పలు చోట్ల ఘన స్వాగతం
పుస్తకాలు, యూనిఫాం పంపిణీకి శ్రీకారం
చైన్నెలో ప్రారంభించిన మంత్రి రాజ్ మోహన్
సంతోషంగా చదువుకోవాలని విద్యార్థులకు సీఎం విజయ్ పిలుపు
2026–27 విద్యా సంవత్సరానికి కొత్త పాఠ్యపుస్తకాలు, యూనిఫాంలు, నోట్స్, ఇతర సామాగ్రిని విద్యార్థులకు పంపిణీ ప్రక్రియ మీద విద్యా శాఖ దృష్టి పెట్టింది. ఈ కార్యక్రమాన్ని స్థానికంగా విద్యా మంత్రి రాజ్ మోహన్ ప్రారంభించారు. ఉదయం అరుంబాక్కం ప్రభుత్వ పాఠశాలలో జరిగిన కార్యక్రమానికి పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల ప్రయోజనం కోసం అమలు చేస్తున్న అల్పాహార పథకం, అభ్యాస సామర్థ్యం, విద్య పరంగా కార్యక్రమాలు, విద్యార్థులకు కల్పించిన మౌళిక సదుపాయాలను పరిశీలించారు. పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు యూనిఫాంలు, నోట్‌బుక్‌లు, స్కూల్ బ్యాగులు, పాదరక్షలు, తదితర విద్యా సామాగ్రిని అందజేశారు. అనంతరం రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థులకు ఆయా జిల్లాలలో మంత్రులు, ఎమ్మెల్యేలు పుస్తకాల పంపిణీలో నిమగ్నమయ్యారు. కాగా, గత డీఎంకే ప్రభుత్వం అమలు చేసిన అల్పాహార పథకాన్ని టీవీకే ప్రభుత్వం కూడా అమలు చేస్తూ చర్యలు తీసుకుంది. అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఉదయం అల్పాహారం విద్యార్థులకు అందజేశారు. అన్ని చోట్ల అధికార పక్షానికి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ పథకం అమలును పర్యవేక్షించారు. చైన్నె అన్నానగర్‌లో సాంఘీక సంక్షేమ శాఖమంత్రి జగదీశ్వరి పిల్లలతో కలిసి అల్పాహారం స్వీకరించారు.
సాక్షి, చైన్నె: గతంతో పొల్చితే ఈ సారి వేసవి సెలవులు తక్కువే. పది, ప్లస్ ఒన్, ప్లస్‌టూ పబ్లిక్ పరీక్షల సమయంలో ఎన్నికలు సైతం రావడంతో ఓట్ల ప్రచార సందడి హోరెత్తింది. ఎన్నికల అనంతరం ఓట్ల ఫలితాలు వెలువడ్డ నాలుగో రోజు నుంచే ముందుగా నిర్ణయించిన మేరకు ప్లస్‌టూ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ప్లస్‌టూ ముగించిన విద్యార్థులు ఉన్నత చదువుల మీద దృష్టి పెడుతూ, ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలలో వివిధ కోర్సుల ఎంపిక నిమిత్తం దరఖాస్తులు చేసుకుంటూ వస్తున్నారు. అదే సమయంలో మే నెలలో ఓ వైపు రాష్ట్రంలో అధికార మార్పు తదుపరి హాట్..హాట్‌గా పరిగణామాలు చోటు చేసుకున్నాయి. అదే సమయంలో భానుడు సైతం మరింత భగ ..భగ మండటంతో వేసవి కష్టాలు ఎక్కువే. జూన్ 1వ తేది నుంచి పాఠశాలలు తెరిచేందుకు ముందుగా నిర్ణయించినా, భానుడి సెగ కారణంగా మూడు రోజులు వాయిదా వేశారు. ఎట్టకేలకు గురువారం నుంచి బడి బాటను విద్యార్థులు పట్టక తప్పలేదు.
ఉదయాన్నే..
గురువారం ఉదయాన్నే పిల్లలను రెడి చేసి బడులకు పంపించే ఏర్పాట్లలో తల్లిదండ్రులు మునిగారు. సెలవులు ముగియడంతో 2026–27 విద్యా సంవత్సరం గురువారం నుంచి ప్రారంభమైంది. రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రభుత్వ సహకారంతో నడిచే పాఠశాలలు, ప్రైవేటు పాఠశాలు, సీబీఎస్‌ఈ బడులలో 1 నుంచి 12 తరగతులను ప్రారంభమయ్యాయి. అన్ని పాఠశాలల్లో ముందుగానే మౌళిక సదుపాయాల కల్పన, మరమ్మతులు వంటి ప్రక్రియల్ని ముగించారు. పాఠశాలల పునర్ ప్రారంభంతో ఉదయాన్నే విద్యార్థులు బడి బాట పట్టారు. అనేక పాఠశాలల వద్ద విద్యార్థులను ఆహ్వానిస్తూ ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. రోజా పువ్వులు, చాక్లెట్లు, స్వీట్లు పంచి పెట్టారు. ఇక, విద్యార్ధుల్ని తీసుకెళ్లే వాహనాల్లో ఓవర్ లోడింగ్‌లకు ఆస్కారం ఇవ్వని రీతిలో అధికారులు నిఘాతో వ్యవహరించారు.
అల్పాహార పథకం
అమలులలో పిల్లలతో
మంత్రి జగదీశ్వరి
విద్యార్థులకు సీఎం శుభాకాంక్షలు
సీఎం విజయ్ ఎక్స్ పేజీ వేదికగా విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. విద్యా సంవత్సరం ప్రారంభాన్ని పురస్కరించుకుని విద్యార్థుల్లో సరికొత్త ఉత్సాహాన్ని ఈ పోస్టు పెట్టారు. ‘కొత్త ఆశలు, ఆశయాలతో ఈ విద్యా సంవత్సరం మొదటి రోజున పాఠశాలలకు వెళ్తున్న నా ప్రియమైన విద్యార్థి లోకానికి నా మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు’ అని వ్యాఖ్యలు చేశారు. మీ భవిష్యత్తును వెలుగుమయం చేయగల ఏకై క శక్తి ఒక్క ’విద్య’కు మాత్రమే ఉందని, ఉన్నతమైన కలలు కనండి, వాటిని సాకారం చేసుకునేందుకు కష్టపడి చదవండి. మీరు పాఠశాలకు వెళ్లే ప్రతి రోజూ మీ జీవిత పురోభివృద్ధికి ఒక బాట కావాలి. ఎల్లప్పుడూ సంతోషంగా చదువుకోండి, విజయం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది!’ అని ఆకాంక్షించారు.
తమిళనాట పాఠశాలలు పునఃప్రారంభం


