సాక్షి, చైన్నె: డీఎంకేకు ముందే చెప్పే కూటమి నుంచి బయటకు వచ్చామని కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం వ్యాఖ్యలు చేశారు. శనివారం చైన్నెలో సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర పాండియన్‌తో ఆయన భేటీ అయ్యారు. రాష్ట్రంలో సీపీఐ, సీపీఎం పార్టీలను తమ కూటమిలోకి చేర్చుకోవడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తోందనే ప్రచారం జరుగుతున్న తరుణంలో, భారత కమ్యూనిస్ట్ పార్టీ ( సీపీఐ ) తమిళనాడు రాష్ట్ర కార్యదర్శి. వీరపాండ్యన్‌ను కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరం కలవడం ప్రాధాన్యతకు దారి తీసింది. చైన్నె టి.నగర్ లోని సీపీఐ ప్రధాన కార్యాలయం బాలన్ ఇల్లంలో ఈ భేటీ జరిగింది. రాబోయే రాజకీయ సమీకరణాల దృష్ట్యా ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. అనంతరం చిదంబరం ను మీడియా ప్రశ్నించగా, భారత కమ్యూనిస్ట్ పార్టీ నాయకులను, ముఖ్యంగా ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి వీరపాండియన్ ను కేవలం మర్యాదపూర్వకంగా కలవడానికి మాత్రమే ఇక్కడికి వచ్చానని పేర్కొన్నారు. చాలా సంతోషం, ధన్యవాదాలని చిదంబరం క్లుప్తంగా ముగించారు.
డీఎంకే కూటమి గురించి..
అదే సమయంలో డీఎంకే కూటమిలో ఉన్న కాంగ్రెస్, ఎన్నికల తర్వాత కనీసం కృతజ్ఞతలు కూడా చెప్పకుండా టీవీకే పార్టీకి మద్దతుగా వెళ్లిపోయిందనే విమర్శలు ఉన్నాయి కదా? అని ప్రశ్నించగా, తాను ఈ విషయంలో లోతుగా వెళ్లాలనుకోవడం లేదన్నారు. అయితే, తాము డీఎంకేకు ముందే చెప్పే వచ్చామని, దీనికి మించి తానేమీ మాట్లాడనన్నారు. మళ్లీ ఎన్నికలను ఎదుర్కొనేందుకు అటు పార్టీగానీ, ఇటు తమిళనాడు ప్రజలుగానీ సిద్ధంగా లేరన్నారు. ఇదే అభిప్రాయాన్ని సీపీఐ, సీపీఎం, వీసీకే, ఐయూఎంఎల్ పార్టీలు కూడా వ్యక్తం చేశాయన్నారు. తమ వైఖరిలో, ఇతర మిత్రపక్షాల వైఖరిలో ఎలాంటి మార్పు లేదన్నారు. వారు రెండు రోజుల తర్వాత నిర్ణయం తీసుకున్నారని, తాము మరుసటి రోజే నిర్ణయం తీసుకున్నామని, కేవలం సమయంలోనే తేడా తప్ప, తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదని వ్యాఖ్యలు చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వీరపాండియన్ మాట్లాడుతూ పి. చిదంబరం తమ కార్యాలయానికి రావడం కేవలం మర్యాదపూర్వక భేటీ మాత్రమేనని స్పష్టం చేశారు. గతంలో చిదంబరంతో కలిసి పనిచేసిన మోహన్ కుమారమంగళం, ఎ.ఎమ్. గోపు, టి పాండియన్, కె.డి.కె. తంగమణి, వి.పి. చింతన్ వంటి సీనియర్ ట్రేడ్ యూనియన్ నాయకుల గురించి తాము చర్చించామన్నారు. అలాగే ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాలు, ప్రజల తీర్పుపై సాధారణంగా మాట్లాడుకున్నామన్నారు.
కాంగ్రెస్ కూటమిలోకి కమ్యూనిస్టులు?:
కాంగ్రెస్ ప్రయత్నాలపై స్పందిస్తూ, కమ్యూనిస్ట్ పార్టీ అంత సులభంగా ఏ కూటమిలోనూ చేరదన్నారు. అలాంటి నిర్ణయాలు తాము ఒంటరిగా తీసుకోమని, ఆ పరిస్థితులు వచ్చినప్పుడు పార్టీ కమిటీ ద్వారానే నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రస్తుతం తాము సెక్యులర్ ప్రోగ్రెసివ్ కూటమి(డీఎంకే) లోనే ఉన్నామన్నారు. ఆ కూటమిలో ఉంటూనే టీవీకే ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నామన్నారు. ఇండియా కూటమి సమావేశానికి డీఎంకే హాజరు కాక పోవడం వారి వ్యక్తిగత నిర్ణయమి తాము ఇండియా కూటమిలోనే ఉన్నామన్నారు. జాతీయ స్థాయిలో జరిగే సమావేశంలో తమ పార్టీ కేంద్ర నాయకులు పాల్గొంటారన్నారు.
చిదంబరం


