తిరువొత్తియూరు: తమిళనాడులోని శీర్కాళి, వైదీశ్వరన్ కోయిల్, పరిసర ప్రాంతాల్లో గత కొన్ని వారాలుగా అనధికారికంగా విద్యుత్ కోతలు విధిస్తున్నారు. ముఖ్యంగా రాత్రి సమయాల్లో కరెంటు లేకపోవడంతో ప్రజలు నిద్రలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వ్యవసాయ పనులు కూడా దెబ్బతింటున్నాయి. గోవిందరాజ్ నగర్ వంటి ప్రాంతాల్లో సాయంత్రం 5 నుండి రాత్రి 8.30 వరకు కరెంటు ఉండటం లేదని స్థానికులు వాపోతున్నారు. దీనికి నిరసనగా సుమారు 200 కుటుంబాలకు చెందిన మహిళలు, పిల్లలు, వద్ధులు రోడ్లపైకి వచ్చి శుక్రవారం రాత్రి కాగడాలు పట్టుకుని ప్రదర్శన నిర్వహించారు. విద్యుత్ శాఖకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నివాస ప్రాంతాల సమీపంలో ఉన్న చెత్త కుప్పల వల్ల పాములు, తేళ్లు వంటి విషజంతువులు ఇళ్లలోకి వస్తున్నాయని, కరెంటు లేని సమయంలో వాటి వల్ల ప్రాణభయం కలుగుతోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే తమ ప్రాంతానికి నిరంతర విద్యుత్ సరఫరా చేయాలని అధికారులను కోరారు.
తిరుత్తణి: తిరుత్తణిలో పోలీసుల ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన పిటిషన్ మేళాలో 50 పెటిషన్‌లను పరిష్కరించారు. పోలీస్ స్టేషన్‌లలో చాలా కాలంగా పెండింగ్‌లో వున్న పెటిషన్లకు పరిష్కారం కనుగొనే విధంగా పిటిషన్ మేళా తిరుత్తణిలోని పోలీసుల బేరక్స్‌లో శనివారం నిర్వహించారు. ఏఎస్పీ శుభమ్‌ధిమాన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ మేళాలో తిరుత్తణి సబ్ డివిజన్‌లోని తిరుత్తణి, తిరువలంగాడు, కనకమ్మసత్రం, పొదటూరుపేట, ఆర్కేపేట, పళ్ళిపట్టు సహా 6 పోలీస్ స్టేషన్‌ల నుంచి పిటిషనర్లు పాల్గొన్నారు. పోలీసుల సమక్షంలో వాది, ప్రతివాదులు పాల్గొని పెటిషన్ల పట్ల పరిష్కారంకు చర్యలు చేపట్టి 50 పెటిషన్లను పరిష్కరించారు. ఇందులో ఇన్‌స్పెక్టర్లు కార్తిక్, శివకుమార్ సహా పోలీసులు పాల్గొన్నారు.
తిరువొత్తియూరు: పొన్నేరి ప్రాంతంలో తమిళనాడు ప్రభుత్వం నిషేధించిన గుట్కా ఉత్పత్తులను గోడౌన్లలో దాచి ఉంచి, చిల్లర దుకాణాలకు విక్రయిస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ తమిళన్బన్‌కు రహస్య సమాచారం అందింది. దీని ఆధారంగా ఇన్‌స్పెక్టర్, పోలీసులు కలిసి ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పొన్నేరి సమీపంలోని తిరువాయుర్పాడిలో ఉన్న ఒక చిన్న దుకాణంలో తనిఖీలు నిర్వహించగా, చిన్నకావణం ప్రాంతానికి చెందిన హరి బాబు అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో, దుకాణాలకు హోల్‌సేల్‌గా గుట్కా సరఫరా చేస్తున్నది ఎవరో తెలిసింది. తిరువేంగడపురంకు చెందిన అరుణ్ కుమార్, పులిక్కుళం ప్రాంతంలో ఒక ఇంటిని అద్దెకు తీసుకుని, అక్కడ బస్తాల కొద్దీ గుట్కాను నిల్వ ఉంచి విక్రయిస్తున్నట్లు గుర్తించారు.దీంతో పోలీసులు అరుణ్ కుమార్‌ను కూడా అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి రూ 75 వేల విలువైన 106 కిలోల గుట్కా ఉత్పత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పొన్నేరి పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కొరుక్కుపేట: బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ చేపట్టిన ఇద్దరు పోలీసు అధికారులను సస్పెండ్ చేశారు. వివరాలు.. తేని జిల్లా లోని పెరియకుళం వడకరైకి చెందిన ముత్తుపాండి (34) పెరియకుళంలోని ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అక్కడ అతను అరువుపై గృహోపకరణాలు కొనుగోలు చేసి, వాటికి డబ్బు చెల్లించకుండా, పనికి వెళ్లకుండా ఉండేవాడు. ఈ విషయమై ఆ ప్రైవేట్ కంపెనీ తేని పోలీస్ స్టేషన్‌లో సబ్–ఇన్ స్పెక్టర్ షేక్ సమీకి ఫిర్యాదు చేసింది. అయితే, ఆ ఫిర్యాదుపై సబ్–ఇన్‌స్పెక్టర్ కేసు నమోదు చేయలేదు. ఈ పరిస్థితిలో, కొన్ని రోజుల క్రితం, తాను పనిచేస్తున్న కంపెనీకి కొత్తగా వచ్చిన ముత్తుపాండి మేడ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. దీని తర్వాత, అతడిని ఆత్మహత్యకు ప్రేరేపించారనే ఆరోపణలపై పోలీసులు ఆ ప్రైవేట్ కంపెనీకి చెందిన ఐదుగురు ఉద్యోగులను అరెస్టు చేశారు. ఇదిలా ఉండగా, ప్రైవేట్ కంపెనీ ఇచ్చిన ఫిర్యాదుపై ముందుగా విచారణ జరపని సబ్–ఇన్‌స్పెక్టర్ షేక్ సమీమ్‌ను, ఫిర్యాదు గురించి సమాచారం ఇవ్వని స్పెషల్ సబ్–ఇన్‌స్పెక్టర్ అరుల్‌ను జిల్లా ఎస్పీ స్నేహ సస్పెండ్ చేశారు.
వేటకు వెళ్లిన జాలర్లు అదృశ్యం
తిరువొత్తియూరు: సముద్రంలో వేటకు వెళ్లిన ముగ్గురు జాలర్లు అదృశ్యమయ్యారు. కడలూరు జిల్లా సి.పుదుపేట షణ్ముగ నగర్‌కు చెందిన రవి(28), మనోహర్ (27), పుదుచ్చేరి రాష్ట్రం కనకచెట్టికుళంకి చెందిన నాగవేల్ (40) ఈనెల 2న పుదుపేట ఇందిరానగర్‌కు చెందిన వీరవేల్ ఫైబర్ బోటులో వేటకు వెళ్లారు. వారు మరుసటి రోజే ఒడ్డుకు తిరిగి రావాల్సి ఉంది. కానీ వారు తిరిగి రాకపోవడంతో తోటి జాలర్లు వారి కోసం వెతికారు. కోస్ట్ గార్డ్ ద్వారా గాలింపు చర్యలు చేపడుతున్నామని మత్స్యశాఖ అధికారులు తెలిపారు. త్వరలోనే వారిని కనిపెడతామని హామీ ఇచ్చారు.


