న్యూస్‌రీల్
తిరువొత్తియూరు: తిరుపూర్‌లో డిజిటల్ అరెస్ట్ పేరుతో పదవీ విరమణ చేసిన మహిళా ప్రొఫెసర్‌ను నమ్మించి రూ.7.50 కోట్ల రూపాయలు మోసం చేసిన ఘటనపై సైబర్ క్రైమ్ పోలీసులు విచారణ జరుపుతున్నారు. వివరాలు.. తిరుపూర్ ఊత్తుక్కుళి రోడ్డుకు చెందిన 65 ఏళ్ల మహిళ, ఓ ప్రభుత్వ కళాశాలలో ప్రొఫెసర్‌గా పనిచేసి పదవీ విరమణ చేశారు. ఆమె సెల్ ఫోన్ నంబర్‌కు ఇటీవల ఓ కాల్ వచ్చింది. అందులో మాట్లాడిన వ్యక్తి తాను ఢిల్లీకి చెందిన సైబర్ క్రైమ్ పోలీసని పరిచయం చేసుకున్నాడు. ఆమె ఆధార్ నంబర్‌ను ఉపయోగించి అక్రమ నగదు లావాదేవీలు జరిగినట్లు, అందుకే ఆమెను డిజిటల్ అరెస్ట్ చేస్తున్నట్లు భయపెట్టారు. తదుపరి చర్యలు తీసుకోకుండా ఉండాలంటే, తాము సూచించిన బ్యాంక్ ఖాతాకు డబ్బు పంపాలని చెప్పారు. దీనిని నమ్మిన ఆ మహిళ వారి ఖాతాకు రూ. 7.50 కోట్లు బదిలీ చేసింది. దీనిపై వచ్చిన ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బాలికపై సామూహిక అత్యాచారం
తిరువొత్తియూరు: తిరుచ్చిలోని పాలక్కరై ప్రాంతంలో 14 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ కేసులో పోలీసులు ఏడుగురు బాలురు సహా మొత్తం 9 మందిని అరెస్ట్ చేశారు. తల్లిదండ్రులు విడిపోవడంతో బాలిక బంధువుల ఇంట్లో ఉంటోంది. బాలిక గర్భం దాల్చడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. సీసీటీవీ దృశ్యాల ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించారు. నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, కోర్టులో హాజరుపరిచారు. అరెస్ట్ అయిన ఏడుగురు మైనర్లను అబ్జర్వేషన్ హోమ్‌కు, మిగిలిన ఇద్దరు మోహన్ రాజ్ (19), కిషోర్ (20)ను జైలుకు తరలించారు. తిరుచ్చి తూర్పు నియోజకవర్గ పరిధిలో జరిగిన ఈ ఘటన సంచలనం సృష్టించింది.
తిరువళ్లూరు: బస్టాండుతోపాటు జనసంచారం రద్దీగా వున్న ప్రాంతంలో శనివారం రాత్రి ఎస్పీ వివేకానందశుక్లా, డీఎస్పీ కార్తికేయన్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తిరువళ్లూరు జిల్లా వ్యాప్తంగా ఎస్పీ వివేకానందశుక్లా ఆకస్మిక తనిఖీల పేరిట రాత్రి సమయంలో గస్తీ నిర్వహిస్తున్నారు. ఇందులోభాగంగానే ఇప్పటికే పెద్దకుప్పంతో పాటు ఇతర ప్రాంతాల్లో తనిఖీలను ముమ్మరం చేశారు. బస్టాండులో ప్రయాణికుల వద్ద వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాత్రి సమయంలో ఎమైనా ఇబ్బందులు వస్తున్నాయా, మద్యం మత్తులో యువకుల వేధింపులపై ఆరా తీశారు. ప్రజలకు ఇబ్బంది వస్తే 24 గంటల్లో ఎప్పుడైనా ఫోన్ చేసి తమకు ఫిర్యాదు చేయవచ్చన్నారు. పోలీసులు సైతం వేగంగా స్పందిస్తారని హామీ ఇచ్చారు. డీఎస్పీ కార్తికేయన్, సీఐలు విజయకుమార్, దామోదరన్ పాల్గొన్నారు.


