సాక్షి, చైన్నె : పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ (ఎల్‌జీ) అధికారిక నివాసం, కార్యాలయం అయిన లోక్ నివాస్(రాజ్ భవన్) గురువారం సరికొత్త భవనంలోకి మారింది. బీచ్ రోడ్డుకు ఆనుకుని ఉన్న కుబేర్ వీధిలోని నూతన సముదాయంలో లోక్ నివాస్ కార్యకలాపాలు అధికారికంగా ప్రారంభమయ్యాయి. కొత్త కార్యాలయంలో అడుగుపెట్టిన లెఫ్టినెంట్ గవర్నర్ కె. కై లాష్‌నాథన్ తన మొదటి రోజు విధుల్లో భాగంగా.. రాష్ట్రంలోని మహిళలు, వృద్ధులకు లబ్ధి చేకూర్చే 3 అత్యంత కీలకమైన ప్రభుత్వ ఫైళ్లపై సంతకాలు చేసి ఆమోదం ముద్ర వేశారు.
ఆమోదం పొందిన 3 కీలక ఫైళ్ల వివరాలు
రాష్ట్రంలో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న 21 నుండి 55 ఏళ్ల లోపు వయసు గల కుటుంబ మహిళా యజమానులకు (కుటుంబ పెద్దలకు) ఇచ్చే నెలవారీ ఆర్థిక సహాయాన్ని రూ.2,500కు పెంచుతూ గవర్నర్ మొదటి ఫైలుపై సంతకం చేశారు. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 64,450 మంది మహిళలకు ప్రయోజనం చేకూరనుంది. ఈ పథకం కోసం ప్రభుత్వం రూ.16.11 కోట్లను కేటాయించింది. వృద్ధులు, నిరాశ్రయులైన మహిళలకు అందించే నెలవారీ సామాజిక పింఛన్ల నిధుల విడుదలకు గవర్నర్ ఆమోదం తెలిపారు. మొత్తం 1,96,616 మంది లబ్ధిదారులకు వారి అర్హతను బట్టి రూ.2,500, రూ.3,000 మరియు రూ.4,000 చొప్పున పెన్షన్ అందనుంది. ఏప్రిల్ నెలకు సంబంధించిన పెన్షన్ల పంపిణీ కొరకు రూ.56.32 కోట్ల బడ్జెట్‌కు ఆమోదం లభించింది. పుదుచ్చేరి పారిశ్రామిక అభివృద్ధి సంస్థ వాటాదారులైన పుదుచ్చేరి ప్రభుత్వం ఐడీబీఐ బ్యాంకుకు డివిడెండ్ వాటా కింద రూ.37.76 లక్షలు , ప్రత్యేక వాటా నిధుల చెల్లింపుల ఫైలుపై గవర్నర్ సంతకం చేశారు.
కార్యాలయ మార్పునకు కారణం
భారతి పార్క్ ఎదురుగా ఉన్న పాత లోక్ నివాస్ భవనం చాలా పురాతనమైనది కావడంతో, దానికి త్వరలోనే పునరుద్ధరణ పనులు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో, పాత డిస్టిలరీ ప్రాంగణంలో అత్యాధునికంగా నిర్మించిన కొత్త భవనంలోకి గవర్నర్ కార్యాలయాన్ని తాత్కాలికంగా తరలించారు. నూతన కార్యాలయంలో తొలిరోజే ప్రజా సంక్షేమ ఫైళ్లకు ఆమోదం తెలపడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.


