1,000 ఈవీ చార్జింగ్ స్టేషన్లు
సాక్షి, చైన్నె: ఎలక్ట్రిక్ వాహనాల కోసం 1000 ఈవీ చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటులో ముందడగు వేశామని జేఎస్‌డబ్ల్యూఎంజీ మోటారు ఇండియా ప్రకటించింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం జేఎస్‌డబ్ల్యూ మోటార్ ఇండియా సరికొత్త రికార్డును ప్రకటించింది. తమ ప్రతిష్టాత్మక ఈవీ చార్జ్ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా 470కి పైగా ప్రాంతాల్లో 1,000 కమ్యూనిటీ ఈవీ చార్జర్లను విజయవంతంగా ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు. ఈ స్థాయిలో పబ్లిక్, కమ్యూనిటీ ఈవీ చార్జింగ్ మౌలిక వసతులను నిర్మించిన తొలి ఒరిజినల్ ఎక్విప్‌మెంట్ మ్యాన్యుఫ్యాక్చరర్‌గా తాము నిలిచామని వివరించారు. చార్జర్లను ప్రధానంగా రెసిడెన్షియల్ సొసైటీలు, అపార్ట్‌మెంట్లు, ఆస్పత్రులు, విద్యా సంస్థల క్యాంపస్‌లు, హోటళ్లు, పారిశ్రామిక పార్కులలో ఏర్పాటు చేశామన్నారు.
అంబత్తూరులో
విద్యుత్ కోత
– కార్యాలయం ముట్టడి
తిరువొత్తియూరు: అంబత్తూరులో ముందస్తు సమాచారం లేకుండా విద్యుత్ నిలిపివేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్థానికులు విద్యుత్ కార్యాలయాన్ని ముట్టడించి అధికారులతో వాగ్వాదానికి దిగారు. అంబత్తూరు పరిసర ప్రాంతాలైన ఎస్.వి.నగర్, కళ్లికుప్పం, భానునగర్, పుదూర్‌లలో కొన్ని రోజులుగా రాత్రి సమ యాల్లో తీవ్రమైన విద్యుత్ కోతలు విధిస్తు న్నారు. గురువారం రాత్రి 5 గంటలకు పైగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో, విసిగిపోయిన స్థానికులు కళ్లికుప్పంలోని విద్యుత్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఫోన్ చేసినా అధికారులు స్పందించలేదని ఆరోపించారు. కార్యాలయంలో ఉన్న విద్యుత్ అధికారులతో వాగ్వాదానికి దిగారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు కార్యాలయం వదిలి వెళ్లేది లేదని భీష్మించుకుని కూర్చున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ప్రజలతో చర్చలు జరిపారు. అనంతరం అధికారులు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించడంతో పరిస్థితి సద్దుమణిగింది. చెంగల్పట్టు చుట్టుపక్కల గ్రామాల్లో కూడా ఇలాగే ముందస్తు సమాచారం లేకుండా రోజుకు 4 సార్లు విద్యుత్ కోత లు విధిస్తున్నారని, దీనివల్ల రాత్రిపూట నిద్రలేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
ఎంపీసీలో
అడ్మిషన్‌కు నిరాకరణ
పళ్లిపట్టు: ప్లస్–1లో ఎంపీసీ గ్రూపులో చేరి చదువు కోవాలన్న విద్యార్ధిని ఆశయానికి ఉపాధ్యా యులు తూట్లు పొడవడంతో నిరాశ చెందిన విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన అమ్మయార్‌కుప్పంలో శుక్రవారం చోటుచేసుకుంది. ఆర్కే పేట సమీపంలోని నారాయణపురం కీళ్ మోసూరు గ్రామానికి చెందిన తనికాచళం కారు డ్రైవర్. ఇతని కూతురు తమిళరసి(15) అమ్మయార్‌కుప్పంలోని ప్రభుత్వ బాలికల మహోన్నత పాఠశాలలో టెన్త్ పబ్లిక్ పరీక్షల్లో 324 మార్కులు సాధించారు. ఆమె అదే పాఠశాలలో ప్లస్–1లో ఎంపీపీ గ్రూపులో చేరి చదువుకోవాలని ఆసక్తి చూపింది. ఇందుకోసం పాఠశాలలో దరఖాస్తు చేసుకున్నారు. అయితే మార్కులు తక్కువగా వున్నాయని ఉపాధ్యాయులు హేళనగా మాట్లాడి పంపినట్లు, ఈవిషయాన్ని బాలిక తల్లి అనుసూయ వద్ద చెప్పి వాపోయినట్లు తెలిసింది. మనస్తాపం చెందిన తమిళరసి ఇంట్లో గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు అనుసూయ వాపోయారు. పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుత్తణి ప్రభుత్వాస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తమ బిడ్డ మృతికి కారకులైన ఉపాధ్యాయులపై కఠిన చర్యలు తీసుకునేందత వరకు మృతదేహం తీసుకోమని మృతురాలి బంధువులు తెలిపారు.
ప్రియురాలి ఇంట్లో
ప్రియుడు ఆత్మహత్య
తిరువొత్తియూరు: ప్రియురాలి ఇంట్లో ప్రియు డు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తిరువళ్లూరు జిల్లా కావేరిపాక్కం ప్రాంతానికి చెందిన దీపక్ (26), శ్రీపెరంబుదూర్‌లోని ఒక ప్రైవేట్ కర్మాగారంలో ఉద్యోగి. ఇతనికి ఆవడి సమీపంలోని అయపాక్కం తమిళనాడు హౌసింగ్ బోర్డ్ నివాసానికి చెందిన ఒక యువతితో ఇన్‌న్‌స్ట్రాగామ్ ద్వారా పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారింది. వీరిద్దరి పెళ్లి గురించి ఇరు కుటుంబాలు మాట్లాడుకుంటున్న తరుణంలో, పెళ్లి ఆలస్యం అవుతుండడంతో త్వరగా ఏర్పాటు చేయాలని దీపక్ కోరుతూ వచ్చాడు. అయితే వీరిద్దరూ వేర్వేరు మతాలకు చెందినవారని తెలిసింది.ఈ క్రమంలో, గురువారం సాయంత్రం అయపాక్కంలోని తన ఇంటికి దీపక్‌ను సదరు యువతి పిలిచింది. ఇంట్లోని గదిలో ఇద్దరూ మాట్లాడుకుంటుండగా అకస్మాత్తుగా వారి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో మనస్తాపానికి గురైన దీపక్, పక్క గదిలోకి వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.


