సాక్షి, చైన్నె: దిండుగల్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన పళని అరుల్మిగు దండాయుధపాణి స్వామి ఆలయంలో తమిళనాడు హిందూ ధార్మిక దేవాదాయ శాఖ మంత్రి ఎస్. రమేష్ సోమవారం ఉదయం పర్యటించారు. ఆలయంలో భక్తులకు కల్పిస్తున్న మౌలిక వసతులను స్వయంగా పరిశీలించిన మంత్రి, అక్కడి లోపాలపై అధికారులను నిలదీశారు.
రూ.1.05 కోట్ల అభివృద్ధి పనులు
పళణి పర్యటనలో భాగంగా మంత్రి రమేష్ పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. పళని – కొడైకెనాల్ రోడ్డులో రూ.53 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన ఎంట్రన్స్ ఆర్చ్ ప్రారంభించారు. పశ్చిమ రథం వీధిలో రూ.52 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ఉద్యానవనంను భక్తులకు అంకితం చేశారు.ఆ తర్వాత ఆలయంలో రూ.100 కోట్ల బడ్జెట్‌తో జరుగుతున్న మెగా మాస్టర్ ప్లాన్ అభివృద్ది పనుల ప్రగతిని మంత్రి పరిశీలించారు.
భక్తులతో ముఖాముఖి..
అధికారులపై ఆగ్రహం
కొండపైకి వెళ్లే వించ్ రైలు కోసం క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉన్న భక్తుల వద్దకు మంత్రి నేరుగా వెళ్లి మాట్లాడారు. తాగునీరు, మరుగుదొడ్ల వసతులపై భక్తుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. భక్తులు వేచి ఉండే హాల్‌లో అనారోగ్యంతో ఉన్న ఒక కుక్క తిరుగుతుండటం చూసి మంత్రి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దానిని వెంటనే అక్కడి నుండి తరలించాలని ఆరోగ్య సిబ్బందిని ఆదేశించారు. భక్తుల రద్దీకి అనుగుణంగా మరుగుదొడ్ల సంఖ్య చాలా తక్కువగా ఉందని గమనించిన మంత్రి, వెంటనే అదనపు తాత్కాలిక, శాశ్వత టాయిలెట్లను నిర్మించాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఎటువంటి ఉపయోగం లేకుండా పక్కన పెట్టిన కొత్త వించ్ రైలును ఎందుకు అందుబాటులోకి తీసుకు రాలేదని అధికారులను ప్రశ్నించారు. పళని ప్రసిద్ధ పంచామృతం తయారీ కేంద్రాన్ని పరిశీలించి, నాణ్యతా ప్రమాణాలు, రోజువారీ ఉత్పత్తి, విక్రయాల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
ప్రొటోకాల్ వివాదం..:
మంత్రి పర్యటన ప్రారంభోత్సవ కార్యక్రమాలపై స్థానిక పళని నియోజకవర్గ అన్నా డీఎంకే ఎమ్మెల్యే రవిమనోహరన్‌కు ఆలయ అధికారులు ముందస్తు సమాచారం ఇవ్వకపోవడం స్థానికంగా వివాదానికి దారితీసింది. ఎమ్మెల్యే మద్దతుదారులు మంత్రి రమేష్‌ను కలిసి ప్రోటోకాల్ ఉల్లంఘనపై ఫిర్యాదు చేశారు. దీనిపై తక్షణమే స్పందించిన మంత్రి రమేష్, ఆలయ జాయింట్ కమిషనర్‌ను తీవ్రంగా మందలించారు. తనకు ఎలాంటి గౌరవం ఇస్తున్నారో, ప్రజల చేత ఎన్నుకోబడిన స్థానిక ఎమ్మెల్యేకు కూడా అదే గౌరవం ఇవ్వాలని తేల్చి చెప్పారు. అనంతరం స్వయంగా ఎమ్మెల్యే రవిమనోహరన్‌ను కలిసి, జరిగిన దానికి విచారం వ్యక్తం చేస్తూ ఆయనను శాంతింపజేశారు. ఆ తర్వాత మంత్రి రోప్ కార్ ద్వారా కొండపైకి వెళ్లి మురుగన్ దర్శించుకున్నారు.


