న్యూస్‌రీల్
సాక్షి,చైన్నె: తమిళనాడులో కొత్తగా కొలువుదీరిన సీఎం విజయ్ నేతృత్వంలోని మంత్రివర్గం శుక్రవారం నిర్వహించిన తొలి కేబినెట్ భేటీలో సరికొత్త నిర్ణయాలను తీసుకున్నారు. సచివాలయంలో ‘వెట్రి తమిళగం’( విజయవంతమైన తమిళనాడు) పేరుతో జరిగిన ఈ తొలి కేబినెట్ భేటీ వివరాలను రాష్ట్ర మంత్రి సి.టి.ఆర్.నిర్మల్‌కుమార్ ప్రకటించారు. గత నెల సీఎం విజయ్‌తోపాటు తొమ్మిది మంది మంత్రులు తొలుత ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు తీసుకున్నారు. అనంతరం కూటమిలోని కాంగ్రెస్‌తోపాటు టీవీకే ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత కూటమిలోని ఐయూఎంఎల్, వీసీకే ఎమ్మెల్యేలు మంత్రులయ్యారు. మూడు సార్లు సాగిన మంత్రి వర్గ కూర్పుతో విజయ్ కేబినెట్‌లో మొత్తం సంఖ్య 35కు చేరింది. ఇందులో సీఎం విజయ్ ఒకరు కాగా, మిగిలిన వారు సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రులుగా గుర్తింపు పొందారు. అధికార పగ్గాలు చేపట్టినానంతరం తొలి మంత్రి వర్గ సమావేశం శుక్రవారం సచివాలయంలో జరిగింది. ఇందులో ఎన్నికల వాగ్దానాల అమలు, సరికొత్త పాలన దిశగా చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ప్రధానంగా పంచ సూత్రాలు అన్నట్టుగా ఐదు కీలక రంగాలకు ప్రాధాన్యతను ఇవ్వడానికి నిర్ణయించారు.
436 అంశాలతో ప్రతిష్టాత్మక ముందడుగు
కేబినెట్ భేటీగురించి మంత్రి నిర్మల్‌కుమార్ మీడియాకు వివరిస్తూ ఎన్నికల హామీలతోపాటు రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన 436 ప్రతిష్టాత్మక ప్రాజెక్టులు, అంశాలతో ముందడుగు దిశగా ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించినట్లు వివరించారు.
ప్రతి శాఖకూ టార్గెట్లు
సీఎం విజయ్ తన మదిలోని విజన్ మేరకు కీలక ఆదేశాలతో తమిళనాడును అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలబెట్టడమే లక్ష్యంగా ఈ సమావేశాన్ని నడిపించారని మంత్రి నిర్మల్‌కుమార్ తెలిపారు. ప్రభుత్వంలోని ప్రతి శాఖకూ సీఎం విజయ్ కొన్ని ప్రత్యేకమైన, దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్దేశించారన్నారు. ఆయా శాఖల మంత్రులు తమ పరిధిలోని ఉన్నతాధికారులతో కలిసి ఈ లక్ష్యాలను సాధించేందుకు తక్షణమే కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారని వివరించారు.
436 ప్రాజెక్టులపై కసరత్తు
ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రధాన హామీలతో పాటు, తమిళనాడు భవిష్యత్తును మార్చే మరో 436 సరికొత్త వ్యూహాత్మక ప్రాజెక్టులపై ఈ తొలి కేబినెట్ భేటీలోనే ప్రాథమిక ఆమోదం లభించిందన్నారు. వీటిని త్వరితగతిన ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ ఏర్పాటు చేయనున్నారని తెలిపారు. కర్ణాటక ప్రభుత్వం కావేరి నదిపై నిర్మించ తలపెట్టిన మేఘదాతు డ్యామ్ వివాదంపై కూడా ఈ సమావేశంలో చర్చించామన్నారు. తమిళనాడు రైతుల ప్రయోజనాలకు భంగం కలిగించేలా ఉన్న ఈ ప్రాజెక్టును అడ్డుకునేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో న్యాయపరమైన చర్యలు తీసుకుంటుందని, ఈ విషయంలో వెనక్కి తగ్గేదేలేదని కేబినెట్ స్పష్టం చేసినట్టు ప్రకటించారు.
మంత్రివర్గ సమావేశంలో సీఎం విజయ్ 5 కీలక రంగాలకు ప్రాధాన్యతను ఇచ్చినట్టు ప్రకటించారు. ఇందులో యువత అభ్యున్నతి– ఉపాధి నినాదంతో యువత నైపుణ్యాలను పెంపొందించి, వారికి విస్తృత ఉపాధి అవకాశాలు కల్పించడం లక్ష్యంగా పేర్కొన్నారు. తర్వాత మహిళా సాధికారత నినాదంతో రాష్ట్రంలోని మహిళల సామాజిక, ఆర్థికవృద్ధికి అవసరమైన ప్రత్యేక పథకాల అమలుకు నిర్ణయించామన్నారు. రైతులు– మత్స్యకారుల సంక్షేమం పేరిట ప్రాథమిక రంగాలైన వ్యవసాయం, మత్స్య పరిశ్రమల అభివృద్ధికి విప్లవాత్మక ప్రాజెక్టులు చేపట్టనున్నామన్నారు. అవినీతి రహిత సుపరిపాలన లక్ష్యంగా లంచం అనేదే లేని, పారదర్శకమైన ప్రజా పరిపాలనను అందించడం గురించి కీలకంగా నిర్ణయాలు తీసుకున్నట్టు వివరించారు. డ్రగ్స్ రహిత తమిళనాడు నినాదంతో రాష్ట్రంలో గుట్కా, గంజాయి వంటి అన్ని రకాల మత్తు పదార్థాల విక్రయాలను, రవాణాను పూర్తిగా నిర్మూలించడం తక్షణ కర్తవ్యంగా చర్యలు చేపట్టామన్నారు.


