రాష్ట్రంలోకి భారీగా పెట్టుబడులు | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలోకి భారీగా పెట్టుబడులు

Jun 5 2026 4:29 AM | Updated on Jun 5 2026 4:29 AM

● కోవై, కంచి, తిరువళ్లూరుకు రూ. 18 వేల కోట్లు ● 8,200 మందికి ఉద్యోగాలు ● సీఎం విజయ్‌ సమక్షంలో ఒప్పందాలు ● కాంచీపురం జిల్లాలో రూ.15,000 కోట్ల భారీ పెట్టుబడితో అధునాతన ఇన్ఫర్మేషన్‌ డేటా సెంటర్‌ విస్తరణ ప్రాజెక్టును ఏర్పాటు చేయనున్నారు. దీని ద్వారా 500 మంది ఐటీ నిపుణులకు ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తుంది. కోయంబత్తూరులో రూ.2,500 కోట్ల వ్యయంతో ఎలక్ట్రానిక్స్‌ – ఎలక్ట్రానిక్‌ సిస్టమ్స్‌ తయారీ యూనిట్‌ను నెలకొల్పుతారు. ఈ ప్రాజెక్టు ద్వారా 2,000 మంది యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ● తిరువళ్లూరులో రూ.1,100 కోట్ల అంచనా వ్యయంతో కాట్టుపల్లి ఎల్‌అండ్‌టీ షిప్‌యార్డ్‌ (నౌక నిర్మాణ కేంద్రం) విస్తరణ పనులను చేపట్టనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా అత్యధికంగా 5,700 మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి లభించనుంది.

1.5 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం

సాక్షి, చైన్నె : అధికార పగ్గాలు చేపట్టినానంతరం ప్రపథమంగా తమిళనాడు పారిశ్రామిక రంగంలో సరికొత్త శకానికి సీఎం జోసెఫ్‌ విజయ్‌ నాంది పలికారు. రాష్ట్రంలో ఏకంగా రూ.18,600 కోట్ల భారీ పెట్టుబడులతో మూడు మెగా ప్రాజెక్టులను చేపట్టేందుకు చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగా ప్రముఖ మౌలిక సదుపాయాల దిగ్గజం లార్సన్‌ అండ్‌ టూబ్రో ( ఎల్‌ అండ్‌ టీ) ముందుకు వచ్చింది. దీని ద్వారా సుమారు 8,200 మందికి ఉపాధి లభించనుంది. సీఎం విజయ్‌ నేతృత్వంలో కొత్త ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన తర్వాత పరిశ్రమల శాఖలో జరిగిన మొట్టమొదటి అవగాహన ఒప్పందం గురువారం జరిగింది. ఈమేరకు చైన్నెలోని సచివాలయంలో సీఎం విజయ్‌ సమక్షంలో ఎల్‌అండ్‌టీ సంస్థ ఛైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎస్‌.ఎన్‌. సుబ్రహ్మణ్యన్‌ ఈ కీలక ఒప్పందాలపై సంతకాలు చేశారు. తమిళనాడులో ఎల్‌అండ్‌టీ గ్రూప్‌ మరిన్ని పెట్టుబడులతో తన ఉనికిని చాటుకోవడాన్ని సీఎం అభినందించారు. రాష్ట్రంలో ఆ సంస్థ భవిష్యత్‌ విస్తరణ ప్రాజెక్టులకు ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం, మద్దతు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. ఈమేరకు తమిళనాడు వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో వేర్వేరు రంగాల్లో ఈ మూడు ప్రాజెక్టులను ఎల్‌అండ్‌టీ చేపట్టనుంది.

2036 నాటికి తమిళనాడు ఆర్థిక వ్యవస్థను 1.5 ట్రిలియన్‌ డాలర్ల స్థాయికి చేర్చాలనే సీఎం జోసెఫ్‌ విజయ్‌ ప్రతిష్టాత్మక లక్ష్యానికి ఈ మల్టీ–సెక్టార్‌ పెట్టుబడులు ఒక మైలురాయిగా నిలవనున్నాయని సచివాలయం వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ప్రాజెక్టుల ద్వారాా రాష్ట్రంలో డిజిల్‌ మౌలిక సదుపాయాలు, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ రంగాలు మరింత బలోపేతం అవుతాయన్నా. అలాగే కాట్టుపల్లి షిప్‌యార్డ్‌ విస్తరణ ద్వారా కోస్టల్‌ విండ్‌ పవర్‌ (సముద్ర తీర పవన విద్యుత్‌) రంగానికి అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు సమకూరుతాయని పేర్కొన్నారు. ముందుగా సచివాలయంలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ ప్రాజెక్టుల గురించి చర్చించారు.ఈ కార్యక్రమంలో తమిళనాడు పరిశ్రమల శాఖ మంత్రి ఎస్‌. కీర్తన, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ సాయికుమార్‌, పరిశ్రమల శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ విజయకుమార్‌ , గైడెన్స్‌ తమిళనాడు ఎండీ డాక్టర్‌ అలర్మేల్‌మంగై , ఎల్‌అండ్‌టీ ప్రతినిధి కె.జి. సత్యనారాయణన్‌ ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement