తమిళనాడు అసెంబ్లీకి తొలి మహిళా కార్యదర్శి | - | Sakshi
Sakshi News home page

తమిళనాడు అసెంబ్లీకి తొలి మహిళా కార్యదర్శి

Jun 7 2026 3:51 AM | Updated on Jun 7 2026 3:51 AM

– బాధ్యతలు స్వీకరించిన శాంతి

సాక్షి, చైన్నె : తమిళనాడు అసెంబ్లీకి తొలి మహిళా కార్యదర్శిగా శాంతి నియమితులయ్యారు. ఆమె శనివారం తన బాధ్యతలను స్వీకరించారు.సీఎం విజయ్‌, అసెంబ్లీ స్పీకర్‌ జేసీడీ ప్రభాకర్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. కె. శాంతి తమిళనాడు శాసనసభ సచివాలయంలో దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఉన్న సీనియర్‌ అధికారి. ఆమె నేరుగా ఐఏఎస్‌ కేడర్‌ అధికారి కాకపోయినప్పటికీ, అసెంబ్లీ సెక్రటేరియట్‌ సర్వీసెస్‌ ద్వారా పదోన్నతులు పొందుతూ ఈ అత్యున్నత స్థానానికి చేరుకున్నారు. అసెంబ్లీ నిబంధనలు, చట్టసభల పనితీరుపై ఉన్న పట్టు కారణంగా ఆమె మార్చి లో శాసనసభ ప్రత్యేక కార్యదర్శిగా పదోన్నతి పొందారు. ఇప్పటివరకు కార్యదర్శిగా ఉన్న శ్రీనివాసన్‌ రాజీనామాతో తమిళనాడు ప్రభుత్వం ఆమెను పూర్తిస్థాయి కార్యదర్శిగా నియమించింది. ఆమె పదవీకాలం జూలైతో ముగియాల్సి ఉన్నప్పటికీ, ప్రభుత్వం ఆమె సేవలను గుర్తించి మరో ఏడాది పాటు పదవీకాలాన్ని పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో తమిళనాడు అసెంబ్లీ చరిత్రలోనే ఈ పదవిని చేపట్టిన తొలి మహిళగా ఆమె రికార్డు సృష్టించారు. కాగా, సభలో ఏవైనా రాజ్యాంగపరమైన లేదా చట్టపరమైన చిక్కులు వచ్చినప్పుడు స్పీకర్‌కు తగిన సలహాలు ఇచ్చే మొదటి వ్యక్తి కార్యదర్శే. సభ నియమ నిబంధనల పుస్తకంపై వీరికి పూర్తి అథారిటీ ఉంటుంది. అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు జరగాలనే తేదీల అధికారిక నోటిఫికేషన్లను జారీ చేయడం. సభలో రోజూ ఏయే బిల్లులు ప్రవేశపెట్టాలి, ఏ అంశాలపై చర్చ జరగాలనే అజెండా ముందుగానే సిద్ధం చేయడం , కొత్త చట్టాల రూపకల్పన ప్రక్రియలోలోపాలు లేకుండా పర్యవేక్షించడం వంటి బాధ్యతలను నిర్వర్తిస్తారు.

Advertisement
 
Advertisement
Advertisement