ఈ అనుభూతి పిల్లలకు సరికొత్త థ్రిల్‌ను ఇస్తుందన్నారు.

తిరువొత్తియూరు: కన్యాకుమారి జిల్లాలో ఒకే యువతిని ఇద్దరు యువకులు ప్రేమించారనే నెపంతో రెండు గ్రూపుల మధ్య ఘర్షణ జరిగింది. వివరాలు.. నాగర్‌కోవిల్‌కు చెందిన ఓ యువతి, అారల్వాయిమొళి ప్రాంతానికి చెందిన యువకుడు గత 6 నెలలుగా ఇన్‌స్ట్రాగామ్‌ ద్వారా పరిచయమయ్యారు. ఇదే క్రమంలో తొలైయావట్టం ప్రాంతానికి చెందిన మరో యువకుడు కూడా అదే యువతిని ప్రేమిస్తున్నట్లు తెలిసింది. దీనిపై ఇద్దరి మధ్య ఇన్‌స్ట్రాగామ్‌లో వాగ్వాదం మొదలైంది. ఈ సమస్యను పరిష్కరించుకోవడానికి వారు కరుంగల్‌ పోలీస్‌ స్టేషన్‌ సమీపంలో సమావేశమయ్యారు. అక్కడ ఇరువర్గాల మధ్య మాట మాట పెరిగి ఒకరిపై ఒకరు రాళ్లతో దాడి చేసుకున్నారు. ఈ గొడవలో అక్కడ ఆపి ఉంచిన పోలీస్‌ ఇన్‌ స్పెక్టర్‌ వాహనంపై రాళ్లు పడటంతో దాని అద్దాలు పగిలిపోయాయి. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు రెండు వర్గాలకు చెందిన సుమారు ఆరుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నారు.

తిరువొత్తియూరు: విల్లుపురం జిల్లా మరక్కాణంకు చెందిన యువకుడు నిషాంత్‌ (24). ఇతను కడలూరులో కాలేజీ చదువుతున్నప్పుడు పుదుచ్చేరి కరువడికుప్పం ప్రాంతానికి చెందిన ఒక యువతిని ప్రేమించాడు. ప్రస్తుతం ఆ యువతి ఒక ప్రైవేట్‌ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. నిషాంత్‌ ఆ ఉపాధ్యాయురాలిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెతో చనువుగా ఉన్నాడు. ఆ సమయంలో ఆమెకు తెలియకుండానే తన సెల్‌ఫోన్‌లో వీడియోలు తీసుకున్నట్లు సమాచారం. అయితే గత కొద్దిరోజులుగా నిషాంత్‌ ఆమెతో మాట్లాడటం మానేశాడు. దీని గురించి ఆమె నిలదీయగా, నిషాంత్‌ వేరే యువతిని ప్రేమిస్తున్నాడని తెలిసి ఆమె షాక్‌కు గురైంది. తనను పెళ్లి చేసుకోవాలని ఆమె కోరగా, నిషాంత్‌ నిరాకరించాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ సమయంలో కోపానికి గురైన నిషాంత్‌, తామిద్దరూ కలిసి ఉన్నప్పుడు తీసిన వీడియోలు, ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తానని ఆమెను బెదిరించాడు. దీనిపై సదరు ఉపాధ్యాయురాలు లాస్‌పేట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నిషాంత్‌ను అరెస్ట్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement