సాక్షి, చైన్నె: ప్రపంచవ్యాప్త ఉద్యోగ అవకాశాలను విస్తరించేందుకు నగరానికి చెందిన చైన్నెస్ అమృత గ్రూప్ ఆఫ్ ఇనిస్టిట్యూషన్స్ మలేషియన్ అసోసియేషన్ ఆఫ్ హోటల్స్(ఎంఏహెచ్)తో చారిత్రాత్మక అవగాహన ఒప్పందాన్ని చేసుకుంది. ఈ మేరకు స్థానికంగా జరిగిన సమావేశంలో చైన్నెస్ అమృత ఇన్‌స్టిట్యూట్ ఛైర్మన్ భూమినాథన్ , మలేషియన్ అసోసియేషన్ ఆఫ్ హోటల్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయిన ఐజాక్‌రాజ్ ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసి మార్చుకున్నారు. ముందుగా చైన్నెకి చెందిన అమృత విద్యార్థులు తమ అద్భుతమైన ప్రతిభను ప్రదర్శించారు. పండ్లు, కూరగాయల చెక్కడాలు, కళ్లకు గంతలు కట్టుకుని నాప్‌కిన్‌లను మడవడం, సృజనాత్మక టవల్ ఆర్ట్ ప్రదర్శనలతో తమ అసాధారణమైన ఆతిథ్య నైపుణ్యాలను ప్రదర్శించారు. అనంతరం ఆర్. భూమినాథన్ మాట్లాడుతూ హాస్పిటాలిటీ విద్యార్థులకు అంతర్జాతీయ కెరీర్ మార్గాలను మెరుగుపరిచే దిశగా మలేషియా సంస్థతో ఒప్పందం చేసుకున్నట్టు తెలిపారు. దేశవ్యాప్తంగా 1,100కు పైగా హోటళ్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న మలేషియాలోని మలేషియన్ అసోసియేషన్ ఆఫ్ హోటల్స్‌తో ఒప్పందం కుదుర్చుకోవటం తమ విద్యార్థులు అదృష్టమని అన్నారు. ఈ సహకారం కింద, మలేషియాలోని ఎంఏహెచ్ అనుబంధ హోటళ్లలో ఏటా 1,000 మందికి పైగా విద్యార్థులు ప్లేస్‌మెంట్ అవకాశాలతో ప్రయోజనం పొందుతారన్నారు. ఈ భాగస్వామ్యం విద్యార్థులకు అమూల్యమైన ప్రపంచవ్యాప్త అనుభవాన్ని, అంతర్జాతీయ పని అనుభవాన్ని పొందగలరని పేర్కొన్నారు. చైన్నెస్ అమృత ఇప్పటికే 31,651 జాతీయ, అంతర్జాతీయ ప్లేస్‌మెంట్‌ల అద్భుతమైన రికార్డుతో హాస్పిటాలిటీ విద్యారంగంలో అగ్రగామిగా నిలిచిందన్నారు. ఇందులో ఫ్యూచర్ డ్రీమ్ అకాడమీ సీఈఓ కలైయరసన్, చైన్నెస్ అమృత ఇన్‌స్టిట్యూట్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ బానుమతి తదితరులు పాల్గొన్నారు.


