బీజేపీకి ఎలాంటి నష్టం లేదు | - | Sakshi
Sakshi News home page

బీజేపీకి ఎలాంటి నష్టం లేదు

Jun 6 2026 12:05 AM | Updated on Jun 6 2026 12:05 AM

● నైనార్‌ నాగేంద్రన్‌

సాక్షి, చైన్నె: తమిళనాడు బీజేపీలో జరుగుతున్న తాజా పరిణామాలపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నైనార్‌ నాగేంద్రన్‌ స్పందించారు. కే. అన్నామలై పార్టీకి రాజీనామా చేసి సరికొత్త రాజకీయ ఉద్యమాన్ని ప్రకటించిన నేపథ్యంలో, ఆయన నిష్క్రమణపై నైనార్‌ నాగేంద్రన్‌ మీడియా వేదికగా శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేశారు. అన్నామలై వైదొలగడం వలన భారతీయ జనతా పార్టీకి ఎలాంటి నష్టం లేదని ఆయన స్పష్టం చేశారు.

బీజేపీ సిద్ధాంతాల పార్టీ

అన్నామలై రాజీనామాపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు నైనార్‌ నాగేంద్రన్‌ బదులిస్తూ బీజేపీ ఒక వ్యక్తి చుట్టూ తిరిగే పార్టీ కాదని గుర్తుచేశారు. అన్నామలై పార్టీని వీడడం వల్ల బీజేపీకి ఎలాంటి నష్టం అన్నది లేదన్నారు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అనేది ఒక బలమైన సిద్ధాంత ప్రాతిపదికన నడిచే పార్టీ అని, ప్రజాస్వామ్యంలో ఒక కొత్త ఉద్యమాన్ని లేదా రాజకీయ పార్టీని ప్రారంభించే హక్కు ఎవరికై నా ఉంటుందన్నారు.

తమిళనాడుపై ప్రధాని మోదీకి ప్రత్యేక ప్రేమ

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తమిళనాడు అభివృద్ధికి ఎంతో ప్రాధాన్యత ఇస్తోందని నైనార్‌ నాగేంద్రన్‌ ఈ సందర్భంగా వివరించారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లినా, ఏ వేదికపై మాట్లాడినా తమిళ భాష, తమిళ సంస్కృతి, తమిళ ప్రజల గొప్పతనాన్ని ప్రస్తావిస్తూనే ఉంటారన్నారు. ఇటీవల కాలంలో మన ప్రాచీన తమిళ రాగి శాసనాలను కూడా కేంద్ర ప్రభుత్వం విదేశాల నుంచి పునరుద్ధరించి తీసుకొచ్చిందని గుర్తు చేశారు. తమిళనాడులో మౌలిక వసతుల కల్పనకు, జాతీయ రహదారుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిరంతరం నిధులను మంజూరు చేస్తున్నదన్నారు. రాష్ట్రంలోని పేద ప్రజలకు అందుతున్న రేషన్‌ సరుకులను కూడా కేంద్ర ప్రభుత్వమే అందిస్తున్నదని గుర్తు చేశారు. అన్నామలై సొంత పార్టీనో లేదా ఉద్యమాన్నో తెరపైకి తెస్తున్నప్పటికీ తమిళనాడులో బీజేపీ క్యాడర్‌ బలంగానే ఉందని, కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలే తమను ప్రజల్లో ముందుంచుతాయని నైనార్‌ నాగేంద్రన్‌ ధీమా వ్యక్తం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement