స్థానిక సంస్థలకు 16 సూత్రాల మార్గదర్శకాలు | - | Sakshi
Sakshi News home page

స్థానిక సంస్థలకు 16 సూత్రాల మార్గదర్శకాలు

Jun 7 2026 3:51 AM | Updated on Jun 7 2026 3:51 AM

● సీఎం విజయ్‌ నిర్ణయం

సాక్షి,చైన్నె : తమిళనాడు పట్టణ ప్రాంతాలలో, చైన్నె కార్పొరేషన్‌ పరిధిలో స్థానిక సంస్థల సేవలను మెరుగుపరచడానికి, నగర సుందరీకరణతో పాటుగా ఆదాయ వనరులను పెంచడానికి సీఎం సి. జోసెఫ్‌ విజయ్‌ చర్యలు చేపట్టారు. ఆయన ఆదేశాల మేరకు పురపాలక పరిపాలన, నీటి సరఫరా శాఖ శనివారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది.

16 సూత్రాల మార్గదర్శకాలు

● పారిశుధ్య పనులను, వీధుల శుభ్రతను పర్యవేక్షించడానికి కార్పొరేషన్‌ కమిషనర్లు, జాయింట్‌ కమిషనర్లు, , జోనల్‌ అధికారులు అందరూ ప్రతిరోజూ ఉదయం 7 గంటలకు క్షేత్రస్థాయికి (ఫీల్డ్‌ విజిట్‌) చేరుకోవాలి.

● ప్రజల రాకపోకలు పెరగక ముందే తెల్లవారుజామునే వీధులను శుభ్రం చేయాలి. బహిరంగ మరుగుదొడ్లు నిరంతరం శుభ్రంగా, చెత్తాచెదారం లేకుండా ఉండేలా ఉన్నతాధికారులు ప్రతిరోజూ తనిఖీలు నిర్వహించాలి.

● నగరం సుందరీకరణను పాడుచేసేలా బహిరంగ గోడలపై ఇష్టానుసారంగా పోస్టర్లు అతికించడాన్ని పూర్తిగా నిషేధించారు. కేవలం ప్రభుత్వం కేటాయించిన ప్రత్యేక ప్రదేశాలలో మాత్రమే ప్రకటనలు ప్రదర్శించాలి.

● నగరంలోని వీధి దీపాలను వారానికి ఒకసారి ఖచ్చితంగా తనిఖీ చేయాలి. ఎక్కడైనా దీపాలు వెలగకపోతే లేదా పాడైపోతే సమాచారం అంది న 24 గంటలలోపు వాటిని మరమ్మత్తు చేయాలి.

● చైన్నెలోని సుమారు 3.11 లక్షల వీధి కూడళ్ల పరిధిలో ప్రతిరోజూ సెప్టిక్‌ ట్యాంకులు, డ్రైనేజీ వ్యవస్థలను తనిఖీ చేసి, 99.2 శాతం ప్రాంతాలను తక్షణమే క్రిమిరహితం చేయడానికి కఠిన చర్యలు తీసుకోవాలి.

● స్థానిక సంస్థల ఆర్థిక వనరులను బలోపేతం చేయడానికి ఆస్తి పన్ను వసూళ్లను వేగవంతం చేయాలని, నీటి పంపిణీ వ్యవస్థను క్రమబద్ధీకరించాలని స్పష్టం చేశారు.

ప్రజ్ఞానందకు అభినందనలు

నార్వే చెస్‌ 2026 టోర్నమెంట్‌లో టైటిల్‌ గెలుచుకుని, ఈ ఘనత సాధించిన తొలి భారతీయుడిగా సరికొత్త చరిత్ర సృష్టించిన యువ గ్రాండ్‌మాస్టర్‌ ఆర్‌. ప్రజ్ఞానందకు సీఎం సి. జోసెఫ్‌ విజయ్‌ అభినందనలు తెలిపారు. ఒకే టోర్నమెంట్‌లో ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌ను రెండుసార్లు ఓడించడమే కాకుండా, వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో విజయం సాధించి ప్రజ్ఞానంద అద్భుతమైన రికార్డు సృష్టించడం ఆనందంగా ఉందన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement