చైన్నె బేసిన్‌ బ్రిడ్జ్‌ వద్ద ఘోర ప్రమాదం | - | Sakshi
Sakshi News home page

చైన్నె బేసిన్‌ బ్రిడ్జ్‌ వద్ద ఘోర ప్రమాదం

Jun 9 2026 5:36 AM | Updated on Jun 9 2026 5:36 AM

● సిగ్నల్‌ వద్ద ఆగిన బైక్‌లపైకి ● ఇద్దరు దుర్మరణం ● పలువురికి గాయాలు

దూసుకెళ్లిన లారీ

సాక్షి, చైన్నె: చైన్నె బేసిన్‌ బ్రిడ్జ్‌ ఫ్లైఓవర్‌ సిగ్నల్‌ వద్ద సోమవారం లారీ అదుపు తప్పి బైక్‌లను ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మరణించారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

సిగ్నల్‌ వద్ద దూసుకొచ్చిన లారీ

చైన్నె ప్రజల అవసరాల కోసం బియ్యం, పప్పుధాన్యాలు వంటి నిత్యావసర వస్తువులను రైల్వే వ్యాగన్ల ద్వారా వ్యాసార్పాడి గూడ్స్‌ షెడ్‌కు తరలిస్తుంటారు. అక్కడి నుండి రేషన్‌ బియ్యం బస్తాలను లోడ్‌ చేసుకుని ఓ లారీ ఆయిల్‌ మిల్‌ రోడ్‌ వైపు బయలుదేరింది. ఈ లారీని కోయంబత్తూరు భారతి నగర్‌కు చెందిన కుమార్‌ (46) నడిపాడు.లారీ బేసిన్‌ బ్రిడ్జ్‌ ఫ్లైఓవర్‌ సమీపంలోకి రాగానే అకస్మాత్తుగా బ్రేకులు పడలేదని సమాచారం. దీంతో పూర్తిగా అదుపు తప్పిన లారీ, అక్కడ సిగ్నల్‌లో వేచి ఉన్న వాహనాలపైకి వేగంగా దూసుకెళ్లింది. ఈ ఘోర ప్రమాదంలో మద్రాసు హైకోర్టు డిప్యూటీ రిజిస్ట్రార్‌ మురళీధరన్‌ (56), ఆవడి ప్రాంతానికి చెందిన గౌతమ్‌ (60) తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అలాగే స్కూటర్‌పై వెళ్తున్న షావుకారు పేట నివాసి రాజేశ్వరి (45),వ్యాసార్పాడికి చెందిన బాలకృష్ణన్‌ (63) తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఇద్దరికి తీవ్ర చికిత్స అందిస్తున్నారు. పలువురు వాహనదారులు గాయపడ్డారు. నాలుగు వాహనాలు నుజ్జునుజ్జు అయ్యాయి. కళ్లెదుటే జరిగిన ఈ దారుణాన్ని చూసి స్థానికులు, వాహనదారులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. ప్రమాదానికి కారణమైన లారీపై రాళ్లతో దాడి చేసి అద్దాలను ధ్వంసం చేశారు. లారీ డ్రైవర్‌ను పట్టుకుని దేహశుద్ధి చేసేందుకు యత్నించడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ ఘటనతో ఆ మార్గంలో తీవ్ర ట్రాఫిక్‌ జాం నెలకొంది. మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించిన వాషర్‌మెన్‌ పేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాపు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement