తిరుత్తణి: కుశస్థలి నదిలో ఊటబావులు ద్వారా తిరుత్తణి కొండ ఆలయానికి తాగునీరు సరఫరా చేయడాన్ని గ్రామస్తులు వ్యతిరేకించి మంగళవారం నిరసన తెలిపారు. తిరువలంగాడు యూనియన్‌లోని నల్లాట్టూరు సమీపంలోని కుశస్థలినది నుంచి రూ.11 కోట్ల వ్యయంతో మూడు ఊటబావులు నిర్మించి రోజూ తిరుత్తణి ఆలయంకు 5 లక్షల లీటర్ల తాగునీరు సరఫరాకు చర్యలు తీసుకున్నారు. వాటర్‌బోర్డు ద్వారా ఊటబావుల ఏర్పాటు పనులు జరుగుతున్నాయి. ఈక్రమంలో మంగళవారం నల్లాట్టూరు గ్రామస్తులు ఊటబావుల పనులను అడ్డుకుని వ్యతిరేకత తెలిపారు. దీంతో పనులు ఆగడంతో వాటర్‌బోర్డు ఏడీ సంపత్. తహసీల్దారు కుమార్, ఆలయ ఇంజినీరు నేతాజీ తదితరులు గ్రామానికి చేరుకుని గ్రామస్తులతో చర్చలు జరిపారు. నదిలో 15 అడగుల లోతు ఊటబావులు ఏర్పాటు చేసి మూడు అడుగుల లోతు నుంచి ఊట నీటిని మాత్రమే పైపులైన్లు ద్వారా తరలించనున్నట్లు తద్వారా గ్రామంలో తాగునీటి ఎద్దడి ఏర్పడదని గ్రామీణులకు తెలిపారు. అయితే ఇప్పటికే మూడు ఊటబావులు నిర్మించి మూడు గ్రామాలకు తాగునీరు సరఫరా చేస్తున్న క్రమంలో భూగర్భజలాలు అడుగంటే ప్రమాదమున్నట్లు గ్రామీణులు ఆందోళన వ్యక్తం చేశారు. వేరే ప్రాంతంలో ఊటబావులు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. అయితే ఊట బావుల ద్వారా భూగర్భజలాలు అడుగంటే అవకాశమే లేదని ఊట నీటిని మాత్రమే వినియోగిస్తామని అధికారులు చెప్పడంతో గ్రామీణులు ఆందోళన విరమించారు.


