సాక్షి ,చైన్నె: తమిళనాడు విద్యుత్ బోర్డు ప్రధాన కార్యాలయంలో అత్యంత కీలకమైన డేటా ఉన్న హార్డ్ డిస్క్‌లు మాయమవడం చర్చకు దారి తీసింది. ఈ వ్యవహారంపై ప్రస్తుతం ఉన్నత స్థాయి విచారణ జరుగుతోందని, ఇందులో తప్పు చేసిన వారు ఎంతటి వారైనా సరే.. ఎవ్వరూ తప్పించుకోలేరని ఆ శాఖ మంత్రి నిర్మల్‌కుమార్ స్పష్టం చేశారు. వివరాలు.. టీవీకే ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్యుత్ బోర్డులో భారీ స్కాం జరిగినట్టుగా గుర్తించి, పలువురు అధికారులను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో ఆ కార్యాలయంలో కీలక హార్డ్ డిస్క్‌లు మాయం కావడం తాజాగా వెలుగులోకి వచ్చింది. రూ. 397 కోట్ల ట్రాన్స్ ఫార్మర్‌ల కొనుగోలు, ఇతర టెండర్లు, ఉద్యోగ నియామకాలకు సంబంధించిన అంశాలు ఉన్న ఈ హార్డ్ డిస్క్‌లు గత నెల 16,17 తేదీలలో మాయమైనట్టు గుర్తించారు.
మాయమైన ఐదేళ్ల అవినీతి రికార్డులు
ఈ వ్యవహారంపై మంత్రి నిర్మల్‌కుమార్ మాట్లాడుతూ, కీలకమైన విభాగాల నుండి కొన్ని హార్డ్ డిస్క్‌లు చోరికి గురైనట్టు, గత ఐదేళ్ల కాలంలో జరిగిన ప్రభుత్వ విద్యుత్ ఒప్పందాలు, ఇతర డాక్యుమెంట్లు , ఉద్యోగ నియమాకాలు తదితర అంశాలకు సంబంధించి ఈ హార్డ్ డిస్క్‌లలో వివరాలు ఉన్నాయన్నారు. ప్రస్తుతం ఆడిట్ నిర్వహిస్తున్నారని, పూర్తి నివేదిక వచ్చాకే ఎన్ని హార్డ్ డిస్క్‌లు మాయమైనట్టో అన్న కచ్చితమైన సంఖ్య తెలుస్తుందన్నారు. గత నెలలో శాఖకు చెందిన కొందరు అధికారులను అవినీతి ఆరోపణలపై సస్పెండ్ చేశామని గుర్తు చేస్తూ, ఆతర్వాత ఈ చోరీ జరగడంతో వారిపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. సెంథిల్ బాలాజీ మంత్రిగా ఉన్న కాలంలోనే విద్యుత్ శాఖలో భారీగా ట్రానన్స్‌ఫార్మర్ల అవినీతి జరిగిందని, దీనిపై విచారణ కొనసాగుతోందన్నారు. అయితే ఈ ఆరోపణలను సెంథిల్ బాలాజీ తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో తీవ్ర విద్యుత్ సంక్షోభం నెలకొని ఉందని, ఈ సమస్యను అధిగమించ లేని పరిస్థితుల్లో డిస్క్‌లు మాయం అంటూ నాటకమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిస్క్‌లు టీవీకే హయంలో మాయమైందన్న విషయాన్ని అందరు గుర్తెరగాలన్నారు. ఇక, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పళనిస్వామి స్పందిస్తూ ఈ వ్యవహారాన్ని సీబీఐ విచారణకు అప్పగించాలని డిమాండ్ చేశారు. గత డీఎంకే ప్రభుత్వ అక్రమాలను కప్పిపుచ్చేందుకు టీవీకే ప్రభుత్వం తోడ్పాటు అందిస్తున్నట్టు అనుమానం కలుగుతోందని ఆరోపించారు.


