డీఎంకేపై మాణిక్యం ఠాకూర్‌ ఫైర్‌ | - | Sakshi
Sakshi News home page

డీఎంకేపై మాణిక్యం ఠాకూర్‌ ఫైర్‌

Jun 8 2026 7:06 AM | Updated on Jun 8 2026 7:06 AM

● కూటమి ధర్మం కోసమే ఇన్నాళ్లూ భరించాం ● ఉదయనిధి రాజీనామా చేస్తే తానూ సిద్ధమని ప్రకటన

సాక్షి, చైన్నె: తమిళనాడు రాజకీయాల్లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. గత డీఎంకే ప్రభుత్వంపై కాంగ్రెస్‌ పార్టీకి చెందిన సీనియర్‌ ఎంపీ మాణిక్యం ఠాగూర్‌ తీవ్రస్థాయిలో అవినీతి ఆరోపణలు గుప్పించారు. డీఎంకే నాయకులు చేసిన భారీ అవినీతి, వసూలు చేసిన కమిషన్లను తాము పక్కనే ఉండి చూసినప్పటికీ, కూటమి ధర్మం కోసమే ఇన్నాళ్లూ బయటపెట్టలేదని ఆయన వ్యాఖ్యానించారు. శివకాశిలో జరిగిన ఓ కార్యక్రమంలో మాణిక్యం ఠాగూర్‌ విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా 2026 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, డీఎంకే వైఖరి, సీమాన్‌ విమర్శలపై ఆయన ఘాటుగా స్పందించారు.

డీఎంకే 36శాతం కమీషన్ల పాలన..

తమిళనాడులో గత ప్రభుత్వ హయాంలో హైవేల శాఖ, పట్టణాభివృద్ధి శాఖల్లో ఏకంగా 36 శాతం కమిషన్లు నడిచాయన్నారు. రిజిస్ట్రేషన్ల శాఖలో ఒక్కో ఎకరానికి 7 లక్షల రూపాయల చొప్పున డీఎంకే విరాళాల పేరిట వసూలు చేసిందన్నారు. ఇదంతా తాము పక్కనే ఉండి చూశామన్నారు. అయితే, కూటమి ధర్మానికి కట్టుబడి నోరు విప్పలేదన్నారు. ఇప్పుడు కొత్తగా ఏర్పడిన టీవీకే ప్రభుత్వంలో ఆ అవినీతి పూర్తిగా తుడిచిపెట్టుకుపోతోందన్నారు. ఉదయనిధి స్టాలిన్‌ హయాంలో పూర్తిగా పాడైపోయిన ప్రభుత్వ యంత్రాంగాన్ని చక్కదిద్దడానికి ప్రస్తుత ప్రభుత్వానికి కొంచెం సమయం ఇవ్వాలని మాణిక్యం ఠాగూర్‌ పేర్కొన్నారు.

సీమాన్‌, ఉదయనిధిపై ధ్వజం

2026 ఎన్నికల ఓటమి చాలామందికి షాక్‌ ఇచ్చిందన్నారు. ఆ బాధ నుండి తేరుకోలేక కొందరు పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారన్నారు. ఇన్నాళ్లూ ఉదయనిధి స్టాలిన్‌ నుండి వచ్చిన అరుపులు, పెడబొబ్బలు.. ఇప్పుడు నామ్‌ తమీళర్‌కట్చి నేత సీమాన్‌ నుండి వస్తున్నాయన్నారు. సొంత జిల్లాలోనే డిపాజిట్‌ దక్కించుకోలేని సీమాన్‌, వందేళ్ల చరిత్ర గల కాంగ్రెస్‌ పార్టీని విమర్శించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఆయన మర్యాదగా మాట్లాడకపోతే కాంగ్రెస్‌ శ్రేణులు అదే రీతిలో బుద్ధి చెబుతాయన్నాయన్నారు.

సవాల్‌కు సిద్ధమా?:

డీఎంకే మద్దతుతో గెలిచిన కాంగ్రెస్‌ ఎంపీలు రాజీనామా చేయాలని సీమాన్‌ డిమాండ్‌ చేస్తున్నారని గుర్తుచేస్తూ, మొదట కాంగ్రెస్‌ ఓట్లతో గెలిచిన ఉదయనిధి స్టాలిన్‌ను రాజీనామా చేయమనండి అని సూచించారు. ఆయన రాజీనామా చేసిన 24 గంటల్లోనే తాను తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తానన్నారు. ఈ సవాల్‌కు సిద్ధమేనా అని సీమాన్‌ తన సోదరుడు ఉదయనిధిని అడిగి చెప్పాలన్నారు.

బీజేపీతో ఉదయనిధి అండర్‌ డీలింగ్స్‌

కరుణానిధి మరణం తర్వాత డీఎంకే ఏ దిశగా వెళ్తుందో అర్థం కావడం లేదని మాణిక్యం ఠాగూర్‌ ఆవేదన వ్యక్తం చేశారు. నిజమైన డీఎంకే కార్యకర్తలు ఇళ్లలోనే ఉండిపోయారన్నారు. ప్రస్తుతం అద్దెకు తెచ్చుకున్న వాళ్లతో రాజకీయం నడుపుతున్నారన్నారు. కొత్తగా గెలిచిన విజయ్‌ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి, ఆయన సీఎం కాకుండా అడ్డుకోవడానికి బీజేపీ వేసిన ప్లాన్‌లో ఉదయనిధి స్టాలిన్‌ ఒక ముఖ్య సూత్రధారిగా పేర్కొన్నారు. ఆయన బీజేపీతో పెట్టుకున్న లోపాయికారీ ఒప్పందాలను త్వరలోనే ప్రజల ముందు పెడుతామన్నారు. జూన్‌ 8న జరగబోయే ఇండియా కూటమి సమావేశానికి డీఎంకే దూరంగా ఉండటమే ఆ పార్టీ బీజేపీకి బీ–టీమ్‌ అనడానికి ప్రత్యక్ష నిదర్శనం అని ఆరోపించారు. తమిళనాడులో రాబోయే కాలంలో ఉదయనిధి నేతృత్వంలోని డీఎంకే భారీ పతనాన్ని చూస్తుందని ఆయన జోస్యం చెప్పారు. డీఎంకేతో కలవడం వల్లే గతంలో కాంగ్రెస్‌ పార్టీ 18 మంది ఎమ్మెల్యేల నుండి ఐదుగురికి పడిపోయిందని, చేరకూడని చోట చేరి మోసపోయామని అన్నారు. సీఎం విజయ్‌, రాహుల్‌ గాంధీల మధ్య ఉన్న సత్సంబంధాలు అందరికీ తెలిసినవేనని, ఈ స్నేహం, కూటమి భవిష్యత్తులోనూ ఇలాగే కొనసాగుతాయని ధీమా వ్యక్తంచేశారు.

Advertisement
 
Advertisement
Advertisement