సాక్షి, చైన్నె: తమిళనాడు రాజకీయ చరిత్రలో సరికొత్త అధ్యాయానికి వేదిక సిద్ధమైంది. రాష్ట్రంలో కొత్తగా కొలువుదీరిన సీఎం విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వ మొదటి శాసనసభ సమావేశాల తేదీ అధికారికంగా ఖరారైంది. జూన్ 18వ తేదీ నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నట్లు శాసనసభ కార్యాలయం శుక్రవారం ప్రకటించింది. సీఎం విజయ్ అధ్యక్షతన కేబినెట్ భేటీ ముగిసిన గంటలో అసెంబ్లీ సమావేశాల తేదీని ప్రకటించారు. ఇదివరకు గత నెల ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, స్పీకర్ ఎంపిక, సీఎం విజయ్ నేతృత్వంలోని ప్రభుత్వం విశ్వాస పరీక్ష నిమిత్తం అసెంబ్లీ సమావేశమైన విషయం తెలిసిందే.
గవర్నర్ ప్రసంగంతో ప్రారంభం
పూర్తి స్థాయిలో ప్రభుత్వం, మంత్రి వర్గం ఏర్పాటుతో కొత్త ప్రభుత్వంలో తమిళనాడు తొలి శాసనసభ సమావేశాలు జూన్ 18 ఉదయం 10గంటలకు చైన్నె సచివాలయంలోని అసెంబ్లీ హాల్‌లో ప్రారంభం కానున్నట్టు ప్రకటించారు. సంప్రదాయం ప్రకారం, కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరుగుతున్న మొదటి సమావేశాలు కావడంతో తొలిరోజు తమిళనాడు గవర్నర్ ప్రసంగంతో సభలు మొదలవుతాయని వివరించారు. గవర్నర్ ప్రసంగంలో సీఎం విజయ్ ప్రభుత్వ రాబోయే ఐదేళ్ల ప్రణాళికలు ప్రకటించనుంది.
తొలి పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం
విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జరుగుతున్న అత్యంత ప్రాధాన్యత కలిగిన తొలి అసెంబ్లీ సెషన్ ఇదే కావడం విశేషం. ఈ సమావేశాల్లోనే విజయ్ నేతృత్వంలోని కొత్త ప్రభుత్వం 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తిస్థాయి వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టేందుకు సర్వం సిద్ధం చేస్తోంది. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలకు చట్టబద్ధత కల్పించే పలు కీలక బిల్లులు, సంక్షేమ పథకాలకు ఈ బడ్జెట్ సమావేశాల్లోనే రూపకల్పన చేయనున్నారని సమాచారం. స్పీకర్‌గా జేసీడీ ప్రభాకర్ పగ్గాలు చేపట్టినానంతరం పూర్తి స్థాయిలో అసెంబ్లీ సమావేశాలు తాజా సెషన్స్‌లో నడిపించనున్నారు.


