సాక్షి, చైన్నె: చైన్నె నగరం నుండి నడిచే ప్రైవేట్ ఆమ్ని (ట్రావెల్స్) బస్సులు కచ్చితంగా కిలాంబాక్కం బస్టాండ్ నుండే నడపాలని, నగరంలోకి ప్రవేశించకూడదని రాష్ట్ర రవాణా శాఖ గతంలో జారీ చేసిన ఉత్తర్వులను చైన్నె హైకోర్టు రద్దు చేస్తూ సంచలన తీర్పునిచ్చింది. వివరాలు.. చైన్నె నుండి దక్షిణ జిల్లాలకు వెళ్లే అన్ని ప్రైవేట్ ఆమ్ని బస్సులు కిలాంబాక్కం బస్ టెర్మినల్ నుండే కార్యకలాపాలు సాగించాలని, నగర పరిధిలోకి రాకూడదని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని 2024 జనవరి 22న రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ ప్రైవేట్ బస్సు ఆపరేటర్లు, ఆమ్ని బస్సు యజమానుల సంఘం హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. గతంలో ఈ కేసును విచారించిన హైకోర్టు.. పోరూర్, సూరపట్టు ప్రాంతాలలో ప్రయాణికులను ఎక్కించుకోవడానికి, దించడానికి బస్సులకు అనుమతినిస్తూనే, దక్షిణ జిల్లాలకు వెళ్లే బస్సులు కిలాంబాక్కం బస్టాండ్ లోపలికి వెళ్లి రావాలని తాత్కాలిక మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
హైకోర్టు తుది తీర్పుతో ఊరట
ఈ కేసుపై తుది విచారణ జరిపిన న్యాయమూర్తి జస్టిస్ వి. లక్ష్మీనారాయణన్ బెంచ్ శనివారం తీర్పును వెలువరించారు. తమిళనాడు మోటార్ వాహనాల చట్టం ప్రకారం, ఒక బస్ టెర్మినల్ ఏర్పాటుకు రవాణా శాఖ అనుమతి కోరుతూ చైన్నె మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ దరఖాస్తు చేయడానికి వీల్లేదని పేర్కొన్నారు. కేవలం సంబంధిత స్థానిక సంస్థ మాత్రమే దరఖాస్తు చేయాలన్నారు. ఈదృష్ట్యా కిలాంబాక్కం బస్టాండ్ అనుమతి కోసం కాటాన్ కొళత్తూరు పంచాయతీ యూనియన్ రాష్ట్ర రవాణా కమిషనరేట్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు అని సూచించారు. ఒక నిర్దిష్ట రూట్‌లో బస్సును నడపడానికి రూట్ లైసెన్స్ మంజూరు చేసిన తర్వాత, దానిని అడ్డుకునే హక్కు రవాణా శాఖకు లేదని స్పష్టంచేశారు. ఆమ్ని బస్సులు కిలాంబాక్కం నుండే నడపాలన్న రవాణా శాఖ ఉత్తర్వులను న్యాయమూర్తి రద్దు చేశారు. అలాగే జనవరిలో రవాణా శాఖ అధికారులు, ఓమ్ని బస్సు యజమానుల మధ్య జరిగిన చర్చల సారాంశాన్ని కోర్టు ప్రస్తావించింది. పోరూర్ టోల్‌గేట్, సూరపేడు ప్రాంతాల తరహాలోనే.. మాధవరం రౌండానా సమీపంలోని ప్రాంతాన్ని కూడా ప్రయాణికులను ఎక్కించడానికి, దించడానికి ఉపయోగించుకోవాలని, ఈ నిర్ణయాన్ని కచ్చితంగా అమలు చేయాలని రవాణా అధికారులను న్యాయమూర్తి ఆదేశించారు.
ఆమ్నీ బస్సులు


