సాక్షి, చైన్నె: డీఎంకే నేతృత్వంలో జరిగిన సభలో పాల్గొన్న ప్రముఖ నటుడు సత్యరాజ్ భావోద్వేగంగా మాట్లాడుతూ, ప్రత్యర్థులపై తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తాను సాధారణంగా చాలా వ్యంగ్యంగా మాట్లాడతానని, ప్రతిదానిని హాస్యంగా తీసుకోలేనని, కొందరు తనను ఇన్‌స్ట్రాగామ్‌లో రకరకాలుగా తిడుతున్నారని వివరించారు. అయితే తాను వాటి గురించి అస్సలు చింతించనని పేర్కొన్నారు. నటుడు విజయ్ స్థాపించిన పార్టీని ఉద్దేశిస్తూ.. ‘కేవలం పేర్లు మార్చితే సరిపోదు, ద్రావిడ మోడల్ ఇప్పటికే ఎన్నో మార్పులు తెచ్చిందన్నారు. సినిమాపై అభిరుచి ఉండటం వేరు, రాజకీయం వేరు అంటూ మార్పు కావాలనుకున్నప్పుడు, అది ఎలాంటి మార్పు అనేది ఆలోచించాల్సిన అవశ్యం ఉందన్నారు.. ద్రావిడ సామాజిక న్యాయ భావజాలానికి భిన్నమైన సిద్ధాంతాలు వస్తే ప్రజలు ఆలోచించాలని సూచించారు. సోదరుడు విజయ్.. అంబేడ్కర్, ద్రావిడ , తమిళ జాతీయవాదం తన రెండు కళ్లు అంటున్నారని, ఇక్కడ కేవలం నాయకులు, వ్యక్తులు మాత్రమే మారుతున్నారన్నారు. పార్టీలలో లోపాలు ఉంటే వాటిని ప్రశ్నించి, పరిష్కరించే వారికే ఓటు వేయాలి అని పిలుపునిచ్చారు. కొలత్తూరు యోజకవర్గంలో ఎం.కె. స్టాలిన్ గెలవలేదంటూ వస్తున్న విమర్శలపై సత్యరాజ్ స్పందిస్తూ, అవన్నీ అవాస్తవాలని కొట్టిపారేశారు. రాబోయే రోజుల్లో కూడా స్టాలిన్ నాయకత్వమే బలంగా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇద్దరు బాలికలకు లైంగిక వేధింపులు
– తల్లి రెండో భర్త అరెస్ట్
తిరువొత్తియూరు: సేలం సమీపంలోని అయోధ్యపట్నంకు చెందిన మహిళ (38) తన మొదటి భర్త నుండి విడిపోయి, తన 17 ఏళ్ల, 15 ఏళ్ల కుమార్తెలతో కలిసి నివసిస్తోంది. కొన్ని సంవత్సరాల క్రితం, ఆమె రమేష్ (36) అనే వ్యక్తిని రెండో వివాహం చేసుకుంది. గత కొన్ని రోజులుగా, రమేష్ తన ఇద్దరు సవతి కుమార్తెలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడు. అతని వేధింపులను భరించలేక, ఆ బాలికలు శుక్రవారం అమ్మపేట మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీస్ ఇన్‌స్పెక్టర్ పంకజం నేతృత్వంలో విచారణ చేపట్టిన పోలీసులు, రమేష్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. శనివారం అతడిని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నారు.


