వివాహితపై అత్యాచారం కేసులో.. | - | Sakshi
Sakshi News home page

వివాహితపై అత్యాచారం కేసులో..

Jun 7 2026 3:51 AM | Updated on Jun 7 2026 3:51 AM

● ఆరుగురికి జీవిత ఖైదు

తిరువళ్లూరు: ఆలయ ఉత్సవానికి వెళ్లి కారులో తిరుగు ప్రయాణమైన మహిళను బలవంతంగా లాక్కెళ్లి ఆరుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారం చేయడంతో పాటూ ఆమె వద్ద వున్న బంగారు నగలను లాక్కెళ్లారు. ఈ కేసులో ఆరుగురికి జీవిత ఖైదు శిక్షను విధిస్తూ తిరువళ్లూరు జిల్లా కోర్టు న్యాయమూర్తి జూలియట్‌ పుష్ప శనివారం తీర్పును వెలువరించారు. వివరాలు.. దిండివనం ప్రాంతానికి చెందిన 40 ఏళ్ల వయస్సు వున్న వివాహిత మహిళ తన భర్తతో కలిసి తిరువళ్లూరు జిల్లా పూందమల్లి అయ్యప్పన్‌తాంగెల్‌ ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. ఈ క్రమంలో గత 2022వ సంవత్సరంలో దిండివనంలో జరిగిన ఆలయ ఉత్సవానికి వెళ్లిన మహిళ కారులో తిరుగు ప్రయాణమైంది. పూందమల్లి సమీపంలోని తెల్లియర్‌ అగరం ప్రాంతానికి సమీపంలో వస్తున్న సమయంలో అక్కడ మద్యం సేవిస్తున్న ఆరుగురు వ్యక్తులు కారును అడ్డగించారు. అనంతరం కారు డ్రైవర్‌ ఇళంగోవన్‌పై దాడి చేసి కారులో వున్న మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

బాధితుల ఫిర్యాదు మేరకు..

కారు డ్రైవర్‌, బాధిత మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోరూర్‌ ఎస్‌ఆర్‌ఎం కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పోలీసుల విచారణలో సామూహిక అత్యాచారానికి పాల్పడిన వ్యక్తులు అయ్యప్పన్‌ తాంగెల్‌ ప్రాంతానికి చెందిన వేలు కుమారుడు సూర్య(22), చిన్నయ్య కుమారుడు కరుప్పయ్య(27), అయ్యపాక్కం ప్రాంతానికి చెందిన అన్బళగన్‌ కుమారుడు దినేష్‌(28) కారపాక్కం ప్రాంతానికి చెందిన సెందిల్‌కుమార్‌ కుమారుడు గణేష్‌(19), సుందర్‌ కుమారుడు సంతోష్‌కుమార్‌(22) సుధాకర్‌ కుమారుడు సుభాష్‌(19)గా గుర్తించి అప్పట్లో అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. బాధిత మహిళ షెడ్యూల్‌ కులానికి చెందినవారు కావడంతో అట్రాసిటీ కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కేసు విచారణ తిరువళ్లూరు కోర్టులో సాగింది. తాజాగా విచారణ పూర్తయిన క్రమంలో ఐదుగురు నిందితులకు జీవితఖైదు శిక్షతో పాటు ఒక్కోక్కరికి రూ.67 వేలు జరిమానాను జడ్జి విధించారు. మరో వ్యక్తికి 20 ఏళ్ల జైలు శిక్షతో పాటూ రూ.27 వేలు చెల్లించాలని న్యాయమూర్తి ఆదేశించారు. అనంతరం నిందితులను పుళల్‌ జైలుకు తరలించారు. బాధిత మహిళకు ఓ ఎయిడెడ్‌ పాఠశాలలో ఉద్యోగాన్ని కల్పించారు.

Advertisement
 
Advertisement
Advertisement