సాక్షి, చైన్నె : తమిళనాడులో తక్షణమే కులాల వారీగా జనాభా గణన (సామాజిక న్యాయ గణన) నిర్వహించాలని డిమాండ్ చేస్తూ పీఎంకే నేతృత్వంలో శుక్రవారం అఖిలపక్ష సమావేశం జరిగింది. టీనగర్‌లోని ఓ హోటల్‌లో పార్టీ అధ్యక్షుడు అన్బుమణి రాందాస్ నేతృత్వంలో సమావేశం జరిగింది.
69 శాతం రిజర్వేషన్ల పరిరక్షణ
తమిళనాడులో ప్రస్తుతం అమల్లో ఉన్న 69 శాతం రిజర్వేషన్ల విధానానికి న్యాయస్థానాల ద్వారా కొన్ని శక్తుల నుంచి ముప్పు పొంచి ఉందని పీఎంకే ఆందోళన వ్యక్తం చేసింది. ఈ రిజర్వేషన్లపై కోర్టుల్లో ఉన్న కేసులను బలంగా ఎదుర్కోవాలంటే, సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం కచ్చితమైన కులాల వారీ గణాంకాలు ప్రభుత్వ సర్వే ద్వారా సేకరించడం అత్యంత అవసరమని స్పష్టం చేసింది. రాష్ట్రంలోని ప్రతి కుటుంబ సామాజిక, విద్య, ఆర్థిక స్థితిగతులను ప్రతిబింబించేలా సమగ్ర డేటాను సేకరించాలని, దీనిపై తమిళనాడు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని తీర్మానించారు.
42 పార్టీల మద్దతు..డీఎంకే దూరం
పీఎంకే ఇచ్చిన ఈ ఆహ్వానాన్ని అందుకుని రాష్ట్రంలోని 42 రాజకీయ పార్టీలు, సామాజిక సంస్థల ప్రతినిధులు ఒకే వేదికపైకి వచ్చారు. సమావేశంలో అధికార పక్షమైన తమిళనాడు వెట్రి కళగం, కాంగ్రెస్, బీజేపీ, నామ్ తమిళర్ కచ్చి ,వీసీకే, అన్నాడీఎంకే పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. అయితే, అధికార పక్ష వ్యూహాలతో విభేదిస్తూ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే మాత్రం బహిష్కరించింది.


