వేలూరు: పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ విధిగా మొక్కలు నాటేందుకు ముందుకు రావాలని కలెక్టర్ వీఎస్ లీల అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవా న్ని పురస్కరించుకొని శుక్రవారం వేలూరు జిల్లా అనకట్టు నియోజకవర్గం పరిధిలోని గ్రామ పంచాయతీలో ని ప్రాంతాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మొక్కలను నాటడం వల్ల పాఠశాలకు వచ్చే విద్యార్థులకు ఆరోగ్యకరమైన గాలి పీల్చేందుకు అవకాశం ఉందన్నారు. వీటిని జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాల టీచర్‌లు, విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. విద్యార్థులందరూ విధిగా ఒక మొక్కను నాటాలనే ప్రతిజ్ఞ చేయిస్తామన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న వాగులు, వంకలతోపాటు రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటడం వల్ల రానున్న తరానికి ఆరోగ్యకరమైన గాలిని పీల్చేందుకు అవకాశం ఉంటుందన్నారు. వీటికి అటవీశాఖ, స్వ చ్ఛంద సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు సంయుక్తంగా కంకణం కట్టుకోవాలన్నారు. అటవీశాఖలో ఒక చెట్టు కూలితే పది చెట్లను నాటాలనే లక్ష్యం పెట్టుకోవాలన్నారు. ఎమ్మెల్యే వేలయగన్, సర్పంచ్ వెంకటేశన్, అటవీ, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. అనంతరం సేవూరు గ్రామ పంచాయతీలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు.


