సాక్షి, చైన్నె: నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకడంతో తమిళనాడు విపత్తు నిర్వహణ బృందం, అధికారులను సీఎం విజయ్ అప్రమత్తం చేశారు. సచివాలయంలో శుక్రవారం ఆ విభాగం వర్గాలతో ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల రాకతో రాబోయే రోజుల్లో వర్షాలు, విపత్తులను ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ఈ ఏడాది నైరుతి రుతుపవనాల కాలంలో తమిళనాడులో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం 80 శాతం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసిన నేపథ్యంలో.. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేలా సీఎం విజయ్ అధికారులకు దిశానిర్దేశం చేశారు.
అలర్ట్: ఏదేని విపత్తులు ఎదురైనపక్షంలో ప్రాణనష్ట నివారణే ప్రథమ లక్ష్యంగా ముందుకు సాగాలని ఆదేశించారు. విపత్తు కాలంలో ఎలాంటి అత్యవసర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం, జిల్లా అత్యవసర కార్యాచరణ కేంద్రాలు 24 గంటలు పనిచేయాలని, సహాయక ఉపకరణాలు సిద్ధంగా ఉంచాలని సూచించారు. గ్రేటర్ చైన్నె కార్పొరేషన్ సహా అన్ని జిల్లాల్లో రోడ్లపై నీరు నిలవకుండా, చెట్లు విరిగిపడితే తక్షణమే తొలగించేలా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలన్నారు. నైరుతి తర్వాత ఈశాన్య రుతు పవనాల సీజన్ మొదలు కానుండడంతో ఈ నాలుగు నెలలు అప్రమత్తంగా ఉండాలని, ముందస్తు చర్యలు విస్తృతం చేయాలని ఆదేశించారు. మంత్రులు కె.ఎ. సెంగోట్టయన్ , సీఎస్ సాయికుమార్, ఇతర కీలక విభాగాల కార్యదర్శులు, అధికారులు ఎన్.మురుగానందం, డాక్టర్ జె.రాధాకృష్ణన్, డాక్టర్ కె. మణివాసన్, ఎమ్.ఎ. సిద్ధిఖ్, సత్యబ్రత సాహు, థామస్ వైద్యన్, కేఎస్.పళణిస్వామి, సమీరన్, డీజీపీ మహేష్‌కుమార్ అగర్వాల్, అగ్నిమాపక శాఖ డైరెక్టర్ సీమా అగర్వాల్ పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లు హాజరయ్యారు.


