తిరువళ్లూరు: మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో సీఎం ఫొటోను ఏర్పాటు చేయాలని తిరువళ్లూరు ఎమ్మెల్యే అరుణ్‌కుమార్, పూందమల్లి ఎమ్మెల్యే కుట్టి మున్సిపల్ కమిషనర్ దామోదరన్‌కు సూచించారు. తిరువళ్లూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం శుక్రవారం ఉదయం చైర్‌పర్సన్ ఉదయమలర్ అద్యక్షత జరిగింది. సమావేశంలో ఉపాధ్యక్షుడు రవి, కమిషనర్ దామోదరన్, శానిటరీ అధికారి మోహన్, కౌన్సిలర్లు హాజరయ్యారు. సమావేశంలో పారిశుధ్యం, తాగునీటి ఎద్దడికి పరిష్కారం, తరచూ ఏర్పడుతున్న విద్యుత్ కోతలు, వీది దీపాల ఏర్పాటుకు నిధుల కొరతపై చర్చలు జరిపారు. తమ వార్డులోని సమస్యలను పరిష్కరించాలని పలువురు కౌన్సిలర్‌లు కోరగా, రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు రాగానే అత్యవసర పనులకు అధిక ప్రాధాన్యత ఇస్తామని చైర్ పర్సన్ హామీ ఇచ్చి సమావేశాన్ని ముగించారు. అయితే కౌన్సిల్ సమావేశంలో మాజీ సిఎం స్టాలిన్ ఫొటో మాత్రమే వున్న విషయం టీవీకే ఎమ్మేల్యేలకు చేరింది. వెంటనే కమిషనర్ కార్యాలయానికి చేరుకున్న ఎమ్మెల్యేలు కౌన్సిల్ సమావేశంలో సీఎం ఫోటో ఏర్పాటుపై చర్చించారు. మాజీ సిఎం ఫోటో వున్న క్రమంలో ప్రస్తుత సిఎం ఫొటోను ఎందుకు పెట్టలేదని కోరారు. ఇందుకు కమిషనర్ స్పందిస్తూ మున్సిపల్ కార్యాలయంలోని అన్ని విభాగాల్లో సీఎం విజయ్ ఫొటోను ఏర్పాటు చేశామని, కౌన్సిల్ హాలులో మాత్రం తీర్మానం ప్రవేశ పెట్టి ఆమోదం పొందిన తరువాత ఏర్పాటు చేస్తామన్నారు. ఇందుకు ఎమ్మెల్యేలు స్పందిస్తూ, తీర్మానం చేసినా, చేయకపోయినా వచ్చే సమావేశం నాటికి సీఎం ఫొటోను ఏర్పాటు చేయాలని తేల్చి చెప్పారు.


