న్యూస్‌రీల్
సాక్షి, చైన్నె: ఖనిజ వనరుల నిర్వహణ, అన్వేషణలో తమిళనాడును దేశంలోనే ఒక రోల్ మోడల్ రాష్ట్రంగా మార్చడమే లక్ష్యంగా జియాలజీ అండ్ మైనింగ్ శాఖ పని చేయాలని సీఎం జోసెఫ్ విజయ్ ఆదేశించారు. గురువారం చైన్నె సచివాలయంలో సీఎం విజయ్ అధ్యక్షతన సహజ వనరుల శాఖ పనితీరుపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పర్యావరణానికి, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా శాసీ్త్రయ పద్ధతుల్లో ఖనిజాలను వెలికితీయడం , అక్రమ రవాణాను అరికట్టడంపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సమావేశంలో అధికారులు ఖనిజ వనరుల పరిరక్షణకు తీసుకోబోయే పలు ఆధునిక సాంకేతిక విధానాలను సీఎంకు వివరించారు. ప్రకృతి ప్రసాదించిన ఖనిజ వనరులను భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకుని సుస్థిరాభివృద్ధికి అనుగుణంగా మాత్రమే ఉపయోగించాలని అధికారులకు సూచించారు. ఖనిజ వనరుల ద్వారా రాష్ట్రానికి వచ్చే ఆదాయాన్ని పెంచేందుకు తగిన చర్యలు చేపట్టాలని, అదే సమయంలో ఎక్కడా కూడా చట్టవిరుద్ధంగా ఖనిజాల అక్రమ రవాణా జరగకుండా కఠినమైన నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలని విజయ్ స్పష్టం చేశారు. సమావేశంలో మంత్రులు ఎన్. ఆనంద్, టి.కె. ప్రభు, మరియ విల్సన్, సీఎస్ సాయికుమార్, ఆర్థిక శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి ఎమ్.ఏ. సిద్దిఖ్, నీటి వనరుల శాఖ ప్రధాన కార్యదర్శి సత్యప్రద సాహూ ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
రాజ్యసభ రేసులోకి ప్రవీణ్ చక్రవర్తి
సాక్షి, చైన్నె: తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్రం నుండి ఖాళీగా ఉన్న ఒకే ఒక్క రాజ్యసభ ఎంపీ స్థానానికి జరగబోయే ఉపఎన్నికలో అధికార పక్షం టీవీకే మద్దతుతో కాంగ్రెస్ నేత ప్రవీణ్‌చక్రవర్తి ఎంపీ కానున్నారు. ఆయన కోసమే టీవీకే అధినేత, సీఎం విజయ్ ఈ పదవిని బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించారు. ఈ స్థానానికి జూన్ 18న ఎన్నిక జరగనుండగా, శుక్రవారం ప్రవీణ్ చక్రవర్తి తన నామినేషన్ దాఖలు చేసే అవకాశం ఉందని సమాచారాలు వెలువడ్డాయి. తమిళనాడు అసెంబ్లీలో అధికార కూటమికి ఉన్న స్పష్టమైన మెజారిటీ నేపథ్యంలో ప్రవీణ్ చక్రవర్తి ఎన్నిక ఏకగ్రీవం కావడం ఖాయంగా కనిపిస్తోంది.
ప్రవీణ్ చక్రవర్తికి కానుక
ఇటీవల ముగిసిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే కూటమి నుండి కాంగ్రెస్‌ను బయటకు తీసుకువచ్చి, విజయ్ నేతృత్వంలోని టీవీకేతో పొత్తు కుదిర్చడంలో ప్రవీణ్ చక్రవర్తి అత్యంత కీలక పాత్ర పోషించారు. కాంగ్రెస్ డేటా విభాగా నికి అధిపతిగా ఉన్న ప్రవీణ్ చక్రవర్తి ఆ పార్టీ నేత రాహుల్ గాంధీకి అత్యంత ఆప్తుడు. చైన్నెలోనే పుట్టి పెరిగిన ఈయన ఆర్థిక శాస్త్రవేత్తగా, విదేశాలలో ఉన్నత చదువులు చదివిన మేధావిగా గుర్తింపు పొందారు. గతంలో మైలాడుతురై లోక్‌సభ సీటు విషయంలో రెండుసార్లు రాజకీయ ఒత్తిళ్ల కారణంగా జేజారింది. తమిళనాడులో క్షేత్రస్థాయి రాజకీయ పరిస్థితులు మారాయని, డీఎంకే కంటే విజయ్‌తో పొత్తు పెట్టుకుంటేనే భవిష్యత్తు ఉంటుందని రాహుల్ గాంధీకి డేటా ఆధారిత నివేదికలు ఇచ్చింది ప్రవీణే కావడం గమనార్హం.
అన్నామలై ట్వీట్!
– నేడు 12 గంటలకు కీలక ప్రకటన
సాక్షి, చైన్నె: తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షుడు,కె. అన్నామలై కొత్త పార్టీని స్థాపించబోతున్నారనే ప్రచారం సాగుతోంది. గురువారం పుట్టినరోజు జరుపుకున్న ఆయన సోషల్ మీడి యా వేదికగా చేసిన ఒక ట్వీట్ ఈ ఊహాగానాలకు మరింత బలాన్ని చేకూర్చింది. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు సోషల్ మీడియా ద్వారా మీ అందరినీ కలవడానికి ఎదురుచూస్తున్నాను అని అన్నామలై ట్వీట్ చేశారు. ఈ ప్రకటనతో ఆయన తన సరికొత్త రాజకీయ ప్రయాణాన్ని సంకేతాలు వెలువడ్డాయి.


