సాక్షి,చైన్నె: టీవీకే ప్రభుత్వ పాలనపై స్టాలిన్ మరో సారి మండిపడ్డారు. వారిది తుమ్మితే ఊడిపోయే మక్కులాంటి ప్రభుత్వం అంటూ ఎద్దేవా చేశారు. ఇక డీఎంకేను ఉద్దేశించి మాట్లాడుతూ.. మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడే బాధ్యత, కష్టం, పని చాలా ఎక్కువగా ఉంటుంది. అలాంటి సమయంలో పార్టీ కోసం కష్టపడేందుకు సిద్ధంగా ఉన్న పనయూర్ బాబును, ఆయన అనుచరులను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నానని వ్యాఖ్యలు చేశారు.
ఆరు నెలల ముందే మాట్లాడాల్సి వచ్చింది:
రాష్ట్రంలో ప్రస్తుతం ఎలాంటి పాలన సాగుతోందో ప్రజలందరికీ తెలుసునని వ్యాఖ్యలు చేశారు. దీని గురించి తాను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ఈ కొత్త ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన సమయంలోనే తాను ఒక మాట చెప్పానని గుర్తు చేశారు. తొలి ఆరు నెలల వరకు తాను ఈ ప్రభుత్వం గురించి ఏమీ మాట్లాడనని పేర్కొన్నట్టు గుర్తు చేస్తూ , అయితే, ఆరు నెలలు తిరగక ముందే దీనిపై మాట్లాడాల్సిన దుస్థితి, భయాందోళనలు రాష్ట్రంలో నెలకొన్నాయన్నారు.
మూడు నెలల ముచ్చటేనా?:
ప్రస్తుత ప్రభుత్వంపై నలుమూలల నుండి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయన్నారు. ఆరు నెలలు, ఐదు నెలలు లేదా నాలుగు నెలలు కాదు... కనీసం ఒక 3 నెలలైనా ఈ ప్రభుత్వం తట్టుకుని నిలబడుతుందా? అనే అనుమానంతోనే ప్రస్తుతం ఇక్కడ పాలన సాగుతోందన్నారు.
రాష్ట్రంలో నెలకొన్న ఇటువంటి అస్థిరమైన పరిస్థితుల్లోనే, వీరంతా డీఎంకే సిద్ధాంతాలను నమ్మి పార్టీ బలోపేతం కోసం తరలివచ్చారని, పార్టీ చేపట్టబోయే ప్రతి ప్రజాపోరాటంలోనూ నూతన కార్యకర్తలు కీలక పాత్ర పోషించాలని స్టాలిన్ పిలుపునిచ్చారు.
వీసీకేకు షాక్
ఇది వరకు డీఎంకే కూటమిలో ఉన్న వీసీకే నేత తిరుమావలవన్ నమ్మిన బంటులలో ఒకరైన పనయూరు బాబు తాజాగా డీఎంకేలో చేరారు. పనయూర్ బాబు గతంలో చేయ్యూర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించారు. డీఎంకేలో చేరడానికి ముందు ఆయన వీసీకే పార్టీలో రాష్ట్ర మీడియా విభాగానికి ప్రధాన కార్యదర్శిగా కీలక బాధ్యతల్లో కొనసాగారు. ఇప్పుడు ఆయన తన అనుచరులతో కలిసి డీఎంకే గూటికి చేరడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అన్నా అరివాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో డీఎంకే కోశాధికారి టి.ఆర్. బాలు, పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి, ఎంపీ కనిమొళి కరుణానిధి, శాసనసభ ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్, పార్టీ ఉన్నత స్థాయి కార్యాచరణ కమిటీ సభ్యుడు ఎ.వి. వేలు, కాంచీపురం సౌత్ జిల్లా కార్యదర్శి సుందర్, చైన్నె సౌత్ జిల్లా కార్యదర్శి ఎం. సుబ్రమణియన్ మాజీ ఎమ్మెల్యే అరవింద్ రమేష్ తదితరులు ఉన్నారు.
తమిళనాడులో ప్రస్తుత పాలన తీరుపై డీఎంకే అధినేత ఎం.కె. స్టాలిన్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ఇప్పుడు నడుస్తున్న ప్రభుత్వం కనీసం మూడు నెలలైనా తట్టుకుని నిలబడుతుందా..? అనేది పెద్ద ప్రశ్నార్థకంగా మారిందని వ్యాఖ్యలు చేశారు. వీసీకేలో కీలక నేతగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పనయూర్ బాబు ఆదివారం డీఎంకేలో చేరారు. చైన్నెలోని అన్నా అరివాలయంలో పనయూరు బాబు తన అనుచరులు వెయ్యి మందితో డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా స్టాలిన్ మాట్లాడుతూ, తమిళనాడు ప్రస్తుత రాజకీయ, ప్రభుత్వ పరిస్థితులపై సంచలన వ్యాఖ్యలు చేశారు.


