క్లుప్తంగా | - | Sakshi
Sakshi News home page

క్లుప్తంగా

Jun 8 2026 7:06 AM | Updated on Jun 8 2026 7:06 AM

తిరుచ్చిలో రౌడీ హత్య గూండా చట్టం కింద మహిళ అరెస్ట్‌ ఆకట్టుకున్న కూచిపూడి ప్రదర్శన సిగరేట్‌ కోసం వచ్చి కమ్మ లాక్కెళ్లాడు మూన్నాళ్ల ముచ్చట!

తిరువొత్తియూరు: తిరుచ్చిలో ఓ రౌడీ దారుణ హత్యకు గురయ్యాడు. తిరుచ్చి అరియమంగళం ప్రాంతానికి చెందిన మహబూబ్‌బాషా కుమారుడు బాషా (25). ఇతను పేరు మోసిన రౌడీ. ఇతను శనివారం రాత్రి 11.30 గంటలకు బైక్‌లో కాట్టూర్‌ ప్రాంతంలోని ఒక పెట్రోల్‌ బంక్‌ సమీపంలో వెళుతున్నాడు. ఆసమయంలో అతన్ని ముగ్గురు వ్యక్తులు వెంబడించారు. ఒక మలుపు వద్ద బాషా బైక్‌ అదుపుతప్పి కింద పడిపోవడంతో, వెనుకనే వచ్చిన ముగ్గురు అతడి తలపై వేటకొడవళ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. బాషా అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసుల విచారణలో గత సెప్టెంబర్‌లో కూడా బాషాపై దాడి జరిగిందని, అప్పట్లో అతడి వేళ్లు తెగిపోయాయని తెలిసింది. తిరువెరుంబూర్‌ పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు.

తిరువొత్తియూరు: హత్య కేసులో ఓ మహిళ, ఆమె ప్రియుడిని పోలీసులు గూండా చట్టం కింద అరెస్ట్‌ చేశారు. కృష్ణగిరి జిల్లా పాలక్కురికి చెందిన సైనిక ఉద్యోగి మహేష్‌ కుమార్‌ (36), తండ్రి, మాజీ సైనికుడు సెల్లప్పన్‌ (64)లను మే 11న హత్య చేసి, పెట్రోల్‌ పోసి కాల్చివేశారు. మహేష్‌కుమార్‌ భార్య భానుప్రియ. ఈమె తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నారనే కారణంతో ప్రియుడు పూవరసన్‌తో కలిసి దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసుల విచారణలో తేలింది. కలెక్టర్‌ దినేష్‌కుమార్‌ ఆదేశాల మేరకు, వీరిద్దరిపై గూండా చట్టం ప్రయోగించారు. పూవరసనను సేలం కేంద్ర కారాగారానికి, భానుప్రియను కోయంబత్తూర్‌ మహిళా ప్రత్యేక జైలుకు తరలించారు.

చంద్రగిరి: తిరుచానూరు సమీపంలోని శిల్పారామంలో వారాంతపు కార్యక్రమంలో భాగంగా ఆదివారం తిరుపతికి చెందిన కొండ రవి బృందం ఆధ్వర్యంలో కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కళాకారులు వరణ్య, షణ్ముఖ, ప్రియ, సాత్విక, కార్తీక, విహాన, సహస్ర, భార్గవి, మన్య, హన్విత, జ్ఞాపిక, క్రియాంశ అద్భుతమైన ప్రదర్శనలతో అలరించారు. మంత్రముగ్ధులైన ప్రేక్షకులు కరతాళధ్వనులతో అభినందనలు తెలిపారు. అనంతరం ఖాదర్‌వల్లి, ఇన్‌చార్జ్‌ ఏఓ సూర్యతేజ కళాకారులతోపాటు గురువులను సత్కరించి జ్ఞాపికలను అందజేశారు.

వెంకటగిరి రూరల్‌: చిల్లర దుకాణానికి బైక్‌పై సిగరేట్‌ కోసం వచ్చి ఒంటరిగా ఉన్న మహిళ చెవులోని కమ్మను అపహరించుకెళ్లిన ఘటన వెంకటగిరి–నాయుడుపేట మార్గంలోని బాలాయపల్లి మండలం, మేల్చూరు గ్రామం వద్ద ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం.. మేల్చూరుకి చెందిన కాసరం కృష్ణమ్మ చిల్లర దుకాణం ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో ఆదివారం మధ్యాహ్నం ఇద్దరు గుర్తుతెలియని యువకులు మోటారు సైకిల్‌పై వచ్చి సిగరేట్‌లు అడిగారు. వాటిని ఇవ్వబోయే సమయంలో కృష్ణమ్మ మెడలోని బంగారు సరుడు లాగ బోయారు. ఈ మేరకు కృష్ణమ్మ కేకలు వేయడంతో ఆ యువకులు ఆమె చెవిలోని 3 గ్రాముల బంగారు కమ్మను లాక్కెళ్లారు. బాధితురాలు బాలాయపల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు విచారణలో ఉంది.

శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తి ఆలయం మూడో గేటు సమీపంలోని జల వినాయకుడి వద్ద భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఎల్‌సీడీ స్క్రీన్‌ పది రోజులుగా పనిచేయకుండా నిలిచిపోయింది. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయంలో జరిగే వివిధ ఉత్సవాలను భక్తులు ప్రత్యక్షంగా వీక్షించేలా ఈ స్క్రీన్‌న్‌ఎంతో ఆడంబరంగా ఏర్పాటు చేశారు. అయితే ఏర్పాటు చేసిన నాలుగు నెలలకే అది పనిచేయకుండా పోవడం గమనార్హం.

Advertisement
 
Advertisement
Advertisement