ఉద్యమానికి అనూహ్య మద్దతు | - | Sakshi
Sakshi News home page

ఉద్యమానికి అనూహ్య మద్దతు

Jun 7 2026 3:51 AM | Updated on Jun 7 2026 3:51 AM

కోయంబత్తూరులో గుడారం ఖాళీ

బీజేపీ అధ్యక్షుడు నైనార్‌ అలర్ట్‌

ముఖ్య నేతలతో భేటీ

సాక్షి, చైన్నె : తమిళనాట భారతీయ జనతా పార్టీలో కలవరం మొదలైంది. బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అన్నామలైకు మద్దతుగా ఆ వర్గాలు కదులుతున్నాయి. ఆయన స్థాపించిన వీ ది లీడర్స్‌ ఉద్యమంలోకి ఒక్క రోజులో 15 లక్షల మందికి పైగా చేరారు. ఇక కోయంబత్తూరు రీజియన్‌లో ఆయనకు మద్దతుగా వీజేపీ కీలక జిల్లా నేతలు పెద్దఎత్తున పార్టీని వీడారు. వీరంతా అన్నామలై ఉద్యమం వైపు అడుగులు వేశారు. బీజేపీ నుంచి బయటకు వచ్చిన అన్నామలై వీ ది లీడర్స్‌ రాజకీయ ఉద్యమానికి శుక్రవారం శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. దీంతో ఆయనకు మద్దతుగా సంబంధిత వెబ్‌ సైట్‌లో చేరికలు క్రమంగా పెరిగాయి. ఆయన పిలుపు మేరకు ఒక్క రోజులో 15 లక్షల మందికి పైగా ఉద్యమంలో చేరారు.

ఇది బీజేపీ బి–టీమ్‌ కాదు

అన్నామలై తీవ్ర మద్దతుదారుడు, బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షుడు బాలాజీ ఉత్తమ రామసామి మీడియాతో మాట్లాడుతూ.. తామంతా అన్నామలై ప్రారంభించిన వీ ద లీడర్స్‌ అనే నూతన సంస్థలో సభ్యులుగా చేరామని, ఇది బీజేపీకి బి–టీమ్‌ మాత్రం కాదన్నారు. రాబోయే ఉపఎన్నికలు లేదా స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్నామలై పోటీ చేస్తారని ప్రకటించారు. ఇకపై తమిళనాడు రాజకీయాల్లో కేవలం విజయ్‌ , అన్నామలై మధ్య మాత్రమే పోటీ అంటూ, వీరిద్దరే ప్రధాన శక్తులుగా బరిలో ఉంటారని ధీమా వ్యక్తం చేశారు. కోవై దక్షిణ జిల్లా బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్‌ పాటుగా మరో 14 మంది జిల్లాల నేతలు పార్టీని వీడారు. వందలాది మంది కార్యకర్తలు కూడా అన్నామలై బాటలోనే నడిచారు. గత లోక్‌సభ ఎన్నికల్లో పొల్లాచ్చి నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ జిల్లా అధ్యక్షుడు కె. వసంతరాజన్‌ పార్టీకి రాజీనామా చేస్తూ ఒక బహిరంగ లేఖ విడుదల చేశారు. కాగా, అన్నామలై అడ్డగా మారిన కొంగునాడు ప్రాంతంలో ఒకేసారి పెద్ద ఎత్తున కీలక నేతలు పార్టీని వీడటం తమిళనాడు బీజేపీలో తీవ్ర కలకలం రేపింది.

బీజేపీకి తిరిగి రండి : నైనార్‌ నాగేంద్రన్‌

బీజేపీ నుంచి అన్నామలై ఉద్యమంలోకి రాష్ట్ర స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు నేతలు కదులుతుండటంతో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్‌ నాగేంద్రన్‌ , కేంద్ర సహాయ మంత్రి ఎల్‌ మురుగన్‌లో చైన్నె పార్టీ కార్యాలయంలో సమావేశమయ్యారు. కేడర్‌ను రక్షించుకునే దిశగా వ్యూహా రచనలో పడ్డారు. అనంతరం నైనార్‌ మీడియాతో మాట్లాడుతూ,. తెలిసి తెలియక పార్టీ వీడిన వారు ఎప్పుడైనా సరే తిరిగి రావచ్చు అని, వారిపై ఎలాంటి క్రమశిక్షణా చర్యలు తీసుకోబోమన్నారు. అన్నామలైతో తనకు ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేవని స్పష్టం చేశారు. వీ ద లీడర్స్‌ అనేది కేవలం ఒక ఉద్యమం మాత్రమేనని, ప్రధాని మోదీ ఆశీస్సులు తమకున్నాయని ఆ ఉద్యమ నేతలు పేర్కొంటుండటాన్ని ఖండిస్తున్నామన్నారు. ప్రధాని మోదీ లేదా అమిత్‌ షాల ఆశీస్సులు ఏ ఇతర ఉద్యమానికి లేవు అని స్పష్టం చేశారు. ఆ ఉద్యమంలో ఉంటూనే బీజేపీలోనూ కొనసాగవచ్చని కొందరు చెబుతున్నారని, అది సాధ్యం కాదని, బీజేపీ సిద్ధాంతాలు, దేశభక్తి పునాదులపై నడిచే ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీ అని, కార్యకర్తలు ఇలాంటి ప్రచారాలను నమ్మి ఎక్కడికీ వెళ్లవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రధాని మోదీ, అమిత్‌ షా పాల్గొన్న ప్రతి వేదికపైనా అన్నామలై ముందుండి కార్యక్రమాలను నడిపారని, అసెంబ్లీ ఎన్నికలలో ప్రత్యేక హెలికాఫ్టర్‌ ద్వారా 100 నియోజకవర్గాల్లో ప్రచారం చేశారని గుర్తు చేశారు. ఒకవేళ పార్టీతో ఏవైనా విభేదాలు ఉంటే ఆయన అప్పుడే చెప్పి ఉండాల్సిందని, ఇప్పుడు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికారు. పార్టీ వీడిన కొందరు నేతలు మళ్లీ బీజేపీ గూటికే చేరడం చరిత్రలో చూశామని, తాజాగా తెలిసి తెలియక వెళ్లిన వారంతా తిరిగి రావాలని పిలుపునిస్తున్నానని,. వారిపై ఎలాంటి చర్యలు ఉండవని బీజేపీ ఎప్పుడూ బలంగానే ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.

అన్నామలై వైపుగా బీజేపీ నేతల అడుగులు

Advertisement
 
Advertisement
Advertisement